iDreamPost

అక్రమ నిర్మాణాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడా ? అందుకేనా గోల చేస్తున్నది

అక్రమ నిర్మాణాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడా ? అందుకేనా గోల చేస్తున్నది

’ప్రజావేదికను కూల్చడమంటే ప్రజల ఆకాంక్షలను నేల రాయటమే, ప్రజాస్వామ్యాన్ని కాలరాయటమే’ ఇది చంద్రబాబునాయుడు తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు. కరకట్టపై చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక అన్నది అక్రమ నిర్మాణం అన్న విషయం అందరికీ తెలిసిందే. వైసిపి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్మాణాన్ని కూల్చేశాడు. దాంతో అప్పట్లో చంద్రబాబు అండ్ కో ఎంత గోల చేశారో అందరూ చూసిందే. అక్రమనిర్మాణమైన ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది అయ్యిందన్న కారణంతో గురువారం కరకట్టపై టిడిపి నేతలు పెద్ద డ్రామా చేయటమే విచిత్రంగా ఉంది.

చంద్రబాబు, టిడిపి నేతల హై డ్రామాలు చూస్తుంటే జగన్ కూల్చివేసింది ఏదో చారిత్రాత్మక కట్టడమన్నంతగా గోల చేస్తున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే ’విధ్వంసానికి ఏడాది’ అంటూ చంద్రబాబు కామెంటును ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించటం. తన హయంలో ప్రజాసమస్యలపై జనాల నుండి వినతులను స్వీకరించేందుకు, అన్నీ వర్గాల సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ ప్రజావేదికగా విలసిల్లిందని చంద్రబాబు ట్విట్టర్లో చెప్పటం కూడా అబద్ధమే.

టిడిపి అధికారంలో ఉన్నం వరకు అసలు కరకట్టపైకి పార్టీ నేతల్లో కూడా అందరినీ రానిచ్చేవారు కాదు. అలాంటిది మామూలు జనాలతో ప్రజావేదికలో తాను భేటి అయ్యేవాడినంటూ చంద్రబాబు చెప్పటాన్ని ఎవరు నమ్మటం లేదు. తానుంటున్న అక్రమ నిర్మాణంతో పాటు ఈ ప్రజావేదికను కూడా చంద్రబాబు సొంతం చేసుకుందామని అనుకున్నట్లున్నాడు. తమ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకు కేటాయించాలని ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయటం ఇందులో భాగమే.

కాకపోతే చంద్రబాబు వినతిని జగన్ పట్టించుకోకుండా కూల్చివేయటంతోనే టిడిపి, ఎల్లోమీడియా గోల మొదలుపెట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండానే, నదీ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా తన సొంతానికి కట్టుకున్నదే ఈ ప్రజావేదిక. ప్రజావేదిక నిర్మాణానికి అప్పట్లోనే అధికారులు అభ్యంతరాలు చెప్పినా చంద్రబాబు వినిపించుకోకుండా నిర్మించేశాడు. సిఆర్డీఏ అనుమతి లేకపోయినా అప్పటి మంత్రి నారాయణ ఆదేశాలతోనే ప్రజావేదిక నిర్మాణం జరిగిపోయిందని వైసిపి నేతలు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

రూ. 8 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను చంద్రబాబు తన సొంత అవసరాలకు వాడుకోవాలని అనుకోవటమే తప్పు. పైగా అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత వైసిపి ప్రభుత్వం దాన్ని కూల్చేసినపుడు విజ్ఞత ఉన్నవాడైతే చంద్రబాబు మాట్లాడి ఉండకూడదు. ప్రజావేదిక తనకు కావాలని లేఖ రాయగానే ప్రభుత్వం ఇచ్చేస్తుందని చంద్రబాబు ఎలా అనుకున్నాడో ఆయనకే తెలియాలి. అన్నీ నిబంధనలను, నియమాలను, చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన ప్రజావేదిక కూల్చివేయటాన్ని చంద్రబాబు, టిడిపి నేతలు తప్పు పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు చేస్తున్న గోల చూస్తుంటే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి