iDreamPost

హీరోని దేవుడంటే ప్రేక్షకులు ఒప్పుకోలేదా – Nostalgia

హీరోని దేవుడంటే ప్రేక్షకులు ఒప్పుకోలేదా – Nostalgia

సరిగ్గా 11 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ఒక చిన్న పట్టణంలో తెల్లవారుఝామున మహేష్ బాబు కొత్త సినిమా బెనిఫిట్ షో చూసి బయటికి వస్తున్న కుర్రాడు కం అభిమాని మనసులో రకరకాల అనుమానాలు. పక్కవాడిని అడిగి తీర్చుకుందామంటే వాళ్లకూ అవే సందేహాలు. ఏదో అసంతృప్తి. అతడు కాంబినేషన్ కదా దానికి మించి ఉందనుకుంటే ఇలా అయ్యిందేమిటి అనే నిట్టూర్పు కుదురుగా ఉండనివ్వడం లేదు. బాబుకి మరో ఫ్లాప్ ఖాయమని మనసు చెబుతోంది. తోటి అభిమానులు హిట్ అని పైకి అంటున్నా అది నిజం కాదని అతని ఆత్మసాక్షి ఘోషిస్తోంది. ఇంతకీ ఏంటా ప్రశ్నలు అనేగా మీ ప్రశ్న. మచ్చుకు శాంపిల్ చూద్దాం

” మహేష్ బాబు తలుచుకుంటే చనిపోయిందనుకున్న పాప ప్రాణాలతో లేచొస్తుంది. చెప్పగానే గోడ పడిపోతుంది. కోరుకొగానే నీళ్లు పారుతాయి. మరి దేవుడి శక్తులు ఉన్న మహేష్ ఆ ఊరికి అన్యాయం చేసినవాడు చచ్చిపోవాలని కోరుకుంటే సరిపోద్దిగా. అంతకష్టపడి వాడిని వెతికి పట్టుకుని పాత సినిమా స్టైల్ లో క్లైమాక్స్ లోనే చంపడం ఎందుకు”

ఇలా ఆలోచించడం నిజమే అనిపించినా సిల్లీగా అనిపించినా దర్శకుడు చెప్పాలనుకున్న విషయంలో తడబాటు జరిగినప్పుడు లాజిక్ ని డిమాండ్ చేసే ఇలాంటి క్వశ్చన్లు వద్దన్నా వినిపిస్తూనే ఉంటాయి. మగధీరలో చేతి వేళ్ళు తాకితే నాలుగు వందల ఏళ్ళు వెనుక ఫ్లాష్ బ్యాక్ ఎలా గుర్తొచ్చిందని ఎవరూ అడగలేదు. ఎందుకంటే రాజమౌళి చేసిన మేజిక్ అది. ఆఫ్ట్రాల్ చేతి ఉంగరం పోతేనే ఇంద్రుడి కూతురికి స్వర్గం లోకం ఎంట్రీ లేదంటే అంతకన్నా జోకు ఉంటుందా. కానీ జనం బ్రహ్మరథం పట్టారు. రాఘవేంద్రరావు మాయాజాలం ప్రభావం అది. మాయాబజార్ లో వెతికితే వందల్లో ఉంటాయి. అయితే ఈ సమస్య ఖలేజాకే వచ్చింది. అందుకే ఫెయిల్ అయ్యింది

నిజానికి ఇప్పటి ప్రేక్షకులు లేదా యువత టీవీలోనో ఓటిటిలోనో ఖలేజాను చూసి ఇష్టపడవచ్చు. డైలాగులు, మహేష్ కామెడీ టైమింగ్ ని విపరీతంగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ థియేట్రికల్ రిలీజ్ జరిగినప్పడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారనేదే ముఖ్యం. ఒక పదేళ్ల తర్వాత ఫ్లాప్ అయిన ఏ సినిమానైనా క్లాసిక్ అని కల్ట్ అని బిరుదులూ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఖలేజాలో అరుదైన హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కాదనలేని వాస్తవం. అప్పటిదాకా ఎవరూ అలా చూపించే సాహసం చేయలేదు. ఒక ఊరంతా దేవుడని నమ్మే వ్యక్తి వాళ్ళ కోసం ప్రాణాలకు తెగించి దుష్టసంహారం చేయడమనే పాయింట్ లో చాలా వెయిట్ ఉంది.

కానీ త్రివిక్రమ్ ఆ మేజిక్ ని తెరమీద సరైన రీతిలో చూపించడంతో ముందువెనుకా తడబడటం ఫలితం మీద ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా ఎడారి బ్యాక్ డ్రాప్ లో చాలా సేపు కథను సాగదీయడం, అక్కడ కామెడీ సంగతి ఎలా ఉన్నా సగటు మాస్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా ఆ ఎపిసోడ్ లేకపోవడం ముమ్మాటికీ మైనస్సే. మణిశర్మ పాటలు, కోట్లాది రూపాయల నిర్మాణ విలువలు ఎన్ని ఉన్నా దేవుడనే కాన్సెప్ట్ ని కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో మాటల మాంత్రికుడి కలం సరిగా పనిచేయలేదు. అందుకే టీవీలో చూసినప్పుడు బోర్ కొట్టని ఈ సినిమా టికెట్టు కొని పెద్దతెరమీద చూసినవాళ్లుకు నచ్చలేదు. అందుకే డిజాస్టర్ స్టాంప్ తప్పలేదు.

Also Read : బాధ్యత లేని కుర్రాళ్ళకు సినిమా క్లాసు – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి