iDreamPost

Hunt Review హంట్ రివ్యూ

Hunt Review హంట్ రివ్యూ

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ తనదైన కష్టంతో స్వంత ఉనికి కోసం సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు కొత్త మూవీ హంట్ ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. పెద్దగా అంచనాలు లేకపోయినా ట్రైలర్ వచ్చాక యాక్షన్ లవర్స్ కు దీని మీద ఆసక్తి కలిగింది. యూనిట్ డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇది మలయాళం ముంబై పోలీస్ కు రీమేక్ అన్న సంగతి ఆల్రెడీ జనానికి అర్థమైపోయింది. ప్రేమిస్తేతో ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్న భరత్ స్పైడర్ తర్వాత నటించిన స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ఇదే. మహేష్ దర్శకత్వం వహించిన ఈ కాప్ క్రైమ్ డ్రామా మెప్పించేలా ఉందో లేదో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

పోలీస్ ఆఫీసర్ ఆర్యన్(భరత్) ఒక పబ్లిక్ స్టేజి మీద హత్యకు గురవుతాడు. షాక్ గురైన ఇతని ప్రాణ స్నేహితుడు ఎసిపి అర్జున్(సుధీర్ బాబు) స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కేసును తవ్వేకొద్దీ నమ్మలేని నిజాలు బయట పడతాయి. అసలు హంతకుడు ఎవరో తెలుసుకున్నాక అర్జున్ ఒక పెద్ద ప్రమాదానికి గురై గతం అంతా మర్చిపోతాడు. దీంతో పై అధికారి మోహన్ (శ్రీకాంత్) సహాయంతో మళ్ళీ గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఎంత శోధించినా ఆర్యన్ ని మర్డర్ చేసింది ఎవరో అంతు చిక్కదు. ఇంతకీ ఈ ట్రయాంగిల్ ఖాకీ దుస్తుల వెనుక ఉన్న అసలు దోషి ఎవరు, క్లూలను ఛేదించి ఎలా వాడిని పట్టుకున్నారనేదే తెరమీద చూడాలి.

నటీనటులు

సుధీర్ బాబుకి మంచి పాత్రే దొరికింది. అర్జున్ గా డిఫరెంట్ షేడ్స్ ని డిమాండ్ చేసినప్పటికీ వీలైనంత బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. తనను బెస్ట్ యాక్టర్ అనలేం కానీ ఆ దిశగా పేరు తెచ్చుకునే క్రమంలోనే రిస్కీ అనిపించే ఇలాంటి సబ్జెక్టులను ఓకే చేస్తున్నాడు. ఇప్పటికీ సిక్స్ ప్యాక్ తో దేహ ధారుడ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించే సుధీర్ కు ఆ ఫిజిక్ భారీ యాక్షన్ సన్నివేశాలు లేకపోయినా ఉన్న కాసిన్ని ఫైట్లకు బాగానే ఉపయోగపడింది. ఎప్పుడో ప్రేమిస్తేలో చూసిన భరత్ ఇందులో ఆర్యన్ గా అంతగా నప్పలేదు. ఇంకేదైనా బెటర్ ఛాయస్ చూడాల్సింది. లుక్స్ బాగున్నాయి కానీ పాత్ర డిమాండ్ చేసినంత ఇంటెన్సిటీ తనలో లేదు

శ్రీకాంత్ డీసెంట్ గా చేసుకుంటూ పోయారు. హీరోతో సమానంగా జర్నీ చేసే క్యారెక్టర్ అయినా మరీ ఛాలెంజింగ్ గా అనిపించేంత లేదు. మంచి పర్ఫార్మర్ గా పేరున్న మౌనిక రెడ్డికి అర్జున్ టీమ్ లో పోలీస్ గా వేషం దక్కింది. ఉన్నవి కొన్ని సీన్లే అయినా ఆకట్టుకుంది. చిత్ర శుక్లాది పరిమితమైన రోల్. సుధీర్ కు అసలు జోడీనే లేదు. మీమ్ గోపి, గోపరాజు రమణ తదితర ఆర్టిస్టులకు పెద్దగా స్కోప్ దక్కలేదు. జిల్ లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ విలనీని పండించిన కబీర్ సింగ్ ని ఇందులో మరీ చిన్న క్యారెక్టర్ కు పరిమితం చేశారు

డైరెక్టర్ అండ్ టీమ్

రీమేకులు చేయడం సహజం. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్నో వచ్చాయి వస్తూనే ఉన్నాయి. 2013 మలయాళంలో వచ్చిన ముంబై పోలీస్ కేరళలో పెద్ద హిట్టు. పృథ్విరాజ్ సుకుమారన్ కు చాలా పేరు తీసుకొచ్చింది. అందులో ఉన్న విభిన్నమైన ట్విస్టు ఆడియన్స్ ఊహలకందని విధంగా సాగడంతో అక్కడి ప్రేక్షకులు ఘనవిజయం సమకూర్చారు. అది చూసే సుధీర్ బాబు దీని మీద మనసు పారేసుకున్నాడు కాబోలు. అయితే ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన మూవీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీయాలనుకోవమే అసలు రిస్క్. ఎంత సుధీర్ కు ఇమేజ్ తక్కువ అయినా ఎంపిక విషయంలో మన జనాలకు సెట్ కాని పాత్రలను ట్రై చేయకూడదు.

దర్శకుడు మహేష్ ఒరిజినల్ కు చాలా తక్కువ మార్పులు చేసి ఈ హంట్ ని రూపొందించాడు. ఒక హయ్యర్ పోలీస్ అఫీషియల్ చనిపోతే ఆ హంతకుడిని వెతకడమనే పాయింట్ మంచిదే. క్లైమాక్స్ వరకు అతను ఎవరనేది ఊహించలేనంత విభిన్నంగా కథనం ఉంటుంది. అయితే టెంపో లేకపోతే ఇలాంటి వాటిని కన్విన్సింగ్ గా చెప్పడం కష్టం. హంట్ లో వచ్చిన సమస్య ఇదే. నెరేషన్ స్లోగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు నయం. అక్కడా సీరియస్ మోడ్ లో నడుస్తున్నప్పుడు అవసరం లేకుండా వచ్చే ఐటెం సాంగ్ ఇబ్బంది పెట్టినా రెండో సగానికి కావలసిన ఇంటరెస్ట్ ని అంతో ఇంతో సెట్ చేసి పెడుతుంది. ఆ తర్వాతే ఉంది అసలు సమస్య

అర్జున్ చేసే ఇన్వెస్టిగేషన్ లో పెద్దగా డ్రామా ఉండదు. విచారణ చేసే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు, అనుమానంగా చూపించే వ్యక్తుల తాలూకు నేపధ్యాలు చాలా డెప్త్ తో ఉండాలి. కానీ వీటిలో చాలా మటుకు అసంపూర్ణంగా ఉంటాయి. ఉదాహరణలు మీమ్ గోపికి చాలా బిల్డప్ ఇచ్చి తనకేదో అసలు కథకు లింక్ ఉంటుందని భావిస్తాం. కానీ అదేమీ జరగదు. శ్రీకాంత్ మీద అనుమానం వచ్చేలా పెట్టిన కొన్ని సీన్లు పెద్దగా పండలేదు. ఇలాంటి బలహీనతల వల్ల సెకండ్ హాఫ్ లో ఇంపాక్ట్ తగ్గిపోయి ఎమోషన్ జీరోకు వెళ్ళిపోయి చివరి ఘట్టంలో ఇచ్చే షాక్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కానీ అక్కడ దాకా వెళ్లే క్రమం అతి మాములుగా ఉండటమే ఇబ్బంది.

హంట్ లో వచ్చే మలుపులు ఎగ్జైటింగ్ గా సాగకపోవడం మరో లోపం. ఏ ఫిలిం బై అరవింద్, రాక్షసుడు లాంటివి బాగా ఎంగేజ్ చేశాయంటే దానికి కారణం ఇంటెన్సిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండటం. హంట్ లోనూ అలాంటి ఛాన్స్ ఉండేది వాడుకుంటే. కానీ ముంబై పోలీస్ ని వీలైనంత మార్చకుండా ఉండాలనే ప్రయత్నంలో ఫస్ట్ సీన్ తో మొదలుపెట్టి చివరి దాకా పెద్దగా స్పెషల్ అనిపించేవి ఏమీ ఉండవు. పైగా కథనంలో ఉన్న నీరసం క్రమంలో ఆడియన్స్ కి పాకిపోయి ఇంకెప్పుడు అయిపోతుందాని ఎదురు చూసేలా చేసింది. అలా అని హంట్ కంప్లీట్ బ్యాడ్ మూవీ అని చెప్పడం కాదు ఉద్దేశం. దినుసులు అన్నీ ఉన్నా వండటం రాకపోతే రుచి రాదుగా.

ఇలాంటివి వస్తుండాలి కానీ మరికొంత హోమ్ వర్క్ జరగడం అవసరం. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో ఈ తరహా కంటెంట్లు బోలెడు వస్తున్నాయి. థియేటర్ దాకా వచ్చి టికెట్ కొనాలంటే పబ్లిక్ కి బలమైన కారణం కావాలి. అంతే తప్ప సుధీర్ బాబు ఉన్నాడనో లేక హైప్ వచ్చేలా ట్రైలర్ కట్ చేశారనో ఎగబడి రారు. టెక్నికల్ గా వీలైనంత క్వాలిటీ కోసం కష్టపడిన టీమ్ రైటింగ్ మీద కూడా ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే హంట్ గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మాట్లాడుకునే వాళ్ళు. కమర్షియల్ సినిమాలు ఎంత రాజ్యమేలినా ఇలాంటి డిఫరెంట్ జానర్స్ లో సరైన క్రియేటివిటీ వాడితే ఆదరణ తప్పకుండా జరుగుతుంది. లేకపోతే ఫలితం అటుఇటే

ఆడియన్స్ సెన్సిబిలిటీస్ ని దృష్టిలో పెట్టుకోవడం కూడా చాలా అవసరం. కేరళ వాళ్ళు ఆదరించారంటే వాళ్ళ అభిరుచులు మ్యాచురిటీ లెవెల్స్ కు తగ్గట్టు దర్శకుడు తీయడమే. కానీ మన ఆలోచనా ధోరణి వేరు.చుట్టూ ఉన్న పరిస్థితులు వేరు. వాటిని బేరీజు వేసుకుని ఇంత రిస్క్ పాయింట్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆదరిస్తారాని విశ్లేషణ చేసుకోవడం అవసరం. హీరో ఆడవేషం వేస్తేనే ఒప్పుకోని మనస్థత్వాల మధ్య లేనిపోని ప్రయోగాలు చేస్తే దాని ప్రభావం ఇమేజ్ మీద పడే ప్రమాదం లేకపోలేదు. సుధీర్ బాబు ఇలాంటి సాహసాలు చేయడం బాగుంది కానీ బాలీవుడ్ లోనో మలయాళంలో మాత్రమే యాక్సెప్ టెన్స్ ఉంటుందని గుర్తించాలి

సంగీత దర్శకుడు జిబ్రాన్ నేపధ్య సంగీతం కథలో మూడ్ కి తగ్గట్టు ఉంది. సూపర్ అనిపించుకోలేదు కానీ డాల్బీ సౌండ్ లో మంచి ఫీల్ కలగజేస్తుంది. ఐటెం సాంగ్ చూసేందుకు వినేందుకు రెండురకాలుగా బాగాలేదు. అరుళ్ విన్సెన్ట్ కెమెరా పనితనం మెచ్చుకునేలా ఉంది. భారీ యాక్షన్ మూవీ కాకపోయినా విజువల్స్ చక్కగా వచ్చేలా చూపించడం బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నిడివి రెండుంపావు గంటలలోపే కుదించింది. ల్యాగ్ స్టోరీ పరంగానే ఉంది కాబట్టి ఆ కోణంలో తన మీద కంప్లయింట్ చేయలేము. భవ్య ప్రొడక్షన్ వేల్యూస్ డీసెంట్ గా సాగాయి. అవసరం లేకపోయినా రిచ్ నెస్ కోసం ఎంచుకున్న ఫారిన్ లొకేషన్లు గ్రాండియర్ లుక్ తీసుకొచ్చాయి

ప్లస్ గా అనిపించేవి

క్లైమాక్స్ ట్విస్ట్
రెండు ఫైట్లు
కొంత డ్రామా

మైనస్ గా తోచేవి

జీరో ఎమోషన్స్
సెకండ్ హాఫ్
అందరికి ఆమోదయోగ్యం కానీ ప్లాట్
స్లో నెరేషన్

కంక్లూజన్

పోలీస్ విచారణ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్స్ హిందీ నుంచి తెలుగు దాకా బోలెడు వచ్చాయి. ఆ రకంగా కొత్తది ఏదైనా వస్తుందంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాం. క్లైమాక్స్ కోణంలో చూస్తే హంట్ లో ఎప్పుడూ చూడని ఊహించని ట్విస్టు ఉంది కానీ సినిమా మొత్తాన్ని మోయడానికి అదొక్కటి సరిపోలేదు. ఇలాంటివి ఎన్ని చూసినా మాకేం విసుగు రాదు అనుకునే వాళ్లకు హంట్ ఓకే కానీ సగటు రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం దీన్ని ఆమోదించడం కష్టమే. ముందే చెప్పినట్టు ప్రతి రీమేక్ ఒరిజినల్ ఫలితాన్ని ఇవ్వలేదు. కలర్ ఒకటే అనిపించినంత మాత్రాన టీ కాఫీలు రెండూ ఒకటే కాదు. రుచి అభిరుచిలో చాలా తేడా ఉంటుంది.

ఒక్క మాటలో – ఆగిన వేట

రేటింగ్ : 2.25/5

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి