iDreamPost

చేసేదేమో డీఎస్పీగా.. సాయమేమో ఉగ్రవాదులకు.. అడ్డంగా దొరికిపోయి

చేసేదేమో డీఎస్పీగా.. సాయమేమో ఉగ్రవాదులకు.. అడ్డంగా దొరికిపోయి

జమ్ముకాశ్మీర్ అనగానే అందమైన మంచుకొండలు మాత్రమే కాదూ.. వణికించే తుపాకీ తూటాల శబ్దాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఉగ్ర దాడులు, భారత ఆర్మీ ప్రతి దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతూ ఉంటుంది. పొంచి ఉన్న ఉగ్రవాదులను, వారి చొరబాట్లను అడ్డుకుంటూ ఉంటుంది ఆర్మీ. అయితే తిన్నింటి వాసలు లెక్కపెట్టినట్లు.. ఏకంగా ఉగ్రవాదులతోనే చేతులు కలిపి.. ఇక్కడి సమాచారాన్ని అందిస్తున్నాడు ఓ పోలీసు ఉన్నతాధికారి. చివరకు అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సైన్యం చేసే ఆపరేషన్లు, అరెస్టులకు సంబంధించిన వివరాలను లీక్ చేసి ఉగ్రవాదులు తప్పించుకునేటట్లుగా సాయం చేయడంతో అతడ్ని అరెస్టు చేశారు.

జమ్ముకాశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షేక్ ఆదిల్ మస్తాక్ .. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. ఉగ్రవాద దాడిలో అరెస్టైన నిందితులు తప్పించుకోవడానికి సహాయం చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ పోలీసు అధికారిని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. అవినీతి సహా పలు ఆరోపణలపై ఆదిల్ ను అరెస్టు చేసి శ్రీనగర్ లోని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, ఆరు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. కాగా, ఇవన్నీ జులైలో అరెస్టయిన ఉగ్రవాది ద్వారా అతడి వ్యవహారం బయటకు వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని ఫోనును క్షుణ్ణంగా పరిశీలించగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిల్, ఉగ్రవాదులతో నిత్యం టెలిగ్రామ్ యాప్ ద్వారా సంభాషించేవాడని, వీరి మధ్య సుమారు 40 కాల్స్ ఉన్నాయని చెప్పారు. అరెస్టు నుండి తప్పించుకోవడం, న్యాయ సహాయం ఎలా పొందాలో సూచించేవాడని దర్యాప్తు అధికారి తెలిపారు.

దీంతోపాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు  నిధులు సమకూర్చే ముజ్మిల్‌ జహూర్‌ అనే ఉగ్రవాదితో కూడా డీఎస్పీ ఆదిల్‌ ముస్తాక్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడైంది.  సాంకేతిక ఆధారాలను బట్టి వాటర్ టైట్( చాలా క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ధారించుకుని, తప్పు ఎత్తి చూపలేని విధంగా పెట్టే కేసు)కేసును పెట్టారు. ఉగ్రవాదులకు ఎలా సహాయం చేశాడన్న దానిపై స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసును దర్యాప్తు చేపడుతున్న ఒక పోలీసు అధికారిని కూడా ఇరికించేందుకు ఆదిల్ ప్రయత్నించినట్లు వెల్లడించారు. అరెస్టైన ఉగ్రవాది నుండి రూ. 5 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఓ ఉన్నతాధికారిని అరెస్టు చేయడం గత మూడేళ్లలో ఇది రెండో కేసు. కాగా, ఆదిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అతడిని ఎక్స్ (ట్విట్టర్) లో 44 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి