iDreamPost

మళ్లీ క్వారంటైన్‌.. ట్రేసింగ్‌.. టెస్ట్‌లు..!

మళ్లీ క్వారంటైన్‌.. ట్రేసింగ్‌.. టెస్ట్‌లు..!

యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్‌ దేశంలో వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడిప్పుడే విదేశాల నుంచి విమానాశ్రయాలకు చేరుకుంటున్న ప్రయాణికులు, ఇటీవల విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వేలాది మందిని క్వారంటైన్‌ చేయడం, వారికి టెస్టులు నిర్వహించడంపై దృష్టి సారించాయి. 30 రోజుల క్రితం వచ్చిన వారి కోసం ట్రేసింగ్‌ చేస్తున్నారు. పలు దేశాల నుంచి భారత వాణిజ్య రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళ, బుధవారాల్లో దాదాపు 1,688 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో 745 మందిని నగరంలోని పలు వైద్య కేంద్రాల్లో క్వారంటైన్‌ చేశారు. వీరంతా కనీసం వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అయితే వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా? అనే వివరాలను బ్రిహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారవర్గాలు వెల్లడించలేదు. గర్భిణులు, అంత్యక్రియలకు హాజరుకావాల్సి ఉన్న ఇద్దరికి మాత్రం క్వారంటైన్‌ నుంచి మినహాయింపు కల్పించారు.

మహారాష్ట్ర కీలక నిర్ణయాలు.

యూకే నుంచి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, ‘పాజిటివ్‌’ వచ్చిన వారంతా ప్రభుత్వం గుర్తించిన వైద్య కేంద్రాల్లో క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీచేసింది. నెగెటివ్‌ వచ్చిన వారు జిల్లా సర్వైలన్స్‌ అధికారి పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉండాలని నిర్దేశించింది. ఇక యూకే నుంచి నాలుగు వేర్వేరు విమానాల్లో ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుల్లో 11 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత రెండు వారాల్లో వివిధ దేశాల నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి దాదాపు 7వేల మంది వచ్చారని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. ఈ మధ్యకాలంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి, పరీక్షలు చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని ఆయన వెల్లడించారు. ఇటీవల యూకే నుంచి ఇండోర్‌కు వచ్చిన 33 మందిని 15 రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా నిర్దేశించామని మధ్యప్రదేశ్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు సహా మరిన్ని రాష్ట్రాల్లోనూ యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపారు.

కేంద్రం మార్గదర్శకాలు..

నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య యూకే నుంచి వచ్చిన వారందరికీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని, అందులో పాజిటివ్‌ వచ్చిన వారికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ నిర్ధారణకు టెస్టు చేయాలని రాష్ట్రాలకు జారీచేసిన మార్గదర్శకాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మళ్లీ మళ్లీ పరీక్షలు చేసినా ఆ ప్రయాణికుడిలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ జాడ కనిపిస్తే.. అతడిని ఇతర కరోనా రోగుల నుంచి వేరుచేసి చికిత్స అందించాలి. ఆ తర్వాత 14 రోజులకు అతడికి కరోనా టెస్టు నిర్వహించాలని కేంద్రం కోరింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు గత 14 రోజుల వ్యవధిలో ఎక్కడెక్కడికి వెళ్లి వచ్చారనే వివరాలతో పాటు కరోనా పరీక్షకు సమ్మతిస్తూ ‘ఎయిర్‌ సువిధ’ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపింది. నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్యకాలంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల వివరాలను బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ రాష్ట్రాలకు అందించనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి