iDreamPost

నేడే ఇంటర్ రిజల్ట్స్.. తల్లిదండ్రులు ఈ విషయాలను తెలుసుకుని బిడ్డలను కాపాడుకోండి

  • Published Apr 12, 2024 | 9:02 AMUpdated Apr 12, 2024 | 9:02 AM

Inter Results 2024: పరీక్ష ఫలితాల వేళ విద్యార్థుల కన్నా తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. అయితే కన్నవారి ఆందోళన బిడ్డల్లో మరింత భయం పెంచుతుంది. అందుకే అలా చేయకుండా.. ఈ సూచనలు పాటించండి.

Inter Results 2024: పరీక్ష ఫలితాల వేళ విద్యార్థుల కన్నా తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. అయితే కన్నవారి ఆందోళన బిడ్డల్లో మరింత భయం పెంచుతుంది. అందుకే అలా చేయకుండా.. ఈ సూచనలు పాటించండి.

  • Published Apr 12, 2024 | 9:02 AMUpdated Apr 12, 2024 | 9:02 AM
నేడే ఇంటర్ రిజల్ట్స్.. తల్లిదండ్రులు ఈ విషయాలను తెలుసుకుని బిడ్డలను కాపాడుకోండి

చదువు అంటే.. అజ్ఞాన చీకట్లను తొలగించి.. మనల్ని వెలుగు వైపు నడిపే దీపం. చదువుకు అసలైన నిర్వచనం.. మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించి.. సమాజంలో విచక్షణతో మెలిగిలే చేసే సాధనం. మరి చదువుకు అసలైన కొలమానం ఏంటి అంటే.. ఈకాలం పిల్లలు, తల్లిదండ్రలు అయితే ర్యాంకులు, మార్కులు, గ్రేడ్ లు అంటారు. కానీ అవి కావు. సంస్కారం, పెద్దల పట్ల గౌరవంగా వ్యవహరించడం, సమాజం పట్ల బాధ్యతతో మెలగడం.. మంచి చెడుల తారతమ్యాలు తెలుసుకోవడంలో ఓ మనిషి స్థాయి ఎలా ఉంది అనేదే చదువుకు అసలు సిసలు కొలమానం.

అయితే దురదృష్టం ఏంటంటే నేటి కాలంలో పైవేటిని మనం పట్టించుకోవడం లేదు. మనిషి ఎదుగుదలకు అవసరమైన చదువును వదిలేసి.. మార్కుల వెంట పరుగులు తీస్తున్నాం.. బిడ్డలను కూడా అదే దిశలో తరుముతున్నాం. ఫలితంగా వారిలో సమస్యలను ఎదుర్కోనే ధైర్యం సన్నగిల్లుతోంది.. చెడు వైపు వెంటనే ఆకర్షితులవుతూ.. నేర ప్రవృత్తిని అలవర్చుకుంటున్నారు. ఇక పరీక్షలే పరమావధిగా.. చదువు రాకపోతే జీవితం నాశనం అయినట్లుగా.. ఫెయిల్ అవ్వడం మహాపాపంగా చూస్తున్నాం. తల్లిదండ్రులు కూడా సమాజం గురించి ఆలోచించి.. పిల్లలు చదువులో ఫెయిల్ అయితే పరువు తక్కువగా భావిస్తున్నారు.

తల్లిదండ్రులే అలా చేస్తే..

అక్కున చేర్చుకోవాల్సిన కన్నవాళ్లే ఇలా ఆలోచిస్తే.. ఇక పిల్లలకు ధైర్యం చెప్పి.. వెన్ను తట్టి ముందుకు నడిపేవారు ఎవరు.. అందుకే పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితమే లేదనుకుంటున్నారు.. దాంతో ఆత్మహత్యకు పాల్పడడం వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి కొన్ని గంటల్లో ఇంటర్ రిజల్ట్స్ రానున్నాయి. కనుక తల్లిదండ్రులు సంయమనంతో వ్యవహరించండి. ఈ జాగ్రత్తలు తీసుకుని.. మీ పిల్లల నిండు ప్రాణాలను కాపాడుకోండి.

ప్రతి ఏటా ఇంటర్, పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత.. విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు వెలుగులోకి వస్తుంటాయి. ఒకటి, రెండు సబ్జెక్ట్స్ లో తప్పినందుకు.. ఇక జీవితమే లేదనుకుని.. తల్లిదండ్రులు ఏమంటారో అనే భయంతో.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులు సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా పెరుగుతోంది. గతేడాది ఇంటర్ ఫలితాల తర్వాత తెలంగాణలో 8 మంది, ఏపీలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇది బయటకు వచ్చిన సమాచారం మాత్రమే. వెలుగులోకి రాని దారుణాలు ఎన్ని ఉన్నాయో. పరీక్ష తప్పితే.. ఇసారి మరింత కష్టపడి చదివి పాస్ అవ్వొచ్చు. కానీ జీవితాన్నే ముగిస్తే.. ఎలా. అందుకే రిజల్ట్స్ వేళ తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సూచనలు పాటించండి.

  • పరీక్షల్లో పాస్ కావాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. అందుకే కష్టపడి చదువుతాడు.
  • ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం తల్లిదండ్రులు వారికి అండగా ఉండండి.
  • ముందుగా వారిలో ధైర్యాన్ని నింపండి. వచ్చే ఏడాది కచ్చితంగా పాస్ అవుతారనే నమ్మకాన్ని కలిగించండి.
  • దాంతో పాటు ఈ ఏడాది వారు చేసిన లోపాలను సుతిమెత్తగా వారి మనసు నొచ్చుకోకుండా తెలియజేయండి.
  • మరోసారి వాటిని రిపీట్ చేయకుండా చూసుకుంటే ఈ సారి పాస్ అవ్వడం చాలా తేలిక అని చెప్పండి.
  • మార్కుల కన్నా పిల్లల భవిష్యత్తే మీకు ముఖ్యమని.. వారికి అర్థం అయ్యేలా చెప్పండి.
  • పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం బాధకరమైనే అంశమే అని చెబుతూ.. అందుకోసం దారుణ నిర్ణయాలు తీసుకోవద్దని సూచించండి.
  • చదువు కన్నా ముఖ్యం నడవడిక అని.. దాన్ని మాత్రం వదులుకోవద్దని చెప్పండి.
  • జీవితంలో వచ్చే ఆటుపోట్లతో పోలిస్తే ఈ కష్టం చాలా చిన్నదని.. దాన్నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోమనండి.
  • బంధువులు, స్నేహితుల ముందు మీ పిల్లల వల్ల పరువు పోయినట్లు మాట్లాడకండి.
  • నలుగురిలో మీ బిడ్డలను మీరే అవమానించకండి.
  • పిల్లలే లేకపోతే మీ పరువు దేనికి పనికి వస్తుందో ఆలోచించండి.
  • సమాజం అభిప్రాయాలను పిల్లల మీద రుద్దకండి. వారితో స్నేహితుల్లా మసులుకొండి. ఏం కాదని ధైర్యం చెప్పండి.
  • ఇంకా మీ పిల్లల్లో మార్పు రాకపోతే మానసిక నిపుణులను సంప్రదించండి.

చివరగా ఒక్క మాట పరీక్షల కన్నా మీ బిడ్డల జీవితాలు ఎంతో గొప్పవని గుర్తు పెట్టుకొండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి