iDreamPost

వసతి దీవెన అందుకేనట.. జగన్‌ ఫర్ఫెక్ట్‌ లాజిక్‌..

వసతి దీవెన అందుకేనట.. జగన్‌  ఫర్ఫెక్ట్‌ లాజిక్‌..

ఇంటర్‌ ఆపైన చదవుకునే విద్యార్థులకు భోజన,వసతి కోసం జగన్‌సర్కార్‌ రూపొందించిన జగనన్న వసతి దీవెన పథకం ఈ రోజు సోమవారం విజయనగరంలో లాంఛనంగా ప్రారంభమైంది. సీఎం వైఎస్‌ జగన్‌ పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఈ పథకం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో వివరించారు. జగన్‌ చెప్పిన కారణం వంద శాతం వాస్తవంగా ఉంది. ఇంతకీ ఆయన చెప్పిన కారణం ఏమిటంటే.. భారతదేశంలో 18– 23 ఏళ్ల మధ్య విద్యార్థుల్లో చదువులు కొనసాగించే వారి సంఖ్య కేవలం 23 శాతం మాత్రమేనట. అదే బ్రిక్స్‌ దేశాలైన రష్యా, చైనా, బ్రెజిల్‌ లాంటి దేశాలతో పోల్చితే.. చాలా తక్కువ. ఇంటర్‌ తర్వాత చదువులు కొనసాగిస్తున్న విద్యార్ధులు రష్యాలో 81 శాతం, బ్రెజిల్, చైనాల్లో 51 శాతం మేర ఉన్నారు.

భారత్‌లో ఈ శాతం 23కే పరిమితమైంది. అంటే ఇంటర్‌ తర్వాత 77 శాతం మంది చదువులు మానేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పేదరికం ఎలా పోతుంది. వారి తలరాతలు ఎలా మారుతాయి. ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు చదవాలి. పెద్ద జీతం సంపాదించాలి. అంతో ఇంతో కుటుంబానికి పంపాలి. అప్పుడే పేదరికం నుంచి ఆ కుటుంబం బయటపడుతుంది. చదువే ఆస్తి.. అందుకే ఫీజు రియంబర్స్‌మెంట్‌తోపాటు, వసతి, భోజన ఖర్చుకు కూడా నగదు ఇస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా వసతి దీవెన పథకం.. అందరికీ వర్తింపజేస్తామని జగన్‌ ప్రకటించారు.

రాష్ట్రంలో ప్రతి పిల్లాడికి ఆస్తిగా చదువు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని సీఎం జగన్‌ చెప్పారు. అందుకే అమ్మ ఒడి కోసం 6400 కోట్ల రూపాయలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌కు 3700 కోట్ల రూపాయలు, వసతి దీవెన కోసం 2300 కోట్ల రూపాయలు.. వెరసి ఏడాదికి విద్య కోసం 12,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇవి గాక మన బడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలు మారుస్తామని పునరుద్ఘాటించారు. ఎవరు ఎన్ని చేసినా వచ్చే జూన్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన తప్పక జరుగుతుందని స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి