iDreamPost

కరోనా నష్టం చైనా నుంచి వసూలు చేయండి.. ట్రంపు కు న్యాయవాది సూచన..

కరోనా నష్టం చైనా నుంచి వసూలు చేయండి.. ట్రంపు కు న్యాయవాది సూచన..

కరోనా వైరస్ వల్ల అమెరికాలో జరిగిన అన్ని రకాల నష్టాలకు చైనా నుంచి పరిహారం వసూలు చేయాలని భారత సంతతికి చెందిన ఓ న్యాయవాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సూచించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న సదరు న్యాయవాది ఈ మేరకు ట్రంప్ కు లేఖ రాశారు. చైనా లోని వూహాన్ నగరంలోని ఓ ల్యాబ్ లో కరోనా వైరస్ ను ఆ దేశం తయారు చేసిందని సదరు న్యాయవాది ఆరోపించారు. కరోనా వైరస్ ను చైనా ప్రపంచం మీదకి వదలడం వల్ల తీవ్రమైన ప్రాణ, ఆర్ధిక నష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిందన్నారు. అమెరికా లో చోటుచేసుకున్న ప్రాణ, ఆర్థిక నష్టాన్ని చైనా నుంచి తప్పకుండా వసూలు చేయాలని సదరు న్యాయవాది ట్రంప్ కు సూచించారు.

కొత్త ఏడాది ప్రారంభంలో చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ దేశానికే పరిమితం పరిమితమవుతుందని అనుకున్న కరోనా వైరస్ మెల్లమెల్లగా ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచంలోని దాదాపు 210 దేశాలు కరోనా వైరస్ ప్రభావానికి లోనయ్యాయి. ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలో ప్రతి దేశంలోనూ ప్రాణ, ఆర్ధిక నష్టం జరిగింది. పలు దేశాలు లాక్ డౌన్ విధించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయింది.

అగ్రరాజ్యం అమెరికాతో పాటు, అభివృద్ధి చెందిన యూరోప్ దేశాలు కరోనా వైరస్ ధాటికి గజగజలాడిపోతున్నాయి. ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసులు దాదాపు 21 లక్షలు నమోదు కాగా.. ఇందులో సగానికి పైగా అమెరికా, యూరప్ దేశాలలో నమోదు కావడం విశేషం. 1.34 లక్షల మరణాలు సంభవించగా, మెజారిటీ శాతం మరణాలు యూరప్, అమెరికా దేశాల్లోనే చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సదరు న్యాయవాది చైనా నుంచి పరిహారం వసూలు చేయాలని ట్రంప్ కు రాసిన లేఖ ప్రపంచ దృష్టి ని ఆకర్షిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన దేశాల నుంచి గెలిచిన దేశాలు పరిహారం వసూలు చేశాయి. ఆ కోవలోనే చైనా వైరస్ ద్వారా ప్రపంచం పై దాడి చేసినట్లుగా సదరు న్యాయవాది అభిప్రాయ పడుతున్నట్లుగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి