iDreamPost

పోలవరం కుడి కాలువ పెంపుపై తెలంగాణ ఫిర్యాదు..? నిజంగా వారికి నష్టం జరుగుతుందా..?

పోలవరం కుడి కాలువ పెంపుపై తెలంగాణ ఫిర్యాదు..? నిజంగా వారికి నష్టం జరుగుతుందా..?

పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ రావు లేఖ రాశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల ఏడాదికి సుమారు 300 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని తన లేఖలో పేర్కొన్నారు. గోదావరి బేసిన్‌లోని మిగులు జలాల పంపిణీపై తుది నిర్ణయం తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ఇలా నీటిని మళ్లించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు తెబ్బతింటాయని మురళీధర్‌ రావు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపాదించిన పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంపును అడ్డుకోవాలని ఆయన గోదావరి బోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల్లో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన వివాదం ఇది. అయితే కేవలం రాజకీయ, లేదా మరో ఇతర ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందనేది సాధారణ రైతుకు కూడా అర్థం అవుతోంది. ఎగువ పొలం రైతు తనకు ఎకరా పొలం కోసం కేటాయించిన నీళ్లకు మించి రెండెకరాల పొలానికి అవసరమైయ్యే నీటిని వాడుకుంటే దిగువ పొలం రైతుకు నష్టం జరుగుతుంది. సదరు రైతుకు సరిపడా నీళ్లు అందవు. ఇది జగమెరిగిన సత్యం.

ఇలాగే గోదావరి నది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల గుండా ప్రవహించి చివరగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ ద్వారా ఆయా జిల్లాలో దాదాపు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ(సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ) వద్ద గోదావరి నది ఏడు పాయలుగా చీలి.. చివరికి గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయి అనే నాలుగు పాయలుగా కలిసి దిగువన 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగాళాఖాతంలో కలుస్తుంది. సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకుంటే ఎగువన ఉన్న రాష్ట్రాల వారికి ఏమి నష్టం జరుగుతుంది..?

ధవళేశ్వర్యం బారేజీకి ఎగువున దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రాజెక్టుకు ఎగువున దాదాపు మరో 30 కిలోమీటర్ల దూరంలో సబరి, సీలేరు అనే ఉపనదులు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ నుంచి వచ్చి గోదావరిలో కలుస్తున్నాయి. ప్రతి ఏడాది జూలై నెల నుంచి అక్టోబర్‌ వరకూ నాలుగు నెలల పాటు గోదావరికి వరద ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని గోదావరి క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు పడినా.. పడకపోయినా ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాల వల్ల గోదావరికి వరద తప్పక వస్తుంది. నాలుగు నెలల వరద సీజన్‌లో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువన సముద్రంలోకి సరాసరి 2500 నుంచి 3000 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంపాలవుతాయి. ఇవన్నీ వృ«థాగా పోయేవే. ఈ నాలుగు నెలలు కాకుండా ఏడాదిలో మార్చి నుంచి జూన్‌ వరకు మూడు నెలల మినహా మిగతా సమయంలోనూ గోదావరిలో ప్రవాహం ఉంటుంది.

ధవళేశ్వరం ఎగువున 30 కిలోమీటర్ల దూరంలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. వరద సమయంలో కుడి, ఎడమ కాలువల ద్వారా సరాసరి నాలుగు నెలల కాలంలో మరో 150 టీఎంసీలు తరలించవచ్చు. వెరసి పోలవరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 350 టీఎంసీల జలాలను మాత్రమే వినియోగించుకోగలం. ప్రస్తుతం గోదావరి కుడి కాలువ సామర్థ్యం 17,633 క్యూసెక్కుల ఉండడం వల్ల రోజుకు ఒకటిన్నర టీఎంసీ నీటిని ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్లవచ్చు. గోదావరిలో వరద సీజన్‌ ఉండే నాలుగు నెలల కాలం.. అంటే 120 రోజులు వరద నిలకడగా ఉండదు. జూలైలో స్వల్పంగా ప్రారంభమై పెరుగతూ.. అక్టోబర్‌ నాటికి తిరిగి తగ్గుముఖం పడుతంది. కాబట్టి సరాసరి 80 టీఎంసీల నీటిని కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించవచ్చు. మరో 70 టీఎంసీలు ఎడమ కాలువ ద్వారా తరలించవచ్చు. కుడికాలువపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం 80 టీఎంసీల సామర్థ్యంతోనే ఏర్పాటు చేశారు. గోదావరి వరద సమయంలోనే ఇది పని చేస్తుంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుడికాలువ సామర్థ్యం 50 వేల క్యూసెక్కులకు పెంపు వల్ల.. కాలువ నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తీసుకెళ్లవచ్చు. గోదావరిలో వరద సీజన్‌ ఉండే నాలుగు నెలల్లో దాదాపు 480 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి గోదావరి నీటిని తరలించవచ్చు. కానీ నాలుగునెలల్లో వరద ఒకేలా ఉండదు కాబట్టి సరాసరి 300 టీఎంసీలు తీసుకెళ్లవచ్చనే అంచనాలు ఏపీ ప్రభుత్వం వేస్తోంది. అదే సంఖ్య తెలంగాణ తన ఫిర్యాదులో కూడా పేర్కొంది.

ఇక ప్రాజెక్టు దిగువను ఉన్న ధవళేశ్వర్యం బ్యారేజీ ద్వారా నీటిని మళ్లీంచి ఉభయ గోదావరి జిల్లాలోని 11 లక్షల ఎకరాల వరి, దాదాపు రెండు లక్షల ఎకరాల కొబ్బరి పంటతోపాటు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న చేపలు, రొయ్యల చెరువులు, తాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ సాగే ఖరీఫ్‌లో పైన పేర్కొన్న అన్ని అవసరాలకు గాను ధవళేశ్వర్యం బ్యారేజీ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు 125 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. ఇక డిసెంబర్‌ నుంచి మార్చి వరకు కొనసాగే రబీ సీజన్‌లో 90 టీఎంసీలు అవసరమవుతాయి. అయితే ఈ సమయంలో గోదావరిలో వరద పూర్తి కాలం ఉండదు. రబీ సీజన్‌ చివరలో సహజ జలాల రాక పూర్తిగా మందగిస్తాయి. రబీ పంట చివరి దశ అంటే.. మార్చిలో పూర్తిగా ఆగిపోతాయి. డెల్టా చివరి ఆయకట్టులో ఏప్రిల్‌ మధ్య వరకూ పంట ఉంటుంది. ఈ సమయంలో పంటకు, తాగునీటి అవసరాలను సీలేరు నది తీరుస్తుంది. సీలేరులో విద్యుత్‌ ఉత్పత్తి తర్వాత దిగువకు విడుదలయ్యే జలాలే ఉభయగోదావరి జిల్లాల్లోని రబీ పంటను కాపాడుతోంది. అదే పోలవరం పూర్తయితే రబీ పంటకు నీటి కొరత ఉండదు.

మొత్తం మీద ఏపీ వినియోగించుకునే గోదావరి జలాలను లెక్కిస్తే.. పోలవరం పూర్తయితే 350 టీఎంసీలు, ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పంటలకు ఉపయోగిస్తున్న 215 టీఎంసీలు.. వెరసి 565 టీఎంసీల జలాలను మాత్రమే ఏపీ వినియోగించుకోగలదు. ఇక కుడికాలువ సామర్థ్యం పెంచితే మరో 220 టీఎంసీలు.. అంటే మొత్తం.. 785 టీఎంసీల నీటిని వినియోగించుకుంటుంది. అయితే నాలుగు నెలల సీజన్‌లోనే సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలు సరాసరి 3 వేల టీఎంసీలు. పదేళ్ల సరాసరి లెక్కిస్తే దాదాపు 2500 టీఎంసీలు. పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంచిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తయిన పిదప ఏపీ వాడుకునే జలాలు మొత్తం 785 టీఎంసీలు.. ఇవి పోను ఇంకా సరాసరి 2 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి.

తెలంగాణకు దిగువున ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఎంత వాడుకున్నా ఆ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదన్న విషయం సాధారణ వ్యక్తులకు కూడా అర్థం అవుతుంది. మరి అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ ఉన్నతాధికారి మురళీధర్‌ రావు పోలవరం కుడికాలువ పెంపు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని ఏ ప్రాదిపదికన ఫిర్యాదు చేస్తారు..? ఆ ఫిర్యాదులో అసలు అర్థం ఉందా..? ఇక్కడ విశ్లేషించిన గణాంకాలు సదరు ఉన్నతాధికారికి తెలియని కావు. అయినా ఫిర్యాదు చేశారంటే.. వారి లక్ష్యం మరేదో ఉంది..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి