iDreamPost

ఐటి దాడులతో తెలుగుదేశంలో తీవ్ర కలకలం

ఐటి దాడులతో తెలుగుదేశంలో తీవ్ర కలకలం

గుంటూరు నగరంలోని ప్రముఖ పొగాకు వ్యాపార సంస్థ ఐన పోలిశెట్టి & సన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల పై గత రెండు రోజులుగా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఒకపక్క ఆ వార్త నగరంలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఐటి అధికారుల దాడుల సందర్భంగా నగరంలోని రెండు ప్రముఖ పొగాకు కంపెనీల మధ్య జరిగిన వందలకోట్ల ఆస్తుల క్రయవిక్రయాలలో గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఇంచార్జ్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కోవెలమూడి రవీంద్ర (నాని) మధ్యవర్తిత్వం జరిపినట్టు గట్టి ఆధారాలను ఐటి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు నాయకుడిని ఐటి అధికారులు విచారణకి పిలిపించి రోజంతా విచారించినట్టు విశ్వసనీయ సమాచారం.

గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ తెలుగుదేశం నాయకుడు అనేక వ్యాపార లావాదేవీల్లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆ వాదనకి బలం చేకూర్చే విధంగా ఆయన మీద ఇప్పటికే వ్యాపారలావాదేవీలలో అక్రమాలకు సంబందించిన కేసులతో పాటు చెక్ బౌన్స్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల గుంటూరు నగరంలో దివాళా తీసిన ఒక పొగాకు వ్యాపారి తన ఆస్తులను విక్రయానికి పెట్టాడు. దానిలో భాగంగా నగరంలో మరో పేరొందిన పొగాకు కంపెనీ వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ఆస్తులను కొనుగోలు చేసింది. ఆ డీల్ లో సదరు తెలుగుదేశం నేత మధ్యవర్తిత్వం వహించినట్టు ఐటి అధికారులు గుర్తించారు. ఈ భారీ డీల్ లో మధ్యవర్తిత్వం వహించినందుకుగాను వన్ టైం సెటిల్మెంట్ కింద సదరు తెలుగుదేశం నేత భారీ మొత్తంలో కమిషన్ దండుకున్నాడని సమాచారం.

ఈ నేపథ్యంలో గుంటూరులోని కోవెలమూడి రవీంద్ర (నాని) ఇళ్లు, గెస్ట్ హౌస్ లతో పాటు ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండే అతని సన్నిహితుడు ఇంటిపై కూడా ఏకకాలంలో దాడులు చేసిన ఐటి అధికారులు, ఈ దాడులలో కొన్ని కీలక డాక్యుమెంట్లు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంట్లో మెటల్ డిటెక్టర్ బృందంతో తనిఖీలు జరుపుతుండగా ఒక గోడలో ఏవో అనుమానిత వస్తువులున్నట్టు గుర్తించిన అధికారులు ఆ గోడలను బద్దలుకొట్టగా, అందులో షుమారు 30 కేజీల వరకు బంగారు తీగలు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల ముందు కూడా కోవెలమూడి రవీంద్ర (నాని) పై ఒకసారి ఐటి దాడులు జరిగినట్టు తెలిసింది.

ఇటీవలే గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ ఆ పార్టీకి రాజీనామా చెయ్యడంతో, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఇంచార్జ్ గా కోవెలమూడి రవీంద్ర (నాని) ని నియమించారు. నాని చాలారోజులుగా తెలుగుదేశం రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో కూడా నానికి మంచి సంబంధాలున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో కోవెలమూడి నాని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేశారు.

అయితే స్వతాహాగా ఆర్ధికంగా అంత బలమైన నేపధ్యం లేనప్పటికీ కోవెలమూడి నాని ని గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ గా చంద్రబాబు నియమించడం పట్ల అప్పట్లో కొందరు పార్టీ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా అప్పటికే ఆయనపై అనేక ఆర్ధిక లావాదేవీల కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. అయితే ఒక ప్రముఖ పొగాకు కంపెనీకి ఆయన బినామీగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. దానితో సదరు కంపెనీ యాజమాన్యంతో తెలుగుదేశం అధినేతకు ఉన్న అనుబంధం దృష్యా సదరు కంపెనీకి బినామీగా ఉన్న కోవెలమూడి రవీంద్ర (నాని) ని గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ గా నియమించినట్టు తెలుస్తుంది.

తాజాగా ఐటి అధికారులు పోలిశెట్టి & సన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పై విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పశ్చిమ ఇంఛార్జ్ పాత్ర బయటకి రావడం రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది. దానితో ఈ విచారణలో ఇంకా ఎవరి పేర్లు బయటపడతాయోనన్న ఆందోళన తెలుగుదేశం వర్గాల్లో నెలకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి