iDreamPost

రాజ్ కోట్ లో భారత్ కు విజయం దక్కేనా?

రాజ్ కోట్ లో భారత్ కు విజయం దక్కేనా?

భారత్ ఆస్టేలియా వన్డే సిరీస్ ముందు రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా 2-1 తో వన్డే సిరీస్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. భారత జట్టు తాజా ఫార్మ్ దృష్టిలో పెట్టుకుని స్వదేశంలో భారత జట్టుకున్న రికార్డులను విజయాల శాతాన్ని పరిగణలోకి తీసుకుని రికీ పాంటింగ్ వ్యాఖ్యలను కొంతమంది కొట్టిపడేసారు.

కానీ ముంబై లో జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియా కొట్టిన దెబ్బకు భారత జట్టు కుదేలయ్యింది. ముఖ్యంగా భారత జట్టు బౌలింగ్ ని ఆస్ట్రేలియా ఓపెనర్లు చీల్చి చెండాడుతూ 255 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించడంతో భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్,రవీంద్ర జడేజా వారిపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దాంతో ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా భారత జట్టు మాత్రం తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కి రాకపోవడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. గతంలో కూడా 4 వ స్థానంలో అంతగా రాణించని కోహ్లీ, ఫార్మ్ లో ఉన్న రాహుల్ ని మూడో స్థానంలో ఆడించడం అంతగా సత్ఫలితాలు ఇవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా శిఖర్ ధావన్ గాయపడటంతో ఓపెనర్ గా జట్టులోకి వచ్చిన రాహుల్ విజయవంతం కావడంతో రాహుల్ ని పక్కనపెట్టలేని పరిస్థితి కలిగింది. దానికి తోడు శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి రావడంతో రాహుల్ ని ఏ స్థానంలో ఆడించాలన్న సందిగ్ధంలో భారత జట్టులో కలిగింది. దీంతో కోహ్లీ తన 3వ స్థానంలో రాహుల్ ని ప్రమోట్ చేసి 4 వ స్థానంలో బ్యాటింగ్ కి రావడంతో ఆ కూర్పు అంతగా విజయవంతం కాలేదు.

రాజ్ కోట్ లో జరిగే రెండో వన్డేలో కోహ్లీ తిరిగి మూడో స్థానంలో బ్యాటింగ్ కు రావడం దాదాపు ఖరారు అయ్యింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రావడం వల్ల భారత విజయావకాశాలు దెబ్బతిన్నాయని కోహ్లీ కూడా అంగీకరించాడు.తాజా పరాజయంతో జట్టులో చిన్న చిన్న మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రిషబ్ పంత్ ను జట్టునుండి తప్పించి పంత్ స్థానంలో రాహుల్ ను కీపర్ గా ఆడించే అవకాశాలు ఉన్నాయి. పంత్ బదులుగా కేదార్ జాదవ్ జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. జాదవ్ పార్ట్ టైం బౌలర్ గా కూడా ఉపయోగ పడతాడు కాబట్టి జాదవ్ జట్టులోకి రావడం వల్ల జట్టు మరింత బలోపేతం అవుతుందని కోహ్లీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే మొదటి వన్డేలో గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా ఓపెనర్లు భీకర ఫామ్ లో ఉండటం ఆస్ట్రేలియా జట్టుకి కలిసి వచ్చే అంశం. ఆ జట్టు బౌలింగ్ దళం కూడా భారత జట్టుపై ఒత్తిడి పెంచడంలో సఫలం అయ్యింది. దాంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. కాగా రోహిత్ శర్మ ఫామ్ ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వన్డేలో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆసీస్ భావిస్తుండగా, భారత్ మాత్రం విజయం సాధించి సిరీస్ ని సమం చేయాలని భావిస్తుంది.

కానీ రాజ్ కోట్ మైదానంలో భారత్ విజయాల కంటే ఓటమి చెందిన సందర్భాలే అధికంగా ఉన్నాయ్. ఏదేమైనా తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ గతంలో అనేకసార్లు మొదటి వన్డేలో ఓడిపోయి తిరిగి పుంజుకుని అనేక సిరీస్ లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ కోట్ లో జరగబోయే రెండో వన్డేలో కూడా ఆ విషయాన్ని పునరావృతం చేస్తుందేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి