iDreamPost

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు ఎలా జరుగుతున్నాయంటే..?

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు ఎలా జరుగుతున్నాయంటే..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద దీర్ఘకాలంగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావుకు, ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లల్లో ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లో మూడోరోజూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. విజయవాడలోని శ్రీనివాసరావు ఫ్లాట్‌లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని చంపాపేట్ గ్రీన్‌పార్క్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫ్లాట్‌కు శ్రీనివాస్ ను తరలించారు. సీఆర్‌పీఎఫ్‌ భద్రత నడుమ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఆయననుండి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ అనంతరం జీఏడీలో పనిచేస్తున్నారు.

పదేళ్లుగా చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాసరావు చంద్రబాబు అధికార అండతో అనేక అక్రమాస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. మరోవైపు ఆయన చంద్రబాబుకు బినామీగా కూడా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే సోదాలు నిర్వహిస్తున్న అధికారులు రాత్రి సమయంలో కూడా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మేల్కోని డాక్యుమెంట్లు పరిశీలిస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు బయటపడినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినపుడు శ్రీనివాస్ సెక్రెటేరియట్ ఉద్యోగి.. ఆయన పీఎస్ అయ్యాక కాంట్రాక్టు పనుల్లో కీలకంగా వ్యవహరించాడన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ పనులు గుత్తేదారులకు కేటాయించడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని దీనిలో భాగంగా కోట్ల రూపాయలు డీల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కాంట్రాక్టు పనుల అంచనా వ్యయాన్ని విపరీతంగా పెంచి తాము ఎంపికచేసిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టెండర్లు వేసి, అధిక ధరలకు పనులు వారికి అప్పగించి భారీగా ముడుపులు వసూలు చేసుకున్నారని, ఆయా సంస్థల నుంచి వసూలుచేసిన కమీషన్లను బినామీల ఖాతాల్లోకి మళ్లించి అక్కడి నుంచి కుటుంబ వ్యాపార సంస్థల్లోకి దారి మళ్లించడం వంటివి చేసినట్టు గుర్తించారు.

ముంబై కేంద్రంగా పనిచేసే ఓ బడా కాంట్రాక్టు సంస్థకు చెందిన కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీకి చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్లు ముడుపులు అందాయని పక్కా ఆధారాలతో ఐటీ అధికారులు సోదాలకు సిద్ధమయ్యారట. అక్కడి తీగ లాగితే చంద్రబాబు మాజీ పీఏ డొంక కదిలినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కీలక పరిణామం కాబట్టి ఈ ఐటీ సోదాల్లో ఆశ్చర్యకరంగా రాష్ట్ర పోలీసులను ఐటీ అధికారులు వాడుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పోలీసులు ఉంటే లీక్ చేసే అవకాశం ఉందన్న నెపంతోనే ఢిల్లీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను ఐటీ అధికారులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

విజయవాడ పరిధిలోని మాచవరం పోలీసులు ఐటీ సోదాలపై ఆరా తీయగా ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నట్లు పోలీసులకు సీఆర్పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు. అయితే ఏపీ పోలీసులను మాత్రం లోపలికి అనుమతించలేదు. మరోవైపు ఈ వరుస ఘటనలతో ఈకేసు వ్యవహారం తమ నాయకుడు చంద్రబాబుకు చుట్టుకుంటుదేమోనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళచెందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి