iDreamPost

మంత్రులు ఎలా మాట్లాడాలో మీరే నిర్ణయిస్తారా.. రామకృష్ణా..?

మంత్రులు ఎలా మాట్లాడాలో మీరే నిర్ణయిస్తారా.. రామకృష్ణా..?

న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా.. రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొనడం వింతగా ఉందని అధికారపార్టీ నేతలు అంటున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాస్తూ మంత్రుల మాటతీరును తప్పుపట్టారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉంటాం అని రాష్ట్రమంత్రులు స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం సరికాదని,  ఏపీ హైకోర్టు తీర్పును గౌరవించాలని సూచించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటనచేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్ర అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించాలని లేఖలో రామకృష్ణ కోరారు.

వారి వ్యాఖ్యల్లో తప్పేముంది?

అభివృద్ధి వికేంద్రీకరణ కోసం తమ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించిందని, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని మంత్రులు వ్యాఖ్యానిస్తే తప్పెలా అవుతుంది అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ విధానాన్ని గుర్తు చేయడానికి మంత్రులు ఆ విధంగా మాట్లాడితే న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టినట్టు ఎలా అవుతుందో రామకృష్ణ చెప్పాలని అడుగుతున్నారు. మంత్రులకు హైకోర్టు తీర్పుపై మాట్లాడే స్వేచ్ఛ ఉండదా? అసలు అలా మాట్లాడడమే న్యాయవ్యవస్థతో కయ్యానికి కాలు దువ్వినట్టు అవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం అధికార, అభివృద్ధి కేంద్రీకరణకు అనుగుణంగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సవరించడానికి సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా అప్పీల్‌కు వెళ్లాలా? మూడు రాజధానుల ఏర్పాటుపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై యోచిస్తున్నారు. అలా కాదు హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించి తీరాలి అనడం ఏ విధంగా సబబు? అమరావతికి శాసన రాజధాని సరిపోదు, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఇక్కడే ఉండాలి అని కోరుతున్న టీడీపీ నాయకుల మాదిరిగానే రామకృష్ణ కూడా డిమాండ్‌ చేయడంలో అర్థం ఏమిటి?

భిన్నాభిప్రాయాలపై చర్చ జరగాలి కదా..

అమరావతి రాజధానికి సంబంధించి ఇచ్చిన తీర్పు సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర జాబితాలోని అంశంపై అసెంబ్లీ ‍చట్టం చేయడానికి వీల్లేదు అన్నదానిపై చర్చ జరగాలని సీనియర్‌ శాసనసభ్యులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. తన ప్రాథమిక విధి అయిన చట్టాల రూపకల్పనను అసెంబ్లీ ఎలా వదులుకుంటుంది? అలా వదులుకొని తమను ఎన్నుకున్న ప్రజల ప్రయోజనాలను ఎలా విస్మరిస్తుంది? అన్న మౌలిక ప్రశ్నలపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు మంత్రులు ఈ అంశంపై మాట్లాడడమే తప్పంటే ఎలా? అని రామకృష్ణ వైఖరిని అధికార పార్టీ నేతలు తప్పు పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి