iDreamPost

దాయాది అంత పని చేస్తోందా..?!

దాయాది అంత పని చేస్తోందా..?!

మానవాళి మనుగడకే పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలు పోరాటం చేస్తున్నాయి. కనిపించని శత్రువుతో యుద్ధం చేసేందుకు ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నాయి. కష్టకాలంలో ఆపన్న హస్తాలు అందించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దాయాది పాకిస్థాన్ భారతదేశంపై బయోవార్ కు సిద్ధమైందా..? ఇప్పటి వరకు ఆయుధాలతో ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపిన పాకిస్తాన్.. తాజాగా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను భారత్ లోకి పంపిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.

పాకిస్తాన్ కూడా కరోనా వైరస్ బారిన పడింది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అక్కడ కరోనా సోకిన వ్యక్తులను పాక్ ఆక్రమిత ఆక్రమిత కాశ్మీర్ కు పంపుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వారిని నేపాల్ కు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. నేపాల్ నుంచి భారతదేశంలోకి పంపేందుకు రెండు వందల మందిని ఒక మసీదులో ఉంచారన్న సమాచారం తమకు వచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ సరిహద్దుల్లో ఇప్పటికే కొంత మందిని భద్రతా బలగాలు పట్టుకున్న ఆయన తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దులో భద్రతా బలగాలను అప్రమత్తం చేశామని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో కరోనా వైరస్ రెండో స్టేజిలో ఉందని ఆయన తెలిపారు. మర్కజ్ వల్లే దేశంలో 80 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని కిషన్ రెడ్డి చెప్పారు.

కాగా కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలతో పాటు పాకిస్తాన్, భారత దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్ డౌన్ లాంటి అసాధారణ నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడికి పలుదేశాలు ఆర్మీ సేవలను కూడా ఉపయోగించుకుంటున్నాయి. దేశంలో కూడా పలు చోట్ల ఆర్మీ తన సేవలను అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన వక్రబుద్ధి ని పాకిస్తాన్ ఏమాత్రం మార్చుకోలేదు. సరిహద్దు వద్ద యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. భారత బలగాల పై కాల్పులకు తెగబడుతోంది. భారత బలగాలు కూడా పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపులకు ధీటుగా జవాబిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి