iDreamPost

టీడీపీ కంచుకోటలపై జగన్‌ కన్ను

టీడీపీ కంచుకోటలపై జగన్‌ కన్ను

ప్రధాన రాజకీయ పార్టీలకు కొన్ని నియోజకవర్గాలు కంచుకోటలుగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి ఏపీలో కంచుకోటల్లాంటి నియోజకవర్గాలున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి తుఫానులాగా వీచినా టీడీపీ కంచుకోటల్ని మాత్రం కూల్చలేకపోయింది. టీడీపీకి అలాంటి బలమైన నియోజకవర్గాలుండబట్టే గత ఎన్నికల్లో 23 సీట్లయినా దక్కాయనడంలో సందేహం లేదు.

తన పాదయాత్రతో గత ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్‌కు టీడీపీ 23 నియోజకవర్గాల్లో గెలవడం ఆలోచింపజేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఎలా గెలించిందని చరిత్ర పరికిస్తే.. అవి టీడీపీకి కంచుకోటలని తేలింది. ప్రస్తుతం సీఎం జగన్‌ టీడీపీ కంచుకోటలను బద్ధలుకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆ కోటలను బద్ధలు కొట్టాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు.

టీడీపీకి హిందూపురం, కుప్పం, పర్చూరు, గన్నవరం, మండపేట లాంటి నియోజకవర్గాలు కంచుకోటల్లా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో టీడీపీనే వరుసగా గెలుస్తూ వస్తోంది. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు చెక్‌ పెట్టాలనే లక్ష్యంతో జగన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. హిందూపురంలో గత ఎన్నికల్లో అభ్యర్థిని మార్చి చూసినా ఫలితం దక్కలేదు. పోటీ చేసి ఓడిపోయిన ఐపీఎస్‌ అధికారి మహ్మద్‌ ఇక్భాల్‌ను ఎమ్మెల్సీని చేసి నియోజకవర్గంపై పట్టు పెంచుకునేలా అవకాశం కల్పించారు.

ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీకి గత రెండు పర్యాయాలు విజయం దక్కలేదు. గత ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరావును రంగంలోకి దింపినా ఫలితం రాలేదు. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్‌ బలమైన నాయకుడు కరణం బలరాంను పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు పర్చూరు బాధ్యతలు ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇక కృష్ణా జిల్లా గన్నవరంపై కూడా జగన్‌ ఇప్పటికే దృష్టి పెట్టారు. గన్నవరం బాధ్యతలు దేవినేని అవినాష్‌కు అప్పగించారు. టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం అధికార పార్టీకి దగ్గరయ్యారు.

తాజాగా సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లా మండపేటపై దృష్టి పెట్టారు. మండపేట టీడీపీకి బలమైన నియోజకవర్గం. టీడీపీ తరపున వేగుళ్ల జోగేశ్వరరావు ఇక్కడ నుంచి వరసగా గెలుస్తున్నారు. గత ఎన్నికల్లో మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌ను ఇక్కడ నుంచి బరిలోకి దింపినా విజయం సాధ్యం కాలేదు. కమ్మ సామాజిక వర్గ ఓటర్లు తక్కువైనా నియోజకవర్గంపై ఆ సామాజికవర్గం నేతలదే పైచేయిగా వస్తోంది. వీరికి పోటీగా కాపులు, శెట్టిబలిజలున్నారు. ఈ సామాజికవర్గాల ఓటర్లు ఇక్కడ ఎక్కువ. గత ఎన్నికల్లో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌ వైసీపీ తరఫున రంగంలోకి దిగారు.

వచ్చే ఎన్నికల్లో మండపేటను ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం జగన్‌ తాజాగా ఆ నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు అప్పగించారు. మండపేట పక్క నియోజకవర్గమైన రామచంద్రపురం నుంచి త్రిమూర్తులు పలుమార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన.. వైసీపీ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యారు. తూర్పు గోదావరిలో కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న త్రిమూర్తులు ఎన్నికలకు ముందే వైసీపీలో చేరాలని ప్రయత్నాలు చేశారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గం సీటు తనకు ఇస్తే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు. ఆ స్థానం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పడున్న సమీకరణాల్లో తోటకు స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన టీడీపీలో ఉండిపోయారు. ఒకానొక సమయంలో జనసేనలో కూడా చేరుతారనే ప్రచారం జరిగింది.

ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన తోటకు జగన్‌ మంచి గుర్తింపునిచ్చారు. అమలాపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా బాధ్యలప్పగించారు. భవిష్యత్‌లో తోటను మండపేట నుంచి బరిలో దింపాలనే లక్ష్యంతోనే పార్టీలో చేరుకున్నారని తాజా నిర్ణయంతో అర్థమవుతోంది. సీఎం జగన్‌ అంచనాలను నిజం చేసేలా వచ్చే ఎన్నికల్లో తోట.. టీడీపీ కంచుకోటైన మండపేటలో వైసీపీ జెండా ఎగురవేస్తారా..? లేదా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి