iDreamPost

యోగాయ”నమో”హ – యోగాపై నరేంద్ర మోడీ ముద్ర

యోగాయ”నమో”హ – యోగాపై నరేంద్ర మోడీ ముద్ర

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశం మొత్తమే కాదు.. ప్రపంచమే నడుం వంచుతుంది. ఆరోగ్యం పొందుతుంది. ఈ వేడుక వెనుక మన ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉంది. యోగా అనేది ఎంతో ప్రాచీన కళ అయినప్పటికీ… అంతర్జాతీయంగా ఓ దినోత్సవంగా జరుపుకోవడానికి మన ప్రధానే కారణం. మోడీ ప్రధాని అయ్యాక.. యోగా మరింత ప్రాచుర్యం పొందింది అనడం అతిశయోక్తి కాదేమో..! 2014 సెప్టెంబర్ 21న ఐక్య రాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిపాదన తెచ్చింది మోడీయే. భారతదేశం చేసిన ఈ ప్రతిపాదనకు ఐక్య రాజ్య సమితి సానుకూలంగా స్పందించింది. అన్ని దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి యోగాపై ఓ తీర్మానం రూపొందించింది. 2014 డిసెంబర్ 11న ఐకాస సభ్య దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేసాయి. అమెరికా, చైనా దేశాలే కాదు.. దాదాపు 175 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతు పలికాయి. ఫలితంగా.. 2015 జూన్ 21 నుంచి యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో వేడుకలా జరుపుతున్నారు. దానికి కారణం మన భారత దేశం కావడం సదా గర్హనీయం. యోగా దినోత్సవానికి జూన్ 21 నే ఎంచుకోవడానికి కూడా ఓ కారణం ఉందని చెబుతారు. ఈ రోజు ఉత్తరార్త గోళంలో సుదీర్ఘ మైన రోజట. కెనడా, ఇరాన్ వంటి దేశాలు ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి పండగల జరుపుకుంటాయట. అంతే కాదు… పరమ శివుడు ఈరోజు మానవాళికి జ్ఞాన యోగాన్ని ఉపదేశించిన రోజుగా చాలా మంది భావిస్తారు.

ఏదేమైనా మనసుకు శాంతి.. వాక్కుకు యుక్తి.. మొత్తం మీద మనిషికి ప్రశాంతత చేకూర్చే శక్తి యోగాకు మాత్రమే ఉంది. 70 ఏళ్ల వయసులోనూ (సెప్టెంబర్ 2020 నాటికి) నరేంద్ర మోడీ చురుకైన, ఆరోగ్యవంతమైన జీవనానికి యోగాయే ప్రధాన కారణం అని ఆయనే చాలా సార్లు చెప్పారు. ఆయన యోగా ముద్ర కూడా అందరికీ పరిచయమే.

ఆయనే కాదు.. ఎంతో మంది ప్రముఖుల జీవన యానంలో యోగా ఓ భాగం.

యోగా…రోగ నిరోధక శక్తిని పెంచే ఓ అద్భుత సాధనం.

యోగా.. మనిషిని ఆరోగ్యంగా ఉంచే ఓ దివ్య ఔషధం.

యోగా.. పేదోడు కూడా పొందగలిగే ఐశ్వర్యం.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి సైతం యోగాతో చెక్ పెట్టవచ్చని ఎంతో మంది నిపుణులు అంటున్నారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యత తెలుసుకుందాం.. ఆచరిద్దాం..! యోగాయ నమః!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి