iDreamPost

ఏప్రిల్‌ 14 వరకూ దేశం లాక్‌డౌన్‌.. కరోనాపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని మోదీ..

ఏప్రిల్‌ 14 వరకూ దేశం లాక్‌డౌన్‌.. కరోనాపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని మోదీ..

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సోషల్‌ డిస్టెన్స్‌ మాత్రమే మన ముందు ఉన్న మందు అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కొద్దిసేపటి క్రితం జాతినుద్ధేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ప్రజలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు దేశం లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

జనతా కర్ఫ్యూను మించి ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించాలని మోదీ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలే కరోనాను నియంత్రించలేకపోతున్నాయని చెప్పిన మోదీ.. ఆదిలోనే మన దేశంలో ఈ మహమ్మరిని అడ్డుకోకపోతే పరిస్థితి భయానకంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ప్రతి నగరం, ప్రతి పట్టనం, ప్రతి ఊరు లాక్‌డౌన్‌ అవ్వాలన్నారు. ఈ లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖన్నారు. 21 రోజులు నియంత్రణ పాటించకపోతే కరోనాను నియంత్రించలేమన్నారు.

ఏమి జరిగినా ఇంటి నుంచి బయటకు రాకూడదని ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లడమనేది ఈ 21 రోజులు మరిచిపోవాలని చెప్పారు. ప్రజలంతా ఇళ్లలో ఉండడమనే పని చేయాలని స్పష్టం చేశారు. ఇళ్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధమన్నారు. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణమని చెప్పారు. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని చెప్పారు. అప్పటి వరకూ ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని నొక్కి మరీ చెప్పారు. ఈ 21 రోజులు చాలా కీలమన్నారు. 

అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు కరోనాను కంట్రోల్‌ చేయలేకపోతున్నాయని మోదీ చెప్పారు. ఒక వ్యక్తి ద్వారా వేల మందికి కరోనా సోకుతుందని హెచ్చరించారు. అందుకే సోషల్‌ డిస్టెన్స్‌ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని విన్నవించారు. దేశ ప్రధానిగా తాను ఈ మాటలు చెప్పడంలేదని మీ కుటుంబ సభ్యుడిగా విన్నవిస్తున్నానని, ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

వైద్యుల సలహా లేకుండా కరోనాకు ఎలాంటి మందులు వాడొద్దని మోదీ విన్నవించారు. కరోనా నియంత్రణకు 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ద్వారా వైద్య సదుపాయాల్ని మెరుగుపరుస్తామని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి