iDreamPost

రామానాయుడు స్టూడియో కథ ముగిసినట్టేనా ??

రామానాయుడు స్టూడియో కథ ముగిసినట్టేనా ??

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నిర్మాత, మూవీ మొఘల్ గా పేరుగాంచిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు తెలుగుతోపాటు అనేక భాషలో చిత్రాలు నిర్మించి అత్యధిక చిత్రాలు నిర్మించిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నారు. ఆయన రామానాయుడు స్టూడియోస్ పేరుతొ రెండు ఫిలిం ప్రొడక్షన్ స్టూడియోలను కూడా నిర్మించాడు. అందులో ఒకటి ఫిలిం నగర్ లో ఉండగా మరొకటి మణికొండ సమీపంలోని నానక్ రామ్ గుడాలో వుంది.

తెలుగుచిత్ర పరిశ్రమని మద్రాస్ నుండి హైద్రాబాద్ కు తీసుకురావడానికి 1975 ప్రాంతంలో గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ స్టూడియోలు నిర్మించుకోవడానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులకు రాయితీ మీద చాలా తక్కువ రేటుకే ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. ఆవిధంగా మొదట అక్కినేని నాగేశ్వరావు కు చెందిన అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం మొదలుపెట్టగా, ఆ వెంటనే సినీ హీరో కృష్ణ కూడా పద్మాలయా స్టూడియోని నిర్మించాడు. ఆ కోవలోనే ఎన్టీఆర్ రామకృష్ణా స్టూడియోని నిర్మించారు. వీరి తరువాత 1984 ప్రాంతంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు కూడా తన పేరు మీదే స్టూడియోని నిర్మించడానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందాడు. అప్పటి ప్రభుత్వం ఆయనకీ ఫిలిం నగర్ లో షుమారు 6 ఎకరాల విలువైన భూమిని తక్కువ ధరకే కేటాయించింది. మొదట అక్కడ స్టూడియో నిర్మాణం ప్రారంభించిన రామానాయుడు, కొంతకాలం తర్వాత ప్రభుత్వ సహకారంతో నానక్ రామ్ గుడాలో కూడా ఏడున్నర ఎకరాల భూమిని పొందాడు.

ఆ భూమిని చదును చేసి అక్కడ కూడా రామానాయుడు తనపేరు మీదే రెండవ ఫిలిం స్టూడియోని నిర్మించారు. ఈ స్టూడియోలో చిన్న పెద్దా అని తేడా లేకుండా ఇప్పటివరకు కొన్ని వందల సినిమాలను రూపొందించారు. ఇటీవల విడుదలైన చిరంజీవి 150 వ చిత్రంలో కొంతభాగం చిత్రీకరణ కూడా ఈ స్టూడియోలోనే జరుపుకుంది. ఇటీవలకాలంలో ఇక్కడ ఎక్కువగా టీవీలో ప్రసారమౌతున్న “ఢీ” లాంటి కార్యక్రమాలతో పాటు కొన్ని టివి సీరియల్స్ ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల చిత్రీకరణకు వేదికమైన నానకరాం గూడా రామానాయుడు స్టూడియో ఇకపై ఉండదని, ఇప్పుడు దీనిపై సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్టూడియో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఈ స్టూడియో స్థలాన్ని ఫ్లాట్స్ గా విభజించి, రియల్ ఏస్టేట్ బిజినెస్ చేసే మీనాక్షి కనస్ట్రక్షన్ అనే ప్రయివేట్ సంస్థ కు డెవలప్మెంట్ కి ఇచ్చారని తెలుస్తుంది. ఈ వార్తలపై సురేష్ బాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

అప్పట్లో గత ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సినీ ప్రముఖులకు నామామాత్రపు ధరలకే విలువైన స్థలాలు ఇచ్చాయి. ప్రపంచీకరణలో భాగంగా హైదరాబాద్ నగరం బాగా విస్తరించడంతో స్టూడియో నిర్మించిన ప్రాంతాల్లోని చుట్టుపక్కల స్థలాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఈ రియల్ ఎస్టేట్ భూమ్ ని క్యాష్ చేసుకోవడానికి ఆయా స్టూడియోల యజమానులు అన్నపూర్ణ స్టూడియోలో కొంత భాగం, పద్మాలయ స్టూడియో, ఎన్టీఆర్ స్టూడియోలను రియాల ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. కాగా ఇప్పుడు రామానాయుడు స్టూడియోని కూడా రియల్ ఎస్టేట్ డవలప్మెంట్ కు ఇస్తున్నట్టు వార్తలు రావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి