iDreamPost

అప్పుడు పెద్దాయనను చంద్రబాబు గౌరవించారా అచ్చెన్నా?

అప్పుడు పెద్దాయనను చంద్రబాబు గౌరవించారా అచ్చెన్నా?

వయసును కూడా గౌరవించకుండా రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను అవమానించారని సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించిన తీరును అధికార పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి సోమవారం గవర్నర్ ప్రసంగించిన సందర్భంగా టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును సీఎం జగన్‌ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. దానికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెద్దాయన కాదా..? ఆయన వయసెంత..? చంద్రబాబును వైఎస్సార్‌ సీపీ నేతలు సభలో అవమానించలేదా?’ అని ప్రశ్నించారు. మేం గవర్నర్‌ను కాదు.. ఆయన తప్పిదాలనే ఎండగట్టాం అని అచ్చెన్న తమ చర్యను సమర్థించుకున్నారు.

ఎన్టీఆర్‌ను అవమానించిన సంగతి మరచిపోయారా..

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పెద్దాయన ఎన్టీఆర్‌ను 72 ఏళ్ల వయసులో ఆ పార్టీ సభ్యులే అసెంబ్లీలో అవమానించిన విషయం అచ్చెన్న మరచిపోయారా? అని వైఎస్సార్‌ సీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నా వాదన వినిపించడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడిన ఎన్టీఆర్‌ విజ్ఞప్తిని మన్నించకుండా అవమానించలేదా? అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్‌ కంటతడి పెట్టినప్పుడు, వైస్రాయ్‌ హోటల్‌ ముందు ఆయనపై చెప్పులు వేయించినప్పుడు పెద్దాయన అన్న సంగతి తెలియలేదా? అని అడుగుతున్నారు. పిల్లనిచ్చిన మామ తండ్రితో సమానం అన్న సంగతి కూడా మరచి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్‌ వయసులో పెద్ద అన్న విషయం గుర్తుకురాలేదా? ముందుస్తు వ్యూహంతో గవర్నర్‌ను కావాలని అవమానపరచి, దానికి చంద్రబాబుకు ఏదో జరిగిపోయిందంటూ లింకుపెట్టి మాట్లాడడం రాజకీయం కాదా? అని అధికార పార్టీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

బాబువి సానుభూతి పొందే యత్నాలు

చంద్రబాబుకు సభలో అవమానం జరిగిందని పదే పదే చెప్పడం ద్వారా టీడీపీ నేతలు అది నిజం అని నమ్మించాలని చూస్తున్నారు. అసలు చంద్రబాబును, గాని ఆయన సతీమణిని కాని అసెంబ్లీలో అవమానించినట్టు ఎక్కడా రికార్డులలో లేదు. అయినా తనకు అసెంబ్లీలో అవమానం జరిగింది. మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతా అంటూ చంద్రబాబు శపథం చేసి బయటకు వచ్చేశారు. మీడియా సాక్షిగా వెక్కి వెక్కి ఏడ్చేశారు. తాము చంద్రబాబును అవమానించలేదని ఎమ్మెల్యేలు పదే పదే చెబుతున్నా పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు అదే వల్లె వేస్తుండడం సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రయత్నం అని అధికార పార్టీ సభ్యులు ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీ నేతలు ఆడే ఇలాంటి డ్రామాలను జనం పట్టించుకోవడం లేదన్న సంగతి గ్రహించాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి