iDreamPost

జేసీ ‘త్రిశూల్‌’ లోగుట్టు ఇదే..

జేసీ ‘త్రిశూల్‌’ లోగుట్టు ఇదే..

టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీని నిర్మించడానికి మహా అయితే మూడేళ్లు పడుతుంది. కొన్ని అనివార్య కారణాలు ఉంటే మరో రెండేళ్లు అదనం కావొచ్చు. ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు వినియోగించుకొని 14 ఏళ్లుగా ఒక ఫ్యాక్టరీకి నిర్మాణానికి ఇటుక కూడా వేయలేదంటే ఏమనుకోవాలి? ఫ్యాక్టరీ ముసుగులో ఏదో ‘మహా కార్యం’ వెలగబెడుతున్నట్లేగా?

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి చెందిన త్రిశూల్‌ సిమెంట్స్‌ వ్యవహారం ఇలాంటిదే. ఫ్యాక్టరీ అడ్డు పెట్టుకొని 38వేల టన్నులకుపైగా సున్నపురాయిని దోచేశారు. ఇలాంటి దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ వైఎస్‌ జగన్‌ సర్కారు లీజును రద్దు చేసినందుకు జేసీ కుటుంబం, టీడీపీ నాయకులు శాపనార్థాలు పెడుతున్నారు. పగ, ప్రతీకారంతో మా కుటుంబాన్ని అడుకునేలా చేయాలని జగన్‌ చూస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ వ్యవహారాన్ని చూస్తున్న ఆ ప్రాంత ప్రజలు.. పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందా? అంటూ బహిరంగంగానే జేసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గడువు మీద గడువు..
సిమెంట్‌ కర్మాగారం నిర్మించి దాని అవసరాలకు ఖనిజాన్ని వినియోగించుకుంటామనే షరతు మేరకు 2006 ఏప్రెల్‌ 25న అనంతపురం జిల్లా యాడికి మండలంలోని కోనుప్పులపాడులో 649 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్‌ లీజును త్రిశూల్‌ సిమెంట్స్‌ పొందింది. ఆరంభంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి మూడేళ్ల గడువు విధించారు. అది ముగిసినప్పటికీ అక్కడ అడుగు ముందుకు పడలేదు.

వాస్తవానికి అక్కడ ఫ్యాక్టరీ నిర్మించాలనే ఉద్ధేశం వారికి లేదు. కేవలం మైనింగ్‌ లీజు తీసుకొని సున్నపురాయిని సైలెంట్‌గా తవ్వుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఏవో కారణాలు చెప్పి మరో ఏడాదిన్నర గడువు పొడించుకున్నారు. మళ్లీ అంతే.. ఫ్యాక్టరీ ఊసేలేదు. తదుపరి గడువును ఐదేళ్లకు అంటే ఆగస్టు 1 2010 నుంచి జూలై 31 2015 వరకు గడువు పెంచుకున్నారు.

ఈ గడువు పొడిగింపు కార్యక్రమం ఆగకుండా కొనసాగుతూ వచ్చింది. మళ్లీ ఆగస్టు 1, 2015 నుంచి జూలై 31 2020 వరకు చంద్రబాబు సహాయంతో పొడిగించుకుంది. ఈ మేరకు చంద్రబాబు సర్కారు 2017 ఆగస్టు 16న ఉత్తర్వులిచ్చింది. ఈలోపు 38 వేలకు పైగా టన్నుల సున్నపురాయిని అమ్ముకొని కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. అలాగే లీజుకు సంబంధించిన 38 లక్షల పన్నును కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా ఉన్నారని అధికారులు తేల్చారు.

ఇంతలో ప్రభుత్వం మారడంతో జేసీ కుటుంబం మరో ఎత్తుగడ వేసింది. త్రిశూల్‌ సిమెంట్స్‌ పేరు మార్పునకు దరఖాస్తు చేసుకుంది. అప్పటికే ఈ వ్యవహారంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. వెంటనే త్రిశూల్‌ సిమెంట్స్‌ అనుమతులను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. అధికారుల నివేదికలు, కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. అనుమతులను పూర్తిగా రద్దు చేసింది. పన్ను డబ్బును పూర్తిగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి