iDreamPost

ఎన్నాళ్లు ఇలా కామ్రేడ్..?

ఎన్నాళ్లు ఇలా కామ్రేడ్..?

జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అబద్దాలు చెబుతున్నారని, ఆయన అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గతంలో చంద్రబాబును ఆ విధంగా డిమాండ్‌ చేశారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రామకృష్ణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం బాధిత కుటుంబాలను పరామర్శించి, పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా తాగి మృతిచెందింది ఐదుగురే అని సీఎం, మంత్రి అసెంబ్లీ ప్రకటించినా పట్టించుకోకుండా టీడీపీ మాదిరిగానే విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ చేస్తున్న విమర్శలనే రామకృష్ణ కూడా వల్లించడం గమనార్హం. మద్యం మృతుల సంఖ్యను రోజురోజుకు తన ఇష్టానుసారం పెంచేసి ప్రభుత్వంపై బురదజల్లుతున్న తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈయన కూడా మాట్లాడడమే కాక ఆ పార్టీ చేస్తున్న డిమాండ్లనే చేస్తుండడాన్ని ఏమనుకోవాలి?

ప్రభుత్వం అసెంబ్లీలో  చెప్పింది అబద్ధం అని నిరూపించే ఆధారాలు ఏమీలేకున్నా సీఎం క్షమాపణలు చెప్పాలని కోరుతున్న సీపీఐ నేత గతంలో ఇంతకంటే దారుణంగా వ్యవహరించిన అప్పటి ముఖ్యమంత్రిని క్షమాపణలు కోరారా? అని అధికారపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌ కోసం 29 మంది మృతి చెందినప్పుడు, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించినప్పుడు, పోలీసు కాల్పుల్లో విద్యుత్‌ ఉద్యమ కారులు, రైతులు అసువులు బాసినప్పుడు చంద్రబాబు క్షమాపణలను రామకృష్ట డిమాండ్‌ చేశారా? అని అడుగుతున్నారు.

బాబులో దార్శనికుడు కనిపించారా?

అమూల్ కంపెనీ ఏజెంట్‌గా సీఎం జగన్ పనిచేస్తున్నారని విమర్శిస్తున్న రామకృష్ణ గతంలో చంద్రబాబు ప్రభుత్వ డెయిరీలను పథకం ప్రకారం ధ్వంసం చేసినప్పుడు ఆయనలో దార్శనికుడిని చూశారా? తన సొంత డెయిరీ హెరిటేజ్‌ను, తన అనుయాయులకు చెందిన ఇతర డెయిరీలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ డెయిరీలను నాశనం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు? ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన సంగతి రామకృష్ణకు తెలియదా? చంద్రబాబు చేసిన తప్పులను సవరించి పాడి రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే రామకృష్ణకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? అమూల్‌ రాకతో హెరిటేజ్‌ దెబ్బతింటుందని చంద్రబాబు, లోకేశ్‌ బాధపడితే అర్థం చేసుకోవచ్చు కానీ ఈయన బాధను ఎలా అర్థం చేసుకోవాలి.

మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి సీఎం తన బ్రాండ్ల ద్వారా ఇప్పటివరకు 10 వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు చేస్తున్న రామకృష్ణ అందుకు ఆధారాలు చూపగలరా? ముఖ్యమంత్రే స్వయంగా మద్యం వ్యాపారం చేస్తున్నారని అనడమే కాక కల్తీ మద్యాన్ని ఆయన స్వయంగా తాగిస్తున్నారు అన్నట్టు మాట్లాడడం సమంజసమేనా? ఊరూవాడా బెల్ట్‌షాపులు పెట్టి చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. 13 వేల బెల్ట్‌షాపులను రద్దు చేసి మద్యం అమ్మకాలను తగ్గించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సీఎం మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆరోపించడం ఏమిటి? అని రామకృష్ణను అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి