iDreamPost

పవన్‌ బీజేపీని వీడితే సమ సమాజం సాధ్యమవుతుందట..!

పవన్‌ బీజేపీని వీడితే సమ సమాజం సాధ్యమవుతుందట..!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో సమసమాజం ఏర్పడుతుందన్నంతగా సీపీఐ నాయకులు చేస్తున్న ప్రకటనలను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. బీజేపీ రోడ్డు మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నాను అన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా తప్పుపట్టారు. గురు, శుక్రవారాల్లో మీడియాతో మాట్లాడిన వీరు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీ ఆశీర్వాదంతో అధికారంలోకి రావాలని పవన్‌ కలులు కంటున్నారని, ఇలాంటి తింగరోళ్లను ఉపయోగించుకొనే నరేంద్రమోడీ ప్రధాని అయ్యారని నారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరడం పవన్ అమాయకత్వం అని రామకృష్ణ సూత్రీకరించారు. పవన్ సత్యాలు అర్థం చేసుకుంటారని, బీజేపీకి, జనసేనకు త్వరలో తెగతెంపులు జరగడం ఖాయమన్నారు. బీజేపీ, వైఎస్సార్‌ సీపీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పవన్  కలిసివస్తారని, అదే ప్రజలు కోరుకుంటున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

సీపీఐతో జత కడితే మేధావి కింద లెక్కా?

పవన్‌ కల్యాణ్‌కు తింగరోడు, అమాయకుడు అని బిరుదులు ఇస్తున్న సీపీఐ నేతలు.. ఆయన బీజేపీతో బంధం తెంచుకొని తమతో జతకట్టడం తెలివైన పనిగా చెబుతున్నారు. అంటే తమతో ఏ పార్టీ అయినా కలసి పనిచేయాలంటే సిద్ధాంతాలతో సంబంధంలేదని బీజేపీతో విభేదిస్తే చాలని సీపీఐ నేతలు చెప్పదలచుకున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే గతంలో కమ్యూనిజం లేదు.. ఏ ఇజం లేదు.. మిగిలింది టూరిజమే అంటూ కమ్యూనిస్టులను తీవ్రంగా అవమానించిన చంద్రబాబును సీపీఐ నేతలు అక్కున చేర్చుకుంటున్నారు. చంద్రబాబు అవినీతిపై, ఆశ్రిత పక్షపాతంపై అప్పటి వరకు పోరాడిన వీరు 2018లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక ఆయన వైపు చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయనను అధికారంలోకి తేవడం కోసం ఎర్రటి కలలు కంటున్నారు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

బీజేపీని వ్యతిరేకించడమే గీటురాయి అవుతుందా?

చంద్రబాబే కాదు గతంలో పవన్‌ కల్యాణ్‌ కూడా కమ్యూనిస్టులను అర్ధాంతరంగా వదిలేసి బీజేపీతో జతకట్టి ఒక విధంగా అవమానించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో జత కట్టిన పవన్‌ 2019 ఎన్నికల నాటికి ఆ రెండింటికీ కటీఫ్‌ చెప్పేసి కమ్యూనిస్టులు, బీఎస్‌పీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఈ కూటమి మొత్తం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. దీంతో వీరితో ప్రయాణం లాభసాటి కాదనుకున్నారో ఏమో ఈ కూటమికి పవన్‌ గుడ్‌బై చెప్పేశారు. సమీప భవిష్యత్తులో ఏ ఎన్నికలు లేకపోయినా బీజేపీతో హడావుడిగా పొత్తు పెట్టుకున్నారు. తమను ఈ విధంగా గతంలో అవమానించిన చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు తమతో కలసిరావాలని సీపీఐ నేతలు కోరుకుంటున్నారు.

కేవలం బీజేపీపై ఉన్న వ్యతిరేకత కారణంగా టీడీపీ, జనసేన తమతో కలసిరావాలని సీపీఐ నేతలు ఆశ పడుతున్నారు. అంతేతప్ప సిద్ధాంతాలు, నిబద్ధత, విధానాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్థమవుతోంది. అందుకే చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా అని పుస్తకాలు వేసిన విషయం, తాము స్వయంగా పవన్‌ కల్యాణ్‌ అమాయకుడు అని చెబుతున్న అంశం మరచిపోవడానికి సైతం సిద్ధపడుతున్నారా? అనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు సేవలో అలసి సొలసిన ఎర్రజెండా వెలసిపోయి పసుపు రంగులో కనిపిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికితోడు ‘పవన్‌ ఆలోచనలు.. రుతువుల్లా మారుతుంటాయి’ అని సీపీఐ నారాయణ స్వయంగా వ్యాఖ్యానించాక కూడా జనసేనతో పొత్తుకు పరితపించి పోతుండడం సమ సమాజ స్థాపనకేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి