iDreamPost

పవన్‌ను స్వచ్ఛందంగా ‘తప్పిం’చేసారు

పవన్‌ను స్వచ్ఛందంగా ‘తప్పిం’చేసారు

పొత్తు ధర్మం మేరకు తిరుపతి పార్లమెంటు స్థానం ఎన్నికల నుంచి స్వచ్ఛంధంగా పోటీ నుంచి తప్పుకుంటున్నాం.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నుంచి వచ్చిన వివరణ ఇది. చెప్పేటప్పుడు ఇదేమీ పెద్ద విషయంగా ఏమీ పవన్‌కు తోచకపోవచ్చు గానీ కాలికి కత్తులు కట్టుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులకు మాత్రం ఈ మాటలు రుచించవనే చెప్పాలి. తమ నాయకుడికి గౌరవం కాపాడుకోవాలన్న తలంపుతో నిమ్మకుండి పోయుంటారు గానీ.. వాస్తవానికి ఇదే మరొకరైతే ఈ పాటికే విమర్శలు భారీ ఎత్తున ఎగసిపడేవి.

తిరుపతిలో మేమే పోటీ చేస్తాం.. అనే స్థాయి నుంచి స్వచ్ఛంధంగా పోటీ నుంచి తప్పుకుంటున్నాం.. అనే స్టేజ్‌కి జారిపోవడం పట్ల జనసేన అధినేత పవన్‌ గురించి రాజకీయవర్గాల్లో భారీగానే చర్చ జరుగుతోంది. ఉద్వేగ పూరితంగా ఏదో ఒక ప్రకటన చేసేయడం.. ఆ తరువాత చర్చల పేరుతో హడావిడి.. కొన్నాళ్ళు సైలెంట్‌.. ఆ తరువాత బీజేపీ చెప్పినదానికే తలూపడం.. ఇదే ప్యాటర్న్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీరు కొనసాగుతోందన్నది కొందరి విశ్లేషకులు కుంటబద్ధలు కొట్టిమరీ చెబుతున్న మాట.

సాధారణంగా రాజకీయ పార్టీల్లో పొత్తులు ఇరు పార్టీలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా మాత్రమే జరుగుతుంటాయి. అయితే జనసేన–బీజేపీ విషయంలో మాత్రం బీజేపీకి మాత్రమే పొత్తు ప్రయోజనాలు పొందుకునే ప్రయత్నాలు చేస్తుందన్నది చెప్పకతప్పదు. నిన్న మొన్నే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం ఏపీలో బీజేపీ బలం ఏంటన్నది మరోసారి తేలిపోయింది. మూడో స్థానంలో ఉన్న జనసేనతో పోల్చుకున్నాగానీ.. కనీసం బోణీ చేయకపోవడం బీజేపీబలం ఏపాటిదన్నది బహిర్గతమైంది. కనీసం వీటిని చూసైనా తిరుపతి పార్లమెంటు స్థానం విషయంలో జనసేన మాటకే బలం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా విన్పించింది.

కానీ అందుకు భిన్నంగా బీజేపీ అభ్యర్ధి పోటీలో ఉంటారన్నది అధికారికంగా ప్రకటించడం చూస్తుంటే ఇక్కడ పొత్తు విషయంలో పవన్‌ స్థాయిపై అపోహలు పెరిగిపోతున్నాయి. బీజేపీతో వ్యవహారాల విషయంలో ఆయన సామర్ధ్యాన్ని కూడా శంకించాల్సి వస్తోంది. పవన్‌ తల్చుకుంటే ఎవ్వరితోనైనా నేరుగానే మీటింగ్‌ పెట్టగలరంటూ.. సొంత సైనికులు ఎంత చెప్పుకున్నాగానీ.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగానే ఉన్నట్లుగా తేలుతోంది. ఉన్నత స్థాయిలో జేపీ నడ్డాతో తప్పితే ఇతర అగ్రనేతలతో ఇప్పటి వరకు అపాయింట్‌మెంట్‌ కూడా పవన్‌ నోచుకున్న దాఖలాల్లేవు.

అంతే కాకుండా పొత్తును సాకుగా చూపి.. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు కూడా పవన్‌కు అవకాశం దక్కడం లేదు. దీంతో క్షేత్రస్థాయి జనసైనికుల్లో తీవ్రంగానే అసహనం పెరిగిపోతోంది. కేంద్ర వైఫల్యాలపై పోరాడుతూ జనంలోకి దూసుకువెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ చేజేతులారా పవన్‌ వెనకడుగు వేయడం ఆ పార్టీ కీలకనేతలను సైతం విస్మయానికి గురిచేస్తోందని రాజకీయవర్గాలు జోరుగానే చర్చించుకుంటున్నాయి.

ఏపీలో జనసేన– బీజేపీలను పోల్చి చూస్తే ఖచ్చితంగా జనసేనకే బలం ఉన్నట్లు చెప్పాలి. అయితే ఇంత వరకు జనసేనకు ఉన్న బలాన్ని కూడా బీజేపీ గౌరవించిన దాఖలాల్లేవనే చెప్పాలి. జీహెచ్‌యంసీ ఎన్నికల్లోను, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో సైతం జనసేనే వెనక్కుతగ్గాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జనసైనికుల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్న వాదన విన్పిస్తోంది.

అటు పార్టీ పటిష్టం కాకపోగా, ఇటు రాష్ట్రంలో జనంలోకి చొచ్చుకుపోయే పరిస్థితీ లేకపోగా ఈ పోత్తుతో పవన్‌ ఏమి ఆశిస్తున్నారో? అర్ధం కావడం లేదంటూ జుట్టు పీక్కుంటున్నారంటున్నారు. పొత్తుధర్మం.. బలాబలాలు.. రాజకీయ పరిస్థితులు.. భవిష్యత్తు వ్యూహం.. ఇలా చెప్పే పదాలు బాగున్నప్పటికీ వీటి వల్ల జనసేనకు కలిగే ప్రయోజనాలపై ఆ పార్టీ కార్యకర్తల్లో సైతం అయోమయే నెలకొందంటున్నారు. గతంలో బీజేపీ నుంచే తిరుపతి పార్లమెంటు అభ్యర్ధి ఉంటాడని ప్రకటించిన వెంటనే అక్కడి జనసైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకతే బైటపడింది. ఇప్పుడు అదే నిజమైన నేపథ్యంలో వారి స్పందన ఏంటన్నది ఎన్నికల ఫలితాల ద్వారానే తేలాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి