iDreamPost

ఆ విమానాన్ని కూల్చివేసింది మేమే – ఇరాన్

ఆ విమానాన్ని కూల్చివేసింది మేమే – ఇరాన్

అనుమానమే నిజమైంది. పొరపాటున ప్రయాణికులతో బయల్దేరిన ఉక్రెయిన్ విమానాన్ని తామే కూల్చివేసినట్లు ఇరాన్ అంగీకరించింది.

మూడు రోజుల క్రితం టెహ్రాన్ లో ఇమామ్ ఖొమైని విమానాశ్రయం నుండి 176 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో బయలుదేరిన ఉక్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో విమానంలో ఉన్న 176 మంది ప్రయాణీకులు సిబ్బందితో సహా మృతి చెందారు.

దీనిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ విమానాన్ని కూల్చివేసి ఉండొచ్చని అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శత్రు విమానంగా భావించి బోయింగ్ 737 విమానాన్ని కూల్చివేసి ఉండొచ్చని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. కానీ ఇరాన్ దీనికి అంగీకరించలేదు. సాంకేతిక కారణాల కారణంగానే విమానం కూలిపోయిందని విమాన ప్రమాదంపై వివరణ ఇచ్చింది.

విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో 62 మంది కెనడా పౌరులు ఉండటంతో కెనడా ఈ ప్రమాదంపై తమకు అనుమానాలున్నాయని ఇరాన్ ప్రభుత్వమే క్షిపణి సహాయంతో కూల్చివేసిందని తమకు రహస్య సమాచారం అందిందని తెలిపింది. దానికి తోడు విచారణ కోసం బ్లాక్ బాక్సులను ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇరాన్ ప్రభుత్వం నిరాకరించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

 కాగా అంతర్జాతీయంగా ఒత్తిడి ఎక్కువ కావడంతో తామే ఉక్రెయిన్ విమానాన్ని కూల్చి వేశామని తాజాగా ఇరాన్ దేశం అంగీకరించింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వివరణ ఇచ్చింది. శత్రు విమానంగా భావించి కూల్చివేశామని ఇరాన్ దేశం తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పొరపాటున బోయింగ్ 737 విమానాన్ని కూల్చివేశామని తెలిపింది.  ఇది విషాదకరమైన రోజు. అమెరికా సాహసోపేత చర్యల వల్ల తలెత్తిన సంక్షోభంలో మానవ తప్పిదం వల్ల ఈ విపత్తు సంభవించిందని.. మా సైన్యం జరిపిన అంతర్గత విచారణలో ప్రాథమికంగా తేలింది. ఇందుకు పశ్చాత్తాపపడుతున్నాం. బాధితుల కుటుంబాలు, వారి దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం’ అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌​ జరీఫ్‌ ట్వీట్‌ చేశారు.

ఇరాన్ చేసిన ఈ తప్పిదం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి