iDreamPost

జ‌గ‌న్ ఆశ‌ల‌కు హ‌స్తిన ఊపునిచ్చిందా…!

జ‌గ‌న్ ఆశ‌ల‌కు హ‌స్తిన ఊపునిచ్చిందా…!

ఏపీలో అధికారంలో రాక‌ముందు, వ‌చ్చిన త‌ర్వాత కూడా వైఎస్సార్సీపీకి హస్తిన‌లో అంత సానుకూల‌త క‌నిపించ‌లేదు. సుదీర్ఘ‌కాలం పాటు ఢిల్లీని ఢీకొట్ట‌డంతోనే స‌రిపోయింది. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయాల్లో అన‌నుకూల‌త త‌గ్గినా అవి పూర్తి సానుకూలంగా మారిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో వ‌స్తున్న మార్పుల‌తో మ‌ళ్లీ ప‌రిస్థితి మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ ఆశించిన రీతిలో వ్య‌వ‌హారాలు ఉంటున్నాయా అంటే అలాంటి అవ‌కాశాలున్నాయ‌ని మాత్రం ప్ర‌స్తుతానికి చెప్ప‌క త‌ప్ప‌దు.

వ‌రుస‌గా మూడు రోజుల వ్య‌వ‌ధిలో కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. అది కూడా సాధార‌ణ స‌మావేశాల మాదిరి కాకుండా సుదీర్ఘ భేటీలు సాగించారు. అదే స‌మ‌యంలో ఏకాంతంగానూ స‌మావేశ‌మ‌య్యి కీల‌క అంశాల‌ను చ‌ర్చించారు. దాంతో ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం మొద‌ల‌య్యింది. ఓవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తున్న స‌మ‌యంలో ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. మోడీ- అమిత్ షాతో ఆయ‌న ఏమి చ‌ర్చించార‌న్న‌ది రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ప‌ట్ల టీడీపీ స్పందించింది. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న వివ‌రాలు వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. జ‌గ‌న్-మోడీ ఏం మాట్లాడుకున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాలంటూ టీడీపీ ప్ర‌శ్నించ‌డం ద్వారా ప్ర‌త్య‌ర్థి శిబిరంలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఎంత ఉత్కంఠ‌ను రాజేస్తుంద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌య్యింది. అదే స‌మ‌యంలో ఏపీకి చెందిన కీల‌కాంశాల‌లో క్లారిటీ వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల విష‌యంలో ఇప్ప‌టికే కేంద్రం త‌న వైఖ‌రిని చెప్పేసింది. అయితే అందులో ముఖ్య‌మైన హైకోర్ట్ ని క‌ర్నూలు మార్చే ప్ర‌క్రియ‌కు రాష్ట్ర‌ప‌తి గెజిట్ ఆమోదం అవ‌స‌రం కావ‌డంతో ఆ ప్ర‌య‌త్నంలో ఉన్న జ‌గ‌న్ కి కేంద్రం పెద్ద‌ల నుంచి ఆశీర్వాదం ల‌భించిన‌ట్టు చెబుతున్నారు. అందుకు తోడుగా మండ‌లి ర‌ద్దు వ్య‌వ‌హారానికి ముగింపు ప‌లికే దిశ‌లో జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

అన్నింటికీ మించి జ‌గ‌న్ , బీజేపీ బంధం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశాలు సుస్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీలో త‌న‌కు ద‌క్కే నాలుగు ఎంపీ సీట్ల‌లో ఒక‌టి బీజేపీకి కేటాయించే దిశ‌లో వైఎస్సార్సీపీ ముందుకు వ‌స్తే, ఎన్డీయేలో చేరి రెండు మంత్రి ప‌ద‌వులు తీసుకోవాల‌నే ఆఫ‌ర్ బీజేపీ నుంచి వ‌చ్చిన‌ట్టు హ‌స్తిన వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త‌ద్వారా ఇరు పార్టీల మ‌ధ్య సాన్నిహిత్యం మ‌రింత ధృడ‌ప‌డుతుంద‌నే అభిప్రాయం క‌లిగిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్సా కూడా అవ‌స‌రం అయితే ఎన్డీయేలో చేర‌తామ‌ని చెప్ప‌డం దానికో సంకేతంగా చెప్ప‌వ‌చ్చు. గ‌తం నుంచి కీల‌కాంశాల‌లో మంత్రి బొత్సాతో లీకులు ఇప్పించ‌డం, దానికి అనుగుణంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌గ‌న్ అలవాటుగా మార్చుకుంటున్నారా అనే అభిప్రాయం ఈ విష‌యంలో వినిపిస్తోంది.

అటు మోడీ తో భేటీలోనూ, ఇటు షాతో చ‌ర్చ‌ల్లోనూ దాదాపుగా జ‌గ‌న్ నుంచి అవే అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న‌లు చెబుతున్నాయి. పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా స‌హా ప‌లు అంశాలు ప్ర‌స్తావించ‌డం ద్వారా ఏపీ ప్ర‌జ‌ల అంశాల‌ను ముఖ్య‌మంత్రి మ‌రోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు చెప్ప‌వ‌చ్చు. వాటికితోడుగా అటు చంద్ర‌బాబుకి సంబంధించిన వ్య‌వ‌హారంలోనూ, ఇటు జ‌గ‌న్ కేసుల విష‌యంలోనూ ఆయా నేత‌లు ఏం మాట్లాడుకున్నారు, దాని ప‌ర్యావ‌సానం ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ప్ర‌స్తుతానికి అంతుబ‌ట్ట‌ని వ్య‌వ‌హారంగా ఉంది. టీడీపీ శిబిరంలో క‌ల్లోలంగా మారుతోంది. వైఎస్సార్సీపీ నేరుగా బీజేపీతో క‌లిస్తే ఇక టీడీపీ కి మ‌రిన్ని క‌ష్టాలు తెచ్చే రీతిలో ప‌రిణామాలుంటాయ‌నే వాద‌న ఏమేర‌కు ఆచ‌ర‌ణ రూపం దాలుస్తుంద‌న్న‌ది ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త‌ ఎదురుచూడాల్సిన అంశంగా ఉంది. ఏమ‌యినా జ‌గ‌న్ తాజా ఢిల్లీయాత్రం అటు అధికార‌, ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీల వ్య‌వ‌హారాల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో సాగుతోంద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి