iDreamPost

ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే పోటీలో ఓడిన నేతలు …

ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే పోటీలో ఓడిన నేతలు …

ఎన్నికల్లో గెలుపు ఓటములు సాధారణం…ఒకసారి గెలిచిన పార్టీ తుదుపరి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కటానికి కావలసిన సీట్లు కూడా సాధించలేకపోవటాన్నిగతంలో అనేకసార్లు చూశాం. అయితే తమ పార్టీ గెలుపు ఓటములకు అతీతంగా కొందరు నాయకులు మాత్రం అప్రతిహాతంగా గెలుస్తుంటారు. జీవితంలో ఒక్క ఓటమి ఎరుగని కరుణానిధి, వైస్సార్ లాంటి నేతలు ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోటీచేసిన స్థానంలో ఓడిపోయినవారు కూడా ఉన్నారు. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన జార్ఖండ్ లో బీజేపీ ఓడిపోయింది.ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ స్వయంగా ఓడిపోయాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎన్నికల్లో ఓడిపోయిన నేతల వివరాలు,

రఘుబర్ దాస్-జార్ఖండ్-2019

బీజేపీ నేత అయినా సరయు రాయ్, ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఒక్కప్పుడు సన్నిహితులు కానీ గత కొంతకాలముగా వారి మద్య విబేధాలు వచ్చాయి. జంషెడ్ పూర్ తూర్పు నియోజకవర్గం నుండి 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి చేసిన సరయూ రాయ్ గెలుపొంది రఘుబార్ దాస్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు.నిన్నటి శాసనసభ ఎన్నికల్లో బిజెపి సరయూ రాయ్ కు టికెట్ నిరాకరించి, ఆ స్థానం నుండి ముఖ్యమంత్రి పోటీ చేశారు.దీంతో సరయూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ పై పోటీ చేసి సుమారు 15000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.అవిభాజ బీహార్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా సరయూ రాయ్ ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో దాణా కుంభకోణం బయటపెట్టారు. మధు కోడా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 వేల కోట్ల ఖనిజ గనుల కేటాయింపు కుంభకోణాన్ని కూడా రాయ్ బయటపెట్టారు.జార్ఖండ్ లో బీజేపీ ఓటమికి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ వైఖరే ముఖ్యకారణమని ఫలితాలు వచ్చిన తరువాత బీజేపీ నేతలు కూడా నిందిస్తున్నారు.

సిద్ధరామయ్య-కర్ణాటక-2018

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓటమికి బీజేపీ,JDS రహస్య అవగాహనతో పనిచేశాయన్న విమర్శలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో సిద్దరామయ్య సొంత నియోజకవర్గం వరుణ ను కొడుకు వదిలి పక్క నియోజకవర్గం,గతంలో ప్రాతినిధ్యం వహించిన చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి JDS అభ్యర్ధీ GT దేవెగౌడ చేతిలో ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో సిద్దరామయ్య చాముందేశ్వరి తో పాటు బాదామి నుంచి కూడా పోటీచేశాడు. చాముందేశ్వరి లో ఓడిన సిద్దరామయ్య బాదామి నుండి గెలుపొందారు…

లాల్ తన్హావాలా-మిజోరాం-2018

2018 మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత అయిన మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హవ్ల ఛాంపాయి సౌత్,సెర్చిప్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. అందులో ఛాంపాయి సౌత్ నుండి లాల్ మీద పోటీచేసిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అభ్యర్థి టీజే లాల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు,సెర్చిప్ లో ఇండిపెండెంట్ చేతిలో పరాజయం ఘోర పరాజయం పొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలే గెలిచింది.

హరీష్ రావత్-ఉత్తరాఖండ్-2017

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న పలు అవినీతి ఆరోపణలు,వరదల సమయంలో వచ్చిన నిధుల విషయంలో అవినీతి ఆరోపణలు చేసిన ప్రతిపక్షాల నడుమ 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావత్ పోటీ చేసిన హరిద్వార్ రూరల్, కిచ్చ అసెంబ్లీ స్థానాల్లో ఘోర పరాజయాన్ని చవి చూసారు.. కిచ్చా అసెంబ్లీ స్థానం నుండీ 2127 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రాజేష్ శుక్లా,హరిద్వార్ రూరల్ నుండి బిజెపి అభ్యర్థి యతీశ్వరనాధ్ 12278 ఓట్లతో రావత్ మీద గెలుపొందారు.

లక్షికాంత్ పర్సేకర్-గోవా-2017

మనోహర్ పారికర్ కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్లడంతో సీఎంగా ఎన్నికైన పర్సేకర్ గోవా లో శాంతిభద్రతలు, డ్రగ్ మాఫియాను కట్టడి చేయడంలో విఫలం చెందడంతో ఆయన పోటీ చేసిన మొంద్రం అసెంబ్లీ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్ధి దయానంద సోప్టే 7119 మెజారిటీ తో గెలిచారు..

షీలా దీక్షిత్-ఢిల్లీ- 2013

ఢిల్లీ ముఖ్యమంత్రి గా పదిహేనేళ్లు పాలించిన షీలా దీక్షిత్ ,పదేళ్ల యుపిఏ పరిపాలన తో వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతతో పాటుగా ,అన్నా హజారే శిష్యుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ అవినీతినిర్మూలన నినాదంతో 2013 లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2013 ఎన్నికల్లో కేజ్రీవాల్ స్వయంగా షీలా దీక్షిత్ మీద పోటీచేసి గెలిచాడు. షీలా దీక్షిత్ కు ఢిల్లీ మధ్యతరగతి ప్రజలలో ఉన్న మంచి పేరు కూడా ఆవిడను గెలిపించలేకపోయింది. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ మీద వచ్చిన లక్షల కోట్ల స్కామ్స్ ముఖ్యముగా కామన్ వెల్త్ క్రీడల్లో వచ్చిన ఆరోపణలు ఢిల్లీలో కాంగ్రెస్ ను ,షీలా దీక్షిత్ ఓటమిపాలు చేశాయి.

శిబూ సొరేన్-జార్ఖండ్-2009

అనిశ్చిత రాజకీయాలకు చిరునామాగా ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే కానీ శిబూ సొరేన్ 2009 లో సీఎంగా పదవిని అధిష్టించాడు.ఆరు నెలల్లో ఎమ్మెల్యే గా ఎన్నిక కావాలన్న నిబంధమేరకు శిబూ సొరేన్ తమర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి ఎలాంటి రాజకీయ అనుభవం లేని జార్జాండ్ పార్టీకి చెందిన రాజా పీటర్ చేతిలో 9,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

J.H.పటేల్ -కర్ణాటక-1999

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న దేవగౌడ 1996లో ప్రధానిగా ఎన్నిక కావటంతో ఖాళీ అయినా ముఖ్యమంత్రి పదవి జనతాదళ్ సీనియర్ నాయకుడు అప్పటి ఉప ముఖ్యమంత్రి అయిన J.H.పటేల్ కు దక్కింది.

దేవెగౌడ కు రామకృష్ణ హెగ్డే కు వచ్చిన విబేధాలలో జనతాదళ్ నుంచి రామకృష్ణ హెగ్డే ను పార్టీ నుంచి బహిష్కరించారు.హెగ్డే శిష్యుడైన JH పటేల్ కు కూడా దేవెగౌడ వర్గం నుంచి అసమ్మతి ఎదురయ్యింది. చివరికి 1999 ఎన్నికలకు ఆరు నెలల ముందు JH పటేల్ జనతాదళ్ ను వీడిని రామకృష్ణ హెగ్డే ,శరద్ యాదవ్ తదితరులు కలిసి జనతాదళ్(U)ను ఏర్పాటు చేశారు. దేవేగౌడ నేతృత్వంలోని వర్గం జనతాదళ్(S) అయ్యింది.

1999 ఎన్నికల్లో JDU తరువున పోటీచేసిన J.H.పటేల్ మూడవ స్థానంలో నిలిచాడు. JDS అభ్యర్ధీ నాలుగవ స్థానంలో నిలువగా కాంగ్రెస్ రెబల్ గెలిచాడు,కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిచింది. కర్ణాటక రాజకీయాల్లో గొప్ప నాయకుడైన J.H.పటేల్ రాజకీయ జీవితం ఘోరమైన ఓటమితో ముగిసింది,ఆయన 2000 లో చనిపోయారు.

ఎన్టీ రామారావు -ఆంధ్రప్రదేశ్ – 1989

ఎన్టీ రామారావు ఐదేళ్ల పరిపాలనలో చోటు చేసుకున్న సంఘటనలు ముఖ్యంగా మంత్రివర్గ రద్దు తో టీడీపీలోని సీనియర్ నాయకులు పార్టీకి దూరం అయ్యారు. వంగవీటి రంగ హత్య ఎన్టీఆర్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది.

ప్రతి ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీచేసే అలవాటు ఉన్న ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి,అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీచేశాడు.కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్ధీ చిత్తరంజన్ దాస్ చేతిలో 3500 ఓట్ల స్వల్ప తేడాతో ఎన్టీఆర్ ఓడిపోయాడు.హిందుపూర్లో గెలవటంతో శాసనసభ కు ప్రాతినిధ్యం దక్కింది.

కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓటమికి పలు కారణాలు ఉన్నాయి.కల్వకుర్తి ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం కావటంతో స్థానికంగా పనిచేస్తున్న NGO ల ప్రభావం ఎక్కువ. అక్కడ పనిచేసిన ఒక NGO అనేకమందికి ఇల్లు కట్టించి ఇచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి కి టీడీపీ టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది కానీ స్థానిక సీనియర జనతాదళ్ నాయకుడు జైపాల్ రెడ్డి టీడీపీ మద్దతుతో మహబూబ్ నగర్ నుంచి లోక్ సభకు పోటీచేయటంతో ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తి బరిలోకి దిగాడు. అటు టీడీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత,గెలిచేస్తానన్న ధీమాతో ఎన్టీఆర్ దృష్టి పెట్టకపోవటం మరో వైపు ఎన్టీఆర్ మాజీ అల్లుడు రాజన్ ఎన్టీఆర్ కు ఓటమి రుచి చూపించాలని తన లిక్కర్ వ్యాపార సంబంధాలను బలంగా వాడటం,స్థానిక NGO వ్యతిరేకంగా పనిచేయటం … ఇలా అనేక కారణాలతో కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓడిపోయాడు.

త్రిభువన్ నారాయణ సింగ్-ఉత్తర్ ప్రదేశ్-1969

1969 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో వచ్చిన హంగ్ వలన అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడంతో చంద్రభాను గుప్తా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఏడు నెలలకి అక్టోబర్ 1970 లో,కాంగ్రెస్(ఓ) ,జనసంఘ్, స్వతంత్ర పార్టీ, చరణ్ సింగ్ ఆధ్వర్యంలోని భారతీయ క్రాంతిదళ్ పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో తమ కూటమి తరుపున కాంగ్రెస్ (ఓ) కు చెందిన టి.ఎన్.సింగ్‌ను ముఖ్యమంత్రిని చేశారు. 1969 చివరిలో గోరఖ్ పూర్ ఎంపీ గా ఉన్న దిగ్విజయ్ నాథ్ మరణించటంతో ఖాళీ అయినా లోక్ సభ స్థానానికి ఎమ్మెల్యే గా ఉన్న ఆయన శిష్యుడు అవైధ్యనాథ్ రాజీనామా చేశాడు .గోరఖ్ పూర్ లోక్ సభ, శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అవైధ్యనాథ్ లోక్ సభకు గెలువగా ఎమ్మెల్యే గా పోటీచేసిన ముఖ్యమంత్రి టి.ఎన్.సింగ్‌ ఓడిపోయాడు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఈ అవైధ్యనాథ్ శిష్యుడే…

భక్తవత్సలం – తమిళనాడు -1967

ఈయన తమిళనాడుకు చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. 1967 అసెంబ్లీ ఎన్నికలతో అప్పటి ముఖ్యమంత్రి భక్త వత్సలం డీఎంకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆ ఎన్నికల్లో డీఎంకే గెలిచి అన్నాదురైముఖ్యమంత్రి అయ్యారు. డీఎంకే ద్రావిడ ఉద్యమం,హిందీ భాషవ్యతిరేక ఉద్యమం తమిళనాడులో కాంగ్రెస్ ను రాజకీయంగా భూస్థాపితం చేశాయి. కామరాజ్ నాడార్ ప్రవేసబెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం కూడా కాంగ్రెస్ మరియు భక్తవత్సలం ఓటమికి ముఖ్యకారణాలు.

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అని అనుకున్నా సొంత నియోజకవర్గాలలో ఓడిపోవటం ఆ నాయకుల బలహీనతను సూచిస్తుంది. రాష్ట్రం మొత్తం కాకున్నా సొంత నియోజకవర్గ ప్రజలు కూడా ఆదరించటం లేదంటే ఆ నాయకులు తమ పనితీరును మార్చుకోవలసి అవసరం ఉందని అర్ధం.

సిద్దరామయ్య ఉదాహారణ తీసుకున్నా JDS,BJP లు ఉమ్మడిగా పోటీచేసిన గెలవవలసిన నేత .JDS ,BJP అవగాహన రాజకీయాల కన్నా కొడుకు కోసం సొంత సీటు వదిలి పక్క నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యటం,దక్షిణాన ఒకటి ఉత్తరాన ఒకటి అనంట్లు రెండు స్థానాలలో పోటీచేయ్యటంతో ఓటర్లు సిద్దరామయ్యను సీరియస్ గా తీసుకోలేదు. బాదామిలో సర్వశక్తులు వొడ్డి స్వల్ప మెజారిటీతో బయటపడ్డాడు. ఇంట గెలిచి బయట గెలవాలన్న నానుడి ఇలాంటి నాయకులకు సరిపోతుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి