iDreamPost

బానిసలుగా తెలుగు అమ్మాయిలు – రంగంలోకి దిగిన సిఎం జగన్

బానిసలుగా తెలుగు అమ్మాయిలు – రంగంలోకి దిగిన సిఎం జగన్

పేదరికాన్ని తట్టుకోలేక కుటుంబ ఆర్ధిక భారాన్ని కొంతైనా తగ్గించుకోవాలనే ఆలోచనతో ఉద్యోగాల కోసం , ఉపాధి కోసం పొట్ట చేత బట్టుకుని ఏజెంట్ల మాటలు నమ్మి అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ షేకులకు బానిసలుగా మారుతున్న ఉదంతాలు నిత్యం మనకు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. షేకుల కబంధ హస్తాల నుండి తప్పించుకుని కువైట్ లోని భారత దౌత్య కార్యలయానికి చేరుకున్న సుమారు 200 మంది బాధిత మహిళలు తమని ఎలాగైనా రక్షించి తిరిగి భారతదేశానికి వచ్చేలా సాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ని అభ్యర్ధిస్తు ఒక సెల్ఫీ విడియో ద్వారా సందేశం పంపారు.

Read Also: జగన్ ని అభినంధించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి…

బాధిత మహిళల్లో ఒకరైన వసుంధర మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పొదలాడకు చెందిన ఏజెంట్ లక్ష్మణ రావు ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పిన మాటలు నమ్మి తాము కువైట్ దేశానికి వచ్చామని తీరా తాము ఇక్కడికి వచ్చాక అరబ్ షేకులకు అమ్మేశారని ఇక్కడ షేకుల తమని చిత్రహింసలకు గురి చేస్తు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, పాస్ పోర్టులు కూడా లాగేసుకున్నారని. తమకు తినడానికి సరైన తిండి కూడా లేదని అతి కష్టం మీద షేకుల నుండి తప్పించుకుని కువైట్ లో ఉన్న భారత దౌత్య కార్యాలయానికి చేరుకున్నామని, ఇక్కడ సుమారు తమలాంటి బాధిత మహిళలు 200 పైనే ఉన్నారని, తమ దగ్గర సెల్ ఫోన్ కూడా లేదని, ఒకరి సహాయం తో ఈ విడియో పంపిస్తున్నాం అని, జగన్ గారే తమని కాపాడాలంటు తమ సందేశాన్ని పంపారు.

Read Also: జగన్ కి కృతజ్ఞతలు చెప్పిన తమిళనాడు ముఖ్యమంత్రి

అయితే శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. వై.యస్.ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బాధిత మహిళల వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసి వీరిని వెంటనే రక్షించే చర్యలు చేపట్టాలని విదేశాంగ వ్యవహారాల మంత్రి జై శంకర్ ను విజ్ఞప్తి చేశారు. మరో పక్క ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు సి.యం.ఒ కార్యాలయం వెంటనే స్పందించి బాధిత మహిళలను వెంటనే వెనక్కు రప్పించే బాధ్యతలు తక్షణమే తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏజెంటు లక్ష్మణ రావుని అదుపులోకి తీసుకుని కువైట్ భారత దౌత్య కార్యాలయంతో సప్రదింపులు జరిపి బాధిత మహిళలను సురక్షితంగా తిరిగి భారత దేశానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి