iDreamPost

Lakshmi : లేడీ టైటిల్ తో సూపర్ హిట్ సినిమా  – Nostalgia

Lakshmi : లేడీ టైటిల్ తో సూపర్ హిట్ సినిమా  – Nostalgia

2005. భీభత్సమైన ఫామ్ లో ఉన్న వివి వినాయక్ తో చేసేందుకు హీరోలు పోటీ పడుతున్న సమయం. చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లతో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు పడ్డాక వెంకటేష్ ఫ్యాన్స్ తమ హీరోతోనూ ఈ కాంబో పడాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న వెంకీ మాస్ విషయంలో కొంత వెనుక బడ్డారు. కేవలం కుటుంబ వర్గానికే పరిమితం కావడం ఇష్టం లేదు. అలాంటి పరిస్థితిలో రచయిత ఆకుల శివ ఇచ్చిన కథే లక్ష్మి. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించి విశేషాలు చూద్దాం

లక్ష్మి నారాయణ అనే వ్యాపారవేత్త అనాథ అయిన తనను పెంచి పెద్ద చేసిన వ్యక్తికిచ్చిన మాట కోసం, చెలెళ్ళు తమ్ముళ్ల బాగు కోసం ఎండి పొజిషన్ నుంచి అదే ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేయడం వరకు ఒక కంప్లీట్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వివి వినాయక్ లక్ష్మిని తీర్చిదిద్దారు. నయనతార మెయిన్ హీరోయిన్ కాగా రెండో కథానాయికగా చార్మీ నటించింది. పవన్ కళ్యాణ్ సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న రమణ గోగుల ఇందులో పాటలు కంపోజ్ చేశారు. కానీ హెవీ సబ్జెక్టు కావడంతో వినాయక్ ప్రత్యేక అభ్యర్థన మీద మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించేందుకు ఒప్పుకున్నారు. ప్రభాస్ యోగికి కూడా ఇలాగే రిపీట్ చేశారు.

2006 జనవరి 14న విడుదలైన ‘లక్ష్మి’ ఘన విజయం సాధించింది. 12 కోట్ల బడ్జెట్ తో రూపొంది 22 కోట్ల దాకా వసూలు చేయడం విశేషం. సంక్రాంతి రేస్ లో అదే నెల 11న రిలీజైన రామ్-వైవిఎస్ చౌదరిల ‘దేవదాస్’ గట్టి పోటీ ఇవ్వడంతో యూత్ నుంచి కొంత కలెక్షన్ తగ్గింది కానీ లేదంటే ఇంకా ఎక్కువ వచ్చేదని ట్రేడ్ మాట. లక్ష్మి ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అన్ని రకాల ఎమోషన్లతో పాటు ఎంటర్ టైన్మెంట్ ని సరైన  పాళ్ళలో మిక్స్ చేయడం. ముఖ్యంగా తెలంగాణ శకుంతల-వేణుమాధవ్ ల కామెడీ ట్రాక్ ఓ రేంజ్ లో పేలింది. లక్ష్మి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చిరంజీవి మాస్టర్(1997) నుంచి స్ఫూర్తి తీసుకుని రాసుకున్నప్పటికీ ఆ తలంపు రాకుండా వినాయక్ మేజిక్ చేశారు. టైటిల్ ప్రకటించినప్పుడు ఇదేంటి మహిళ పేరు పెట్టారని కామెంట్స్ వచ్చినా అదే పర్ఫెక్ట్ అనిపించుకుంది

Also Read : Veede : గ్రామం కోసం నగరంలో పోరాడిన యువకుడు – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి