iDreamPost

కొండపొలం …పొట్టేలు తగిలినట్టు తగలాల. తలకయ పగిల్నా ఎనక్కు రాగూడదు

కొండపొలం …పొట్టేలు తగిలినట్టు తగలాల. తలకయ పగిల్నా ఎనక్కు రాగూడదు

‘శప్తభూమి’కి గానూ కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి, రచయిత్రి కాత్యాయని విద్మహే మరియు ఇతర సాహిత్యాభిమానుల సమక్షంలో సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి గారు రచించిన ‘కొండపొలం’ నవల ఆవిష్కరణ నిన్న రవింద్ర భారతిలో ఘనంగా జరిగింది. నవల ఆవిష్కరణతో పాటు తానా వారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే రెండు లక్షల సాహిత్య పురస్కారం సుమారు 54 నవలల మధ్య వడపోత అనంతరం ఏకగ్రీవంగా దీన్ని ఎంపిక చేయడం అంతగా ఏముంది ఈ నవలలో అనే ప్రత్యేక ఆసక్తి కలిగించకపోదు.

సన్నపురెడ్డి గారు వృత్తి రీత్యా జీవశాస్త్ర ఉపాధ్యాయుడైనా పల్లె పొలాల మట్టి వాసనల అమృతాన్ని అనువణువూ ఆస్వాదించగల నిఖార్సైన కథకుడు. ఆయన కథా నేపథ్యమెప్పుడూ ఆ పల్లెలోనే ఉంటుంది. గొర్రెల మేపు కోసమై నల్లమల అడవుల్లోకెళ్లి ఏడెనిమిది బత్తెముల కాలం పాటు అంటే నెలన్నరకు పైగా అడివిలోనే బతుకుతూ అప్పుడప్పుడూ దాడి చేసే కృూర మృగాల బారి నుంచి వాటినీ తమనూ రక్షించుకుంటూ, ఎర్ర చందనం స్మగ్లర్ల ధాటికి భయపడుతూనే పెళ్లాం పిల్లోల్లను వదిలి గొర్రెలనే తమ స్వంత బిడ్డలుగా చూసుకునే యాదవుల(గొల్లల) జీవన విధానమే ఈ రచన. దీన్ని ఒక నవల అనేకంటే కరువు సీమలో పశు పోషకుల వ్యథలను పాఠకుని కళ్ళకు కట్టినట్టు చూపించే జీవిత చిత్రమనడం భావ్యమేమో.

ఈ పుస్తకం కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఈ నవల కోసమే ఎందుకంటే రచనా వ్యాసంగం పట్ల నాకున్న అభిరుచిని లేటుగా గమనించిన నేను భాష మీద పట్టు కోసం చిన్నప్పటి నుండి నా జీవితంలో జరిగిన అనుభవాలకు కొంచెం కాల్పనికత జోడిస్తూ రాయలసీమ యాసతో చిన్న చిన్న కథలను రాయడం మొదలుపెట్టాను. అలా ‘మల్లి గాని బత్తెం’ పేరుతో గొర్ల మేత కోసం కొండకు తోలుకునిపోయి మేపే వృత్తాంతంతో కథ మొదలుపెట్టి భాగాలుగా పోస్టు చెయ్యడం మొదలుపెట్టాను. ఒక రోజు నేను గురుతుల్యులుగా భావించే సన్నపురెడ్డి గారు ఫేస్బుక్లో కథ చదివి బాగా రాస్తున్నావు అని కొన్ని సలహాలిచ్చి చివర్లో ఇదే కథనంతో నేను కొండపొలం అనే నవల రాశాను దానికి తానా వారు రెండు లక్షల బహుమతి ఇచ్చారనగానే ఇదే సబ్జెక్టు మీద మీరు రాశారంటే ఇక నేను రాయడం వ్యర్థం నా కథ ఇంతటితో ఆపేస్తాను అని చెప్పాను దానికి ఆయన ఆపొద్దు రాయి నీ శైలి నీది నా శైలి నాది అని చెప్తే సరే రాస్తాను గానీ మీ నవల రిలీజయ్యాక అది చదివిన తర్వాత మీకంటే నా రచన కొంచెమైనా కొత్తదనాన్ని పంచగలదనిపిస్తే రాస్తా లేకుంటే రాయనని చెప్పాను. ఇది జరిగి నాలుగు నెలలు పైగా అయ్యింది. అందుకే ఆ నవల ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా చదువుదామా అని అంత ఎగ్జైట్మ్ంటు.

టైముంది కదా అని కొండపొలం నవల తెరిచా.. అందులో నాలుగేళ్లుగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ప్రతిసారీ ఫెయిలవుతున్న కొడుకునుద్దేశించి తండ్రి పాత్ర ఇలా అంటుంది “తొలిసారో మలిసారో… అంతే… ఇన్నిసార్లు ఓడిపోగూడదు నాయనా! పొట్టేలు తగిలినట్టు తగలాల. తలకయ పగిల్నా ఎనక్కు రాగూడదు… నువ్వంత గాయపన్నెట్టు నేనెప్పుడూ సూడలే…” ఆ వాఖ్యలు చదవగానే ఎదలోతుల్లో ఏదో తెలియని చిన్న అలజడి. చెట్టు కొమ్మ అనుకుని కొండ చిలువ మీద కూర్చోవడం, అడవిలో ఈలల ద్వారా అయ్యి నెరిపే ప్రణయ కథలు ఇలా ఎన్నో ఉన్నాయి ఈ నవలలో.

ఒకనాడు గొర్రెలను తినడానికి పెద్ద పులొస్తుంది. గొర్రెల్నెక్కడ చంపుతుందో అనే ఆరాటంలో దాని మీద దాడి చేద్దామని ఒక యువకుడంటే ఆ సమూహానికి పెద్దయిన పుల్లయ్య వద్దు అది మన రాజ్యంలోకి రాలేదు దాని రాజ్యంలోకే మనమొచ్చాం కాబట్టి దాని ఆకలి అది తీర్చుకుని పోనీ ఆ పోయే గొర్లు గెడ్డి మేపుకోడానికి అనుమతిచ్చినందుకు ప్రభుత్వానకి మనం కట్టే పుల్లరి పన్ను అనుకో అంటూ ప్రకృతి సహజ న్యాయాన్ని తెలియజేయడం ఈ రచన కోసం ఆయన పడ్డ మానసిక సంఘర్షణ పాఠకుడిగా మనకు అవగతమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి