iDreamPost

ఏపీ కేబినెట్‌ భేటీకి ముందు కీలక పరిణామం

ఏపీ కేబినెట్‌ భేటీకి ముందు కీలక పరిణామం

రేపు శక్రవారం జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశానికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సమాగ్రభివృద్ధి, రాజధాని అంశాలపై రిటైర్డ ఐఏఎస్‌ జీఎన్‌ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై రేపు సీఎం జగన్‌ నేతృత్వంలోని మంత్రివర్గం చర్చించి, నిర్ణయం తీసుకోనుంది.

ఈ నేపధ్యంలో ఈ రోజు గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు సమావేశమయ్యారు. రాజధాని అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికను సమర్ధిస్తూ ఇరు జిల్లాల అధికార పార్టీ నేతలు తీర్మానించారు.

రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని, మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేలా రాజధానులను మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహఖ రాజధాని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా కర్నూలులో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు, సీఎం క్యాంపు ఆఫీసు, విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు, వేసవికాల అసెంబ్లీ సమావేశాలు, హైకోర్టు బెంచీ ఏర్పాటు చేయాలని తన నివేదికలో సూచించింది.

ఈ నివేదికపై రేపు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన చర్చించి, నిర్ణయం తీసుకోనుంది. కాగా, రాజధాని అమరావతిలోనే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఉంచాలని రాజధాని ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. గత తొమ్మిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశం, నిర్ణయాలపై రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి