iDreamPost

జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌) పై ప్రజలకి ఏమి చెప్పాలి ??

జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌)  పై ప్రజలకి ఏమి చెప్పాలి ??

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెరాస రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ విధానాల వల్ల దేశంలో ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసే స్థితికి చేరిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఏఏ వంద శాతం తప్పుడు నిర్ణయమని అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అమిత్ షా గారు ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే విషయం ఆయనకి చెప్పానన్నారు. సీఏఏ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిగతా ముఖ్యమంత్రులను, ఇతర పార్టీల ముఖ్య నేతలను కలుపుకొని పోరాటం ఉధృతం చేస్తానన్నారు. సీఏఏ కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తానన్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ పౌర పట్టిక (యన్పీఆర్) ని కూడా తప్పుబట్టారు. యన్నార్సి కి ఈ యన్పీఆర్ తొలిమెట్టు అని కేంద్ర హోం శాఖ పార్లమెంట్ కి సమర్పించిన లేఖ లో కూడా స్పష్టంగా ఉందని కేసీఆర్ ప్రస్తావించారు. మరో వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం యన్పీఆర్ లో అన్ని వివరాలు ఇవ్వడం తప్పని సరి కాదని అంటున్నారని, అలాంటప్పుడు వాటిని అమలు చెయ్యాల్సిన అవసరం ఏముందని కేసీఆర్ ప్రశ్నించారు.

వాస్తవానికి జాతీయ పౌర పట్టిక (యన్పీఆర్) చట్టం ప్రకారం వివరాలు ఇవ్వడం స్వచ్చందం అని ఎక్కడా లేదు. సరైన వివరాలు ఇవ్వని పౌరులకు జరిమానా విధించే నిబంధన కూడా ఈ యన్పీఆర్ చట్టంలో ఉంది. జాతీయ పౌర పట్టిక (యన్పీఆర్) డేటా సేకరణ సమయంలో పేరు, కుటుంబం లోని మిగతా వారి పేర్లు, ఇతర సరైన వివరాలు ఇవ్వడం ప్రతి కుటుంబం బాధ్యత అని చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ పౌర పట్టిక (యన్పీఆర్) డేటా ని సేకరించడం రాష్ట్ర ప్రభుత్వాల తప్పనిసరి విధి అని, జాతీయ పౌర పట్టిక కు ఇచ్చే సమాచారం స్వచ్చందమే కానీ తప్పనిసరి కాదని పేర్కొన్నారు. మీరిచ్చిందే మేము తీసుకుంటామని, జాతీయ పౌర పట్టిక పై వివరణ ఇచ్చారు.

అయితే తాజాగా జాతీయ పౌర పట్టిక గురించి బయటకి వచ్చిన విషయం ఏంటంటే అసలు ఈ జాతీయ పౌర పట్టిక (యన్పీఆర్) లో సేకరణలు నిభందనలకే చట్టబద్దత లేదనే వాదన బలంగా వినిపిస్తుంది . కారణం ఏంటంటే 2003లో నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో చేసిన పౌరసత్వ సవరణలో కేంద్రం జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌) డేటా కోసం కేవలం 12 ప్రశ్నలకు మాత్రమే పౌరుల నుంచి సమాధానాలు తీసుకోవాలి. అంటే ఈ 12 ప్రశ్నలకే చట్టబద్ధత ఉంది.

కానీ ఇపుడు మోదీ ప్రభుత్వం అదనంగా 8 ప్రశ్నలను చేర్చింది. ఇలా చట్టంలో లేని అంశాలను తమకు నచ్చినట్లుగా చేర్చేసి, వాటికి సమాధానాలు చెప్పండని ప్రజలను నిలదీయడం కుదరదని, అలా సేకరించే డేటా చట్టబద్ధం కానే కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీటికి తోడు 2003 నాటి చట్టంలో అసలు ఎక్కడా ‘స్వ చ్ఛందం’ అన్న పదమే లేదు. మరో రెండు నెలల్లో జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌) రూపకల్పన నిమిత్తం సేకర్తలను పంపాల్సిన తరుణంలో నేటికీ అసలు ఏం సేకరించాలి, ఎలా సేకరించాలన్నదానిపై కేంద్రం నుంచి రాష్ట్రాలకు స్పష్టత రాలేదు.

ఇప్పటికే ఈ జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌) చట్టం అమలుపై రాష్ట్రాలు తీవ్రవ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని బెంగాల్ ప్రభుత్వం గత డిసెంబర్ లో తీర్మానం చేసింది. అది జరిగిన మూడు రోజులకే కేరళ ప్రభుత్వం కూడా అదేబాట పట్టింది. కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు దీనిని అమలు చెయ్యమని ప్రకటించాయి. తాజాగా ఈ జాబితా లో తెలంగాణ కూడా చేరింది.

ఇక్కడ వివాదాస్పదమైన అంశం ఏంటంటే 2003 నాటి చట్టంలో లేని, చట్టబద్ధం కాని అంశాలను ఎలా చేరుస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాల్లో ముఖ్యంగా తలిదండ్రుల జన్మస్థలం, పుట్టిన తేదీ వివరాలు కోరడం ఖచ్చితంగా ఓ వర్గాన్ని దూరం చేయడానికి ఉద్దేశించినదేనన్న అభిప్రాయాలు బలంగా కలుగుతున్నాయి. ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు ఐడీ కార్డు, పాస్‌పోర్టు నెంబరు మొదలైనవి మిగిలినవి. ఈ వివరాలనే కిషన్‌రెడ్డి ఐచ్ఛికం తప్ప ఖచ్చితంగా ఇవ్వాల్సిన పనిలేదు అంటున్నారు. తప్పనిసరి కానపుడు అసలు వీటిని చేర్చడం ఎందుకు, అమలు ఎందుకు, దీని వెనుక ఉన్న మతలబేంటి అని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు

జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ)కు తొలిమెట్టు ఎన్‌పీఆర్‌ అని కేంద్రం గతంలో ప్రకటించడమే మొత్తం ప్రక్రియపై అనుమానాలు రేగడానికి కారణమని స్పష్టమవుతోంది. భారత పౌరసత్వ చట్టం ప్రకారం 1987 జూలై 1 తరువాత జన్మించిన వారందరినీ భారతీయులుగా పేర్కొనాలంటే వారి తలిదండ్రులు విధిగా భారత జాతీయత కలిగి ఉండాలన్నది నిబంధన. అందు నిమిత్తమే ఎన్‌పీఆర్‌ వివరాల్లో కొత్తగా తలిదండ్రుల పుట్టిన తేదీ, జన్మస్థలం చేర్చారన్నది సుస్పష్టం. ఆధార్‌, బయోమెట్రిక్‌ వివరాలు, ఇతర అన్ని కొత్త వివరాలూ సేకరించాక ఎన్నార్సీ రూపకల్పన గసులువుగా జరిగిపోతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించి స్థిరపడ్డ వలసదారులందరినీ ఏరిపారెయ్యవచ్చనేది కేంద్రం భావన గా అర్ధం చేసుకోవచ్చు.

అయితే కేంద్ర మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రకటనలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఆధార్‌ నెంబరు ఇవ్వడం ఐచ్ఛికమేనని పీయూశ్‌ గోయెల్‌ డిసెంబరు 24న అన్నారు. అదే రోజు న హోంమంత్రి అమిత్‌ షా స్పందిస్తూ ఎన్‌పీఆర్‌ డేటా లో భాగంగా ఎన్యూమరేటర్లు అడిగే ప్రతీ దానికీ పౌరులు స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించాలని అన్నారు. ఆయన మాటల్లో వివరాలన్నీ చెప్పి తీరాల్సిందే అన్నట్లుగా ఉందన్న వ్యాఖ్యానాలొచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై హోంశాఖ అధికారి వెంటనే భిన్నంగా స్పందించారు. ‘ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, ఓటరు ఐడెంటిటీ కార్టుల నెంబర్లు ఇచ్చి తీరాలి’ అన్నారు. ‘తలిదండ్రులు పుట్టిన తేదీ, జన్మస్థలం సహా ఎన్‌పీఆర్‌ డేటా కోసం కోరే అన్ని అంశాలూ ఇవ్వడం ఐచ్ఛికమేనని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఈ వాదనను జావడేకర్‌ సమర్థించారు.

తాజాగా ఎన్‌పీఆర్‌ పేరిట కేంద్రం సేకరించబోతున్న డేటా వ్యక్తి స్వేచ్ఛను, గోప్యతను అడ్డుకొంటోందని, సుప్రీంకోర్టులో ఓ కేసు దాఖలైంది. ఉద్గార్‌ రామ్‌, బిమలేశ్‌ కుమార్‌, సంజయ్‌ సఫీ అనే ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ కేంద్రానికి నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌) వ్యవహారం భవిష్యత్ లో ఎన్ని మలుపులు తిరుగుతుందో, రాజకీయంగా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి