iDreamPost

జనసేన, బిజెపి విడిపోయినట్లేనా ? కలవటానికి ఇష్టపడని నేతలు

జనసేన, బిజెపి విడిపోయినట్లేనా ? కలవటానికి ఇష్టపడని నేతలు

ఏ విషయంలో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేసింది పెద్దగా లేదు. రెండు పార్టీలో పొత్తులు పెట్టుకున్నట్లు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా రెండు పార్టీలు కలిసి చేసిందే లేదు. పైగా ఏ పార్టీకాపార్టీనే కార్యక్రమాలను విడివిడిగా చేసుకుంటున్నాయి. ఇక తాజాగా కమలనాధుల వ్యవహారం చూస్తుంటే జనసేనతో దూరమైపోయినట్లేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు బహిరంగంగా మద్దతు పలికారు. ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా జగన్ కు మద్దతు ఇవ్వాలంటూ పిలుపిచ్చారు. అయితే ప్రతిపక్షాలు ఇంత వరకు ఈ విషయంలో నోరు మెదపలేదు. సరే తెలుగుదేశంపార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్ సంగతి పక్కన పెట్టినా మిత్రపక్షం జనసేన కూడా బిజెపికి ఎందుకు మద్దతుగా మాట్లాడలేదు ?

ప్రతిపక్షాల్లో చాలా పార్టీలు బిజెపి చెబితే వినే పరిస్ధితుల్లో లేవని అనుకుందాం. మరి మిత్రపక్షమైన జనసేన కూడా కమలం పార్టీకి మద్దతుగా ఎందుకు నిలబడటం లేదు. పైగా ఇంతటి కీలకమైన విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సంప్రదించకుండానే బిజెపి జగన్ కు మద్దతు పలికినట్లే ఉంది. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో డ్రామాలు మొదలుపెట్టాడు. ఈ విషయంలో పవన్ కూడా చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లే అనుమానంగా ఉంది. దాంతో మిత్రపక్షాల దారులు వేరయిపోయాయా అనే ప్రచారం మొదలైపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీలు కలిసి పనిచేయటం నిజానికి రెండు పార్టీల్లోని చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే పవన్ ఎంతసేపు బిజెపిలోని అగ్ర నేతలతోనే టచ్ లో ఉంటున్నాడు కానీ రాష్ట్రంలోని నేతలను లెక్క చేయటం లేదు. పొత్తులు ఖరారు కాగానే అమరావతి నుండి విజయవాడకు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఆ తర్వాత ఆ ర్యాలీ రద్దయ్యింది. కేంద్ర నేతలతో మాట్లాడేసుకుని పవన్ ర్యాలీని డిసైడ్ చేశాడని తేలింది. దాంతో రాష్ట్రంలోని నేతలకు మండిపోయి ర్యాలీని రద్దు చేయించారు.

ప్రతి విషయాన్ని ఢిల్లీ నేతలతో పవన్ మాట్లాడుతుండటాన్ని రాష్ట్రంలోని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో పవన్ ఇంకా చంద్రబాబు జేబులోని మనిషే అనే అనుమానాలు పోలేదు. దాంతో బిజెపిలోని మెజారిటి నేతలు పవన్ తో కలవటానికి ఇష్టపడటం లేదు. మొత్తం మీద రెండు పార్టీలు పేరుకే మిత్రపక్షాలుగా అర్ధమైపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి