iDreamPost

సెక్రటేరియట్ అక్కడేనా ?? ప్రభుత్వం ఓకే చెప్పడమే తరువాయా !!

సెక్రటేరియట్ అక్కడేనా ?? ప్రభుత్వం ఓకే చెప్పడమే తరువాయా !!

ఉగాదికల్లా పరిపాలనా రాజధాని ఇంకా ముఖ్య కార్యాలయాలను విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారగణం కదులుతోంది. విశాఖలోని పలు భవనాలను పరిశీలిస్తూ వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దాన్ని అంచనావేస్తున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖ కలెక్టర్ తో పలుమార్లు చర్చించారు. గతంలో బీచ్ రోడ్లోని మిలినియం టవర్స్ లో సచివాలయం, సీఎం ఆఫీసు ఏర్పాటు చేయాలని భావించినా కొన్ని కారణాలవల్ల అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు వేరే భవనాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా మూసివేతకు సిద్ధంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజి ని తీసుకుని దాన్ని సచివాలయంగా మారిస్తే బాగుంటుందని భావించిన అధికారులు ఈ భవనాలను పరిశీలించారు. విశాఖ నుంచి 20 కి.మీ. దూరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో ఉన్న కౌశిక్ ఇంజినీరింగ్ కాలేజి భవనాన్ని ఇప్పటికే అధికారులు పరిశీలించారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్ కు చెందిన కౌశిక్‌ ఇంజనీరింగ్‌ కాలేజి 30 ఎకరాల్లో ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పేరుకుపోవడం, ప్లేస్‌మెంట్స్‌ ఆధారంగా విద్యార్థులు కా లేజీలను ఎంపిక చేసుకోవడంతో అడ్మిషన్లు బాగా తగ్గిపోయి నాలుగేళ్ల క్రితమే కౌశిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మూతపడింది.

రాజధాని భవనాల కోసం ఉన్నతాధికారులు ఓపక్క అన్వేషిస్తుండగా.. విద్యా సంస్థల అధిపతి కూడా అయిన మంత్రి అవంతికి.. ఖాళీగా ఉన్న కౌశిక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ భవనాలను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే కృష్ణప్రసాద్‌తో మాట్లాడి, భవనాలన్నీ పరిశీలించారు. అనంతరం విజయసాయిరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతంసవాంగ్‌ ఇటీవల విశాఖ వచ్చి వీటిని పరిశీలించారు. విశాలమైన ప్రాంగణం ఉండడంతో పార్కింగ్‌ కు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఓకే చేసేస్తే సచివాలయంగా దీన్ని ఖరారు చేయొచ్చని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి