iDreamPost

అధికార ప్రతిపక్షాలను కలిపిన కరోనా

అధికార ప్రతిపక్షాలను కలిపిన కరోనా

మానవ జాతికి కరోనా పెను ముప్పుగా పరిణమించింది. ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా కరోనా మారింది. ప్రపంచ దేశాలు తమ మధ్య ఉన్న మనస్పర్థలు, వివాదాలను పక్కనపెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. కరోనాను అంతం చేసేందుకు చేతులు కలుపుతున్నాయి. దేశాలే కాదు మన దేశంలో ఓ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆ రాష్ట్రం ఏదో కాదు.. కేరళ. కరోనా వైరస్‌ కేరళలో ముఖ్యమంత్రి పినయి విజయన్, ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితాలను కలిపింది. కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు సీఎం, ప్రతిపక్ష నేతలిద్దరూ నిన్న శుక్రవారం సంయుక్తంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. అంతేకాదు రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు.

కేరళ సీఎం పినరయి విజయన్, ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితాల చొరవపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అధికార,ప్రతిపక్ష పార్టీలు అంటే.. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటాయనే భావనను వీరిద్దరు పటాపంచలు చేశారు. కరోనాపై ఉమ్మడిపోరు సాగిస్తున్న కేరళ ప్రజా ప్రతినిధులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

దేశంలో కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం, ప్రతిపక్ష ఎవరిదారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కరోనాను కూడా ఉపయోగించుకుంటున్నారు. ప్రతి రోజు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు కానీ కరోనా నియంత్రణకు సలహాలు, సూచనలు మాత్రం వారి నుంచి రావడం లేదు. కరోనా మహమ్మరిపై పోరు సాగించేందుకు కేరళ సీఎం, ప్రతిపక్ష నేతలను అన్ని రాష్ట్రాల్లోని నేతలు అనుసరించాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి