iDreamPost

అధికార ప్ర‌తినిధి అరెస్ట్ ని కూడా ఖండించ‌లేని జ‌న‌సేన‌

అధికార ప్ర‌తినిధి అరెస్ట్ ని కూడా ఖండించ‌లేని జ‌న‌సేన‌

జ‌న‌సేన అస‌లు ఓ రాజ‌కీయ పార్టీయేనా అనేది చాలామందిలో ఉండే సందేహం. ఎందుకంటే ఆరేళ్ల క్రితం పుట్టిన ఆపార్టీకి ఒక్క జిల్లా క‌మిటీ కూడా లేదు. అస‌లు వారికి స్థానిక నాయ‌క‌త్వం అనే మాటే ఉండ‌దు. ఎవ‌రికి వారే నాయ‌కుడు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. చివ‌ర‌కు తోచింది చెబుతూ ఉంటారు. అధినేత మాత్రం మ‌ధ్య మ‌ధ్య‌లో సినిమాలు కూడా చేస్తూ సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఇక మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా పార్టీని ఉత్తేజ‌ప‌రిచే రీతిలో వ్య‌వ‌హ‌రించలేక‌, అశేష ప్ర‌జానీకాన్ని సంపాదించ‌లేక చ‌తికిల‌ప‌డ్డారు. అధ్య‌క్షుడే రెండు చోట్లా ఓట‌మి పాల‌య్యారు.

పోనీ ఆ అనుభ‌వం నుంచి పాఠాలు నేర్చుకున్నారా అంటే అది కూడా క‌నిపించ‌డం లేద‌ని తాజా ప‌రిణామాలు చాటుతున్నాయి. ఓట‌మి పాల‌యిన త‌ర్వాత క‌నీసం ఏడాది స‌మ‌యంలో ఒక్క‌సారి కూడా భీమ‌వ‌రం వైపు క‌న్నెత్తి చూడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరుని ఏమనాల‌నేది అర్థం కాకుండా ఉంది. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షంలో ఉండి కూడా ప‌లు ప‌నులు చేయ‌వ‌చ్చ‌ని గ‌తంలో జ‌గ‌న్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించిన ప‌వ‌న్ ఇప్పుడు తాను పోటీ చేసిన సీటులో ప్ర‌జ‌ల స‌మస్య‌ల‌ను, ఇత‌ర అంశాల‌ను ఎందుకు గాలికొదిలేశార‌న్న‌ది ఆయ‌న స‌మాధానం చెప్పాల్సిన అంశం. క‌నీసం ఓట్లేసిన వారికి కూడా కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు సైతం సిద్ధ‌ప‌డ‌ని ప‌వ‌న్ ని రేపు మ‌రో నియోజ‌క‌వ‌ర్గ వాసుల‌యినా విశ్వ‌సిస్తార‌నే న‌మ్మ‌కం ఉంటుందా అంటే పెద్ద ప్ర‌శ్నార్థ‌కం.గెలిచినా ఓడినా ప్ర‌జ‌ల్లో ఉంటాన‌ని చెప్పి మాట త‌ప్పిన‌ట్టుగా అంతా భావించే స్థితికి చేరింది.

అవ‌న్నీ ప‌క్క‌న పెడితే తాజాగా ఆపార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న కుసంపూడి శ్రీనివాస్ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. చ‌ట్ట రీత్యా చిక్కులు కొనితెచ్చుకున్నారు. మ‌త విద్వేషాలు రాజేసే రీతిలో క‌ర్నూలు ఆసుపత్రి అంశాన్ని చిత్రీక‌రించి పోలీసుల‌కు చిక్కారు. అయినా చివ‌ర‌కు ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచేందుకు సైతం జ‌న‌సేన సిద్ధ‌ప‌డ‌లేదు. క‌నీసం అరెస్ట్ ని ఖండించేందుకు కూడా ముంద‌కు రాలేక‌పోయింది. తాను చేసిన పోస్టింగ్స్ లో లోపం ఉంద‌ని గ్ర‌హించి, త‌ప్పిదం అంగీక‌రించిన శ్రీనివాస్ ని కూడా స‌మ‌ర్థించ‌లేక‌పోయింది. అదే స‌మ‌యంలో అంద‌రూ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలంటూ ఉచిత స‌ల‌హాల‌తో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌ద్వారా శ్రీనివాస్, త‌మ పార్టీ నాయ‌కుడే బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు ప‌రోక్షంగా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషంగా మారింది.

కొంత‌కాలంగా ప‌వ‌న్ కి మ‌ద్ధ‌తుగా పార్టీ వాణీ వినిపించే ప్ర‌య‌త్నం చేసిన కుసంపూడిని చివ‌ర‌కు సొంత పార్టీ నేత‌లు కూడా బ‌ల‌ప‌రిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డం గ‌మ‌నిస్తే ప‌వ‌న్ త‌న‌ను న‌మ్ముకున్న వారిని కూడా న‌ట్టేట ముంచుతున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఒక త‌ప్పిదానికే కుసంపూడిని దూరం పెట్టేశార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇన్నాళ్లుగా తాను న‌మ్ముకున్న నాయ‌కుడు కూడా స్పందించ‌క‌పోవ‌డం చూస్తుంటే శ్రీనివాస్ కి ఎవ‌రు అండ‌గా నిలుస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. ఓ పార్టీగా త‌న కార్య‌క‌ర్త‌ల‌ను సైతం కాపాడుకోలేని రీతిలో జ‌న‌సేన ఉందా అనే అనుమానం బ‌ల‌ప‌డుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి