iDreamPost

గుంటూరు సుభానీ హోటల్ 22 ఏళ్ల ప్రస్థానం

గుంటూరు  సుభానీ హోటల్ 22 ఏళ్ల ప్రస్థానం

గుంటూరు ఐటీసీ కంపెనీ ఎదురు హోటల్ సుభానీ యజమాని సుభానీ నిన్న సాయంత్రం అనారోగ్యంతో చనిపోయారు . గత ఐదు రోజుల నుండి జ్వరం , లివర్ ప్రాబ్లెమ్తో బాధపడుతున్న ఆయన ఏ కారణం చేతనో వైద్య సహాయం తీసుకోకుండా ఇంటి వద్దే ఉన్నారని 24 వ తారీఖు హాస్పిటల్ లో చేరగా నిన్న 25 న సాయంత్రం ఐదు గంటలకు చనిపోయారని తెలుస్తుంది .

బిర్యానీ , నాన్ వెజ్ ప్రియులు రాష్ట్రంలో ఏ మూలనున్న వారైనా గుంటూరు వస్తుంటే పని అయిపోయాక సుభానీ హోటల్ కి వెళ్ళాలి అని ముందే టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకొంటారంటే అతిశయోక్తి కాదు . ఇంత ప్లానింగ్ చేసుకొంటున్నారంటే ఏ రేర్ ఐటెం కోసమో అని తెలియనివారు అనుకోవచ్చు .

కిచిడీ , కెబాబ్ , చికెన్ ఫ్రై కోసం మాత్రమే .

ఇవాళ నాన్ వెజ్ హోటల్స్ పల్లెల్లో కూడా వెలిశాయి కానీ 2010 వరకూ నాన్ వెజ్ హోటల్లో తినాలంటే టౌన్ పోవాల్సిందే . రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి గుంటూరుకి మిర్చి , ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొని వచ్చే రైతులు తెల్లవారుజాము అన్లోడ్ సమయానికి గుంటూరుకి చేరుకొంటారు . అలా చేరుకొనే రైతులకు రొటీన్ టిఫిన్ బదులుగా తక్కువ ధరలో నాన్ వెజ్ అందిస్తే వ్యాపారం బాగా సాగుతుందనే లక్ష్యంతో గత నాలుగైదు దశాబ్దాల్లో గుంటూరు పట్టణంలో పలు కిచిడి హోటల్స్ వెలిశాయి . అలా 1998 లేదా 99 సంవత్సరం మిర్చి యార్డుకి దగ్గరలో సుభానీ చేత ప్రారంభించబడిందే
‘హోటల్ సుభానీ’ .

ప్రారంభంలో ఉదయం ఆరు గంటలకి ఐటీసీ ఎదురుగా ఒక చిన్న బండి మీద పెట్టి అమ్మేప్పుడు కిచిడి , కెబాబ్ ధర పది రూపాయలు . రెండేళ్ల తర్వాత అక్కడే ఉన్న చిన్న షాప్ అద్దెకి తీసుకొని అందులోకి వ్యాపారాన్ని మార్చిన సుభానీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు . రుచి బావుండడం , ధర తక్కువలో దొరకడంతో రైతులు , యార్డ్ కూలీలతో పాటు , గుంటూరు టౌన్ ప్రజలు , గుంటూరు వచ్చే ఇతర ప్రాంతాల వారు కూడా భారీగా రావడం మొదలైంది .

కాలక్రమంలో కిచిడి , కెబాబ్ తో పాటు పలు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అందించటం , కిచిడి , బిర్యానీ వంటివి స్వచ్ఛమైన నేతితో చేయడం , రుచి నాణ్యత విషయంలో రాజీ పడకపోవడంతో సుభానీ హోటల్ కి రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చింది . తనతో పాటు దాదాపు వంద మందికి ఉపాధి కల్పించిన సుభానీ సత్తెనపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేసి బంధువులకు కూడా వ్యాపార అవకాశాలు కల్పించాడు . గత నాలుగేళ్లలో బంధువులతో ఏర్పడ్డ వివాదాలతో వ్యాపారంలో కొన్ని చికాకులు అనుభవించినా బంధువులు ఏర్పాటు చేసిన హోటల్స్ కూడా ఇతని పేరు ఇమేజ్ తోనే నడవడం విశేషం .

కరోనా వైరస్ దేశంలో ప్రవేశించినప్పుడు ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన వారిలో తన సిబ్బంది ఉన్నారన్న వదంతుల్లో నిజానిజాలు ఎలా ఉన్నా , గత ఐదు రోజులుగా అనారోగ్యంతో ఉన్న సుభానీ క్వారంటయిన్ పట్ల అపోహలతోనో మరో భయం చేతో అనారోగ్యాన్ని బయటకు తెలియనీయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకొన్నాడని చెప్పొచ్చు . నిన్న సాయంత్రం మరణించాక ఆరోగ్య శాఖ సిబ్బంది కరోనా టెస్ట్ కోసం శాంపిల్ తీసుకున్నారని సమాచారం .

ఏదేమైనా తన పేరునే బ్రాండ్ గా మార్చుకొని రెండు దశాబ్దాల పాటు తిరుగులేకుండా ఫుడ్ హోటల్ రంగాన్ని ఏలి , పలువురికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఆకాలమరణం బాధాకరం . వ్యక్తిగా అతను నిన్న రోజు మరణించినా హోటల్ రంగంలో అతను వేసిన ముద్ర చెరగనిది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి