iDreamPost

నిఖిల్ సినిమా చుట్టూ పద్మవ్యూహం

నిఖిల్ సినిమా చుట్టూ పద్మవ్యూహం

సినిమా తీయడం ఒక ఎత్తయితే అంతకన్నా పెద్ద సవాల్ దాన్ని అనుకున్న టైంలో విడుదల చేయడం. ఇప్పటికీ ఎందరో చిన్న నిర్మాతలు తమ చిత్రాలను బయటికి తేలేక, కొద్దిపాటి బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయలేక మగ్గిపోతున్న వాళ్ళు వందల్లో ఉంటారు. సరే పరిశ్రమకు కొత్తగా వచ్చిన వాళ్లయితే అనుభవం లేకపోవడమో ఎవరి చేతిలో అయినా మోసపోవడమో సహజం. కానీ నిఖిల్ లాంటి కుర్ర హీరో బొమ్మకు సైతం ఇబ్బందులు తప్పడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్జున్ సురవరం తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిన నిఖిల్ కు కార్తికేయ 2 సక్సెస్ చాలా కీలకం. అందులోనూ మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో జాగ్రత్తగా ఉన్నాడు.

అయితే విడుదల విషయంలో ఈ టీమ్ ఎదురుకుంటున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ముందు జూలై 22కి గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ తీరా అదే తేదీకి నాగచైతన్య థాంక్ యు రావడంతో ఇష్టం లేకపోయినా తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి చైతు ముందు లాక్ చేసుకున్న డేట్ జూలై 8. సరే పోనిలే ఆగస్ట్ 5 వద్దామని కార్తికేయ 2 ప్రకటన కూడా ఇచ్చింది. తీరా చూస్తే బింబిసార, సీతారామంలు ఉన్నాయి. అయినా రిస్క్ చేద్దామంటే బయట నుంచి ఒత్తిడి. థియేటర్లు దొరకవని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ కు వెళ్లాలని ఇలా ఏవేవో ప్రెజర్లు. సరేలే అని ఫైనల్ గా ఆగస్ట్ 12కి నిర్ణయించుకున్నారు. తీరా చూస్తే అక్కడ ముందు వెనుకా విపరీతమైన పోటీ ఇబ్బంది పెడుతోంది.

11నే లాల్ సింగ్ చడ్డా దిగుతున్నాడు. అమీర్ ఖాన్ తో పాటు నాగచైతన్య ఉండటంతో తెలుగునాట కూడా బజ్ బాగానే ఉంది. నితిన్ మాచర్ల నియోజకవర్గం 12ని ఇంతకు ముందే అనౌన్స్ చేసింది. తాజాగా కార్తీ విరుమన్ రేస్ లో వచ్చింది. కార్తికేయ 2 అన్ని భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. కానీ హిందీలో అమీర్, తమిళంలో కార్తీ , తెలుగులో నితిన్ ఇలా అన్నివైపులా కాంపిటీషన్ కాచుకుని ఉంది. అయినా కూడా కార్తికేయ 2 వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. ఇదంతా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే అంశమే అయినా వేరే దారి లేదు. 25న విజయ్ దేవరకొండ లైగర్ తో ఢీ కొనడం కంటే సేఫ్ గా ఈ ట్రయాంగిల్ వార్ లో దిగడమే సేఫ్. చూడాలి ఏమవుతుందో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి