బాధ్యత లేని కుర్రాళ్ళకు సినిమా క్లాసు - Nostalgia

By iDream Post Oct. 06, 2021, 08:30 pm IST
బాధ్యత లేని కుర్రాళ్ళకు సినిమా క్లాసు - Nostalgia

కాలేజీ లేదా నిరుద్యోగ యువకులు అమ్మాయిల వెంటపడటం అల్లరి చేయడం హద్దుల్లో ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదూ వాళ్ళను ప్రేమించినా కూడా పెళ్లి చేసుకుని పోషించగలిగే సత్తా ఉన్నప్పుడే ధైర్యంగా ఆ విషయాన్ని ప్రపంచానికి చాటాలి. కానీ ఈ స్పృహ ఎందరికి ఉంటుంది. గాలిలో మేడలు కడుతూ లవ్ చేస్తే చాలు ఇంకేమి అక్కర్లేదనే రీతిలో బాధ్యత మర్చిపోతే దాని వల్ల కలిగే నష్టం వ్యక్తిగతంగా మాత్రమే కాదు కుటుంబానికి కూడా భారీగా ఉంటుంది. ఇది సందేశాత్మకంగా చెప్పడం కొంచెం కష్టమే కానీ సరైన రీతిలో కథా కథనాలు ఉంటే యువత ఆలోచించడమే కాదు ఆ సినిమాకు మంచి విజయాన్ని అందిస్తారు. ఉదాహరణ అమ్మాయి కోసం.

1998 తమిళ్ లో బాలశేఖరన్ దర్శకత్వంలో వచ్చిన 'తుల్లి తిరింత కాలం' మంచి విజయాన్ని సాధించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథగా దీన్ని తీర్చిదిద్దిన తీరు ఈతరం ఫిలిం మేకర్స్ అధినేత పోకూరి బాబురావుని ఆకర్షించింది. తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో హక్కులు కొన్నారు. ఏవో కారణాల వల్ల నిర్మాణం కొంత ఆలస్యమయ్యింది. ముప్పలనేని శివ దర్శకత్వంలో ఇక్కడ మీనాని లీడ్ రోల్ కు తీసుకున్నారు. రవితేజ, వినీత్, శివారెడ్డి, అలీ హీరో బ్యాచ్ గా నటించారు. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాయికుమార్ కనిపిస్తారు. వందేమాతరం శ్రీనివాస్ యూత్ ఎంటర్ టైనర్ కి సంగీతం అందించడం మరో ఆకర్షణ

ఓ వీధిలో బలాదూర్ గా ఎలాంటి పనీపాటా లేని యువకుల జీవితంలో అంజలి(మీనా)ప్రవేశిస్తుంది. ఒకరికి తెలియకుండా మరొకరు అందరూ ఆమె ప్రేమలో పడతారు. ఆకర్షించే క్రమంలో పిచ్చి పనులు చేసి ఆమెకు దారుణ అవమానం జరిగేందుకు కారణమవుతారు. అప్పుడే చనిపోయిన అంజలి అన్నయ్య కథ తెలుస్తుంది. తమలో ఉన్న టాలెంట్ ని మెరుగుపరుచుకుని విజేతలుగా నిలిచేందుకు కంకణం కట్టుకుంటారు. అంజలికి వేరే వ్యక్తితో ఘనంగా పెళ్లి జరిపిస్తారు. 2001 మే 18న మాఫియా ముఠా, పండంటి సంసారం, వెన్నెల దొరసానితో పాటుగా విడుదలైన అమ్మాయి కోసం వాటిని ఈజీగా దాటేసి సూపర్ హిట్ అందుకుంది. దీంతో పాటు బడ్జెట్ పద్మనాభం, వందేమాతరం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాక రవితేజ వీటికి స్వస్తి చెప్పి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో సోలో హీరో అయ్యాడు

Also Read : అడవి నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp