iDreamPost

29 వరకు లాక్ డౌన్ పొడిగింపు.. సీఎం కేసీఆర్ ప్రకటన

29 వరకు లాక్ డౌన్  పొడిగింపు.. సీఎం కేసీఆర్ ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈరోజు సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కొద్దిసేపటికి మీడియాతో మాట్లాడారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కష్టమైన ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొంతమంది తనను తిట్టుకున్నా ఫర్వాలేదని, తెలంగాణ సమాజ శ్రేయస్సు ముఖ్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నిత్యవసర, వ్యవసాయ పరికరాల దుకాణాలు మాత్రమే తెరుస్తామని చెప్పారు.

భౌతిక దూరాన్ని పాటించి తెలంగాణ సమాజాన్ని కాపాడుకోగలమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న ఏకైక మార్గం భౌతిక దూరం పాటించడమేనని పునరుద్ఘాటించారు. ఆగస్టు, సెప్టెంబర్లో కల్లా హైదరాబాద్ లోని ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ కి వ్యాక్సిన్ తయారు చేస్తాయన్న సమాచారం ఉందన్నారు. వ్యాక్సిన్ త్వరగా రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజులు ఇలాగే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఒక మరణం లేకుండా చేయగలిగామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కరోనా నియంత్రణకు కృషి చేసిన అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1,096 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 626 మంది కోలుకున్నారని చెప్పారు. 439 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత ఉందని, ఇక్కడ వైరస్ అత్యధికంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మూడు జిల్లాల పై ఎక్కడ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మొత్తం నమోదైన కేసులో 64 శాతం కేసులు ఈ మూడు జిల్లాల్లోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. 86 శాతం మరణాలు ఈ మూడు జిల్లాల్లోనే సంభవించాయని తెలిపారు. తాజాగా నమోదైన కేసులను కూడా ఈ మూడు జిల్లాల్లోనే వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. అందుకనే ఈ మూడు జిల్లాల్లో ప్రజలు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. హైదరాబాద్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో 100% దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. పట్టణాలు, పురపాలక సంఘాలలో 50 శాతం దుకాణాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. రొటేషన్ విధానంలో రోజుమార్చి రోజు అన్ని దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మినహాయింపులు ఉంటాయని చెప్పారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వంద శాతం మేర పనిచేస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు చేస్తాయన్నారు. ఇసుక మైనింగ్ రేపట్నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ రేపట్నుంచి కొనసాగుతుందన్నారు.

ఈ నెలలోనే మిగిలిన 10 వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్ మూల్యాంకనం వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. జూనియర్ న్యాయ వాదులను ఈ ఆపత్కాలంలో ఆదుకునేందుకు 25 కోట్లు తో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

కరోనాతో కలిసి బతకాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉపాయంతో అపాయాన్ని నుంచి తప్పించుకోవాలని పేర్కొన్నారు. మనల్ని మనమే రక్షించుకోవాలని, ఎవరో వచ్చి కాపాడరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి