iDreamPost

మ్యానిఫెస్టో అమలులో మైల్ స్టోన్ గా మారుతున్న జగన్ పాలన

మ్యానిఫెస్టో అమలులో మైల్ స్టోన్ గా మారుతున్న జగన్ పాలన

ఎన్నికల ప్రణాళికను పార్టీలు విడుదల చేయడమే తప్ప దానిని పట్టించుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో కనిపించలేదు. మ్యానిఫెస్టోలో చెప్పడం తప్ప వాటిని అమలు చేస్తారనే ధీమా ఓటర్లలో కూడా కనిపించేది కాదు. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్ విపక్షంలో ఉండగా తాను చెప్పిన మాటలకు కట్టుబడి సాగుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తనకు మ్యానిఫెస్టో అంటే ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని చెప్పినట్టుగానే సాగుతున్నారు. తాను చెప్పిన మాటను ఆచరించే పనికి ప్రాధాన్యతనిస్తున్నారు. మ్యానిఫెస్టో ని తూచా తప్పకుండా పాటిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నికల ప్రణాళిక అంటే ఓటింగ్ ముందు చెప్పే మాటలు మాత్రమే కాదు.. గద్దెనెక్కిన తర్వాత చేయాల్సిన పనులని చాటుతున్నారు. భవిష్యత్తులో ఇతర పార్టీల నేతలకు కూడా ఎన్నికల్లో ఇచ్చే మాటకు కట్టుబడి ఉండాల్సిందేననే పరిస్థితిని తీసుకొస్తున్నారు.

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఓటర్లను మభ్య పెట్టడం అనేది చంద్రబాబు వంటి నేతలకు సాధారణ అంశంగా మారింది. కానీ జగన్ మాత్రం తాను చేయగలిగిందే చెబుతాను..తన చేతుల్లో ఉన్నవే హామీ ఇస్తానని కుండబద్దలు కొట్టారు. కాపు రిజర్వేషన్లు సహా అనేక అంశాల్లో తన వైఖరిని బహిరంగంగానే తేటతెల్లం చేశారు. అదే సమయంలో తన ద్వారా చేయగలిగినంత మేరకు మేలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల తర్వాత తన మ్యానిఫెస్టో కనిపించకుండా చేసిన చంద్రబాబు అనుభవం అందరికీ తెలిసిందే. కానీ జగన్ మాత్రం ఊరూరా అన్ని సచివాలయాల్లో తన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రదర్శించాలని ఆదేశించారు. సీఎంవోలో దానిని ప్రదర్శిస్తున్నారు. అందులోని అంశాలను అమలు చేసేందుకు పూనుకున్నారు.

తొలి ఏడాదిలోనే జగన్ మ్యానిఫెస్టోలో 90శాతం అమలు చేసినట్టు ప్రకటించారు. మిగిలిన వాటిని కూడా రెండో ఏడాదిలో అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. కరోనా వేళ, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆక్రమంలోనే మరో హామీ అమలుకి పూనుకున్నారు. చిరువ్యాపారులకు అండగా ప్రభుత్వం ఉంటుందని నాడు చెప్పినట్టుగానే ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభిస్తున్నారు. లబ్ధిదారుల జాబితా కోసం ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది చిరువ్యాపారులు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

సంప్రదాయ చేతివృత్తిదారుల ఉత్పత్తులకు కూడా ఆర్థిక చేయూతనందించే ఈ పథకం ద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నారు. సుమారు రూ. 1000 కోట్ల మేరకు వడ్డీలేని రుణాల పంపిణీ చేయబోతున్నారు. ఈ పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు.

చిరువ్యాపారులు చెల్లించాల్సిన వడ్డీభారాన్ని కూడా ప్రభుత్వమే భరించబోతోంది. తన సుదీర్ఘ పాదయాత్రలో వీధి వ్యాపారుల కష్టాలను స్వయంగా చూసిన వైయస్ జగన్ వారిని ఆదుకుంటానని నాడు హామీ ఇచ్చారు.

దానికి అనుగుణంగానే జగనన్న తోడు పథకాన్ని రూపొందించారు. లబ్దిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయయ్యేలా చేశారు. రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్నచిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్‌, టీ స్టాల్స్, చిన్న చిన్న దుకాణదారులకు రోజువారీ తమ వ్యాపారం కోసం అవసరమైన పెట్టుబడి వ్యయంగా ఇది తోడ్పడుతుంది. వీరితోపాటు చేతివృత్తిదారులైన లేస్ వర్క్‌, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మల తయారీదారులు, కళాకృతులతో కూడిన కుండల తయారీదారులు, బొబ్బిలివీణలు, కంచు విగ్రహాలు, కళాత్మక వస్తువుల తయారీదారులు వంటి సంప్రదాయ వృత్తికళాకారులు సైతం లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బారి నుంచి వారికి ఈ పథకం పెద్ద ఉపశమనం కలిగించబోతోంది. బ్యాంకుల నుంచి రూ.పదివేల వరకు సున్నావడ్డీ రుణాలు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ వడ్డీ భారంను ప్రభుత్వమే భరిస్తూ, చిరువ్యాపారులకు అండగా నిలిచేందుకు ముందడుగు వేశారు. చెప్పాడంటే చేస్తాడంటే మాటను జగన్ మరోసారి ఆచరణలో నిరూపించుకుంటున్న తీరు పలువురిని ఆనందంలో ముంచెత్తుతోంది. అనేక మంది అభినందనలు అందుకుంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి