iDreamPost

RGVకి జొన్నవిత్తుల సినిమా కౌంటర్

RGVకి జొన్నవిత్తుల సినిమా కౌంటర్

ఇప్పటిదాకా తాను తీసిందే సినిమా చెప్పిందే కాన్సెప్ట్ తరహాలో అన్ని ఫ్లాపులే ఎదురవుతున్నా నెరవకుండా పదే పదే తీస్తున్న రామ్ గోపాల్ వర్మకు గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు కొన్ని నెలల క్రితం వివాదం రేగిన సంగతి తెలిసిందే. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా టైంలో వర్మ ఉద్దేశపూర్వకంగా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా సినిమాలు తీస్తున్నాడని ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరం అని ఓ వీడియో వదిలారు.

దానికి బదులుగా వర్మ వ్యంగ్యంగా కౌంటర్ ఇస్తూ కాస్త సభ్యత తగ్గిన మాటలతో ట్విట్టర్లో కామెంట్స్ చేశాడు. అదే సమయంలో జొన్నవిత్తుల స్పందిస్తూ త్వరలో తాను వర్మ బయోపిక్ ని పప్పువర్మ పేరుతో తీస్తానని ప్రకటించారు. అదేదో ఫ్లోలో అన్నారేమో నిజంగా జరిగే పనేనా అనుకున్నారందరూ. కానీ జొన్నవిత్తుల అన్నంత పనీ చేశారు. ఆర్జివి ది సైకో పేరుతో సినిమాను మొదలుపెట్టేశారు. నిఖిల్ తో గతంలో కార్తికేయ లాంటి హిట్ మూవీ తీసిన వెంకట శ్రీనివాస్ సమర్పణలో పొన్నూరి బాలకుటుంబరావు నిర్మాతగా పరిచయమవుతూ హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెట్టేశారు.

మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందట. దీనికి దర్శకత్వంతో పాటు కథ చిత్రానువాదం మాటలు పాటలు అన్ని జొన్నవిత్తులనే సమకూరుస్తున్నారు. సమాజానికి మంచి చేయని భావజాలాన్ని సిద్ధాంతంగా ప్రచారం చేస్తున్న వ్యక్తుల గురించి సినిమాగా తీస్తున్నానని, అలాంటి వాళ్ళ వల్ల పిచ్చి పట్టిన యువతకు తగ్గించే పరిష్కారం కూడా ఇందులో ఉంటుందని జొన్నవిత్తుల చెబుతున్నారు. నేరుగా ఆర్జివి పేరుని ప్రస్తావించనప్పటికీ టైటిల్, గతంలో జరిగిన పరిణామాలను బట్టి ఇది ఎవరిని టార్గెట్ చేసిందో సగటు సినిమా పరిజ్ఞానం ఉన్న అర్థమైపోతోంది. మరి వర్మ దీనికి ఎలా స్పందిస్తాడో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి