iDreamPost

కేంద్రప్రభుత్వంలో చేరనున్న వైఎస్సార్‌సీపీ..?

కేంద్రప్రభుత్వంలో చేరనున్న వైఎస్సార్‌సీపీ..?

దేశ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగబోతున్నాయి. కొత్త పొత్తులు, మిత్రత్వాలు ఏర్పడబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(వైఎస్సార్‌సీపీ) చేరబోతోందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, బీజేపీ పెద్దల మధ్య చర్చలు సాగుతున్నాయి. బుధవారం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీతో దాదాపు గంటన్నర పాటు సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ భేటీ కాబోతున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితం సీఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇటీవల పార్టీ పగ్గాలు జేపీ నడ్డాకు అప్పగించినా.. ముఖ్యమైన అంశాలు అన్నీ అమిత్‌షానే చక్కబెడుతున్నారు.

ప్రజాప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, వైఎస్సార్‌సీపీ మధ్య పొత్తు పొడుస్తున్నట్లు తెలుస్తోంది. వినూత్నమైన నిర్ణయాలతో రాష్ట్రంలో పరిపాలనను సీఎం వైఎస్‌ జగన్‌ కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. పరిపాలనల, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం రాజీలేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్ధతు ఉంటే ఈ పనులను వేగవంతంగా చేయొచ్చని ఏపీలో అధికారపార్టీ భావిస్తోంది. మరోవైపు రాజ్యసభలో బలంలేమితో బిల్లులు పాస్‌ చేయించుకోవడంలో బీజేపీ శక్తుయుక్తులను కూడగట్టుకోవాల్సి వస్తోంది. మిత్రపక్షమైన శివసేన ఇప్పటికే దూరం కాగా.. బీహార్‌లో జేడీయూ కూడా అదే బాటలో ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్న క్రమంలో బీజేపీకి కొత్త మిత్రులు అవసరం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పొత్తుపెట్టుకోవాలని నిర్ణయానికొచ్చినట్లు సమాచారం.

పొత్తులో భాగంగా కేంద్ర కేబినెట్‌లో వైఎస్సార్‌సీపీకి రెండు మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. ఇందులో ఒకటి స్వతంత్ర హోదా గల సహాయ మంత్రి, మరోకటి సహాయ మంత్రి పదవని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండు పదవుల్లో ఒకటి వైఎస్‌ జగన్‌ కుటుంబంతో మూడు తరాల నుంచి అనుబంధం కొనసాగిస్తున్న రాజ్యసభ సభ్యుడు వై. విజయసాయి రెడ్డికి దక్కనున్నట్లు సమాచారం. మరొక పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై వైఎస్సార్‌సీపీ పెద్దలు అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నారు. అయితే ముగ్గురు పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్, బీసీ(గౌడ) సామాజికవర్గానికి చెందిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, కాపు సామాజికవర్గానికి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి