iDreamPost

కృష్ణా – గోదావరి.. గెజిట్‌ అమలు గడువు పెంపుతో మేలెంత?

కృష్ణా – గోదావరి.. గెజిట్‌ అమలు గడువు పెంపుతో మేలెంత?

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ జారీ చేసిన గెజిట్‌ అమలు గడువును ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సవరణ గెజిట్‌ను కూడా విడుదల చేసింది. 2020 అక్టోబరు 6వ తేదీన జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతేడాది జూలై 15వ తేదీన కేంద్రం గెజిట్‌ జారీ చేసిన విషయం విదితమే. గెజిట్‌ విడుదలైన తేదీ నుంచి 60 రోజుల్లోపు అంటే సెప్టెంబరు 14 లోగా తెలుగు రాష్ట్రాలు ఏకమొత్తంగా చెరో రూ.200 కోట్లను బోర్డుల ఖాతాలో జమచేయాలని కేంద్రం గడువు విధించింది. గడువులోగా తెలుగు రాష్ట్రాలు జమ చేయలేదు. దీంతో గడువును వచ్చే జూలై 14 వరకు పొడిగించారు.

గెజిట్‌ విడుదలైన ఆర్నెల్ల లోపు(2022 జనవరి 14వ తేదీలోపు) ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోకపోతే ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని గెజిట్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ గడువును కూడా జూలై 14 దాకా (ఆరు నెలల పాటు) పొడిగించారు. అంటే, ఉభయ రాష్ట్రాలకు అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ఊపిరి పీల్చుకోవడానికి వెసులుబాటు దక్కింది.

గత ఏడాది జూలై 14న గెజిట్‌ విడుదల కావడంతో అనుమతిలేని ప్రాజెక్టులకు కేంద్ర రుణ సంస్థలు/బ్యాంకుల నుంచి రుణాల విడుదల ఆగిపోయింది. కృష్ణాలో కీలకమైన, నిర్మాణంలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులు కేంద్ర రుణ సంస్థల నిర్ణయంతో పాటు ఎన్జీటీ ఉత్తర్వుల కారణంగా ఆగిపోయాయి. గోదావరిలో నిర్మాణంలో ఉన్న సమ్మక్క సాగర్‌(ఏటూరునాగారం), సీతారామలకు కేంద్ర సంస్థలు అనుమతులు తెచ్చుకోవడానికి కొంత వెసులుబాటు ఇచ్చాయి. ఆయా ప్రాజెక్టులకు జూలై 14వ తేదీ దాకా వెసులుబాటు లభించింది. గెజిట్‌ అమలు గడువును పొడిగించాలని తెలంగాణ, ఏపీలు చేసుకున్న విజ్ఙప్తితోనే గెజిట్‌లోని క్లాజులను సవరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని జాబితాలో పెట్టిన ప్రాజెక్టులను తొలగించాలని, అక్కరలేని ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించారని, వీటికి మినహాయించాలని తెలుగు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి