iDreamPost

మానవ తప్పిదంతోనే ముంచుకొచ్చే ముప్పు!

మానవ తప్పిదంతోనే ముంచుకొచ్చే ముప్పు!

పుట్టుకకు రీజన్స్‌ దొరక్కపోయినా మానవాళికి ఒక విధమైన జాగ్రత్తను నేర్పించింది కోవిడ్‌ 19. తొలి విస్తృతిలోనే తన ధాటి ఎలా ఉంటుందన్నది చవిచూపించింది. తద్వారా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలన్నదానిపై కనువిప్పు కల్గించింది. అయితే అంటు వ్యాధులన్నింటిలోనూ సంభవించే వేవ్స్‌ ఈ వ్యాధికి కూడా ఉంటాయని నిపుణులు ఇప్పటికే ప్రకటించారు. రావడం – వ్యాపించడం – ఉధృతమవ్వడం – తగ్గడం.. ఇలా ఈ సైకిల్‌ తరచు ఏర్పడుతూనే ఉంటుందని వివరించారు.

వ్యాధి పూర్తిగా కనుమరుగు కావడం గానీ, ప్రజలు సామూహిక వ్యాధి నిరోధక శక్తిని పొందడం ద్వారాగానీ, లేదా టీకా ద్వారా మాత్రమే కోవిడ్‌ పాజిటివ్‌ను నిర్మూలించగలుగుతారని తేల్చేసారు. అయితే మొదటి రెండూ ఇప్పటికిప్పుడు సాధ్యం కావడం అసాధ్యంగా చెబుతున్నారు. ఇక మూడవదైనా టీకా ప్రయోగాలు ఆశావహంగానే ఉన్నాయి. పూర్తిస్థాయిలో సిద్ధమై ప్రజలందరికీ లభించేటప్పటికి సుమారు రెండేళ్ళు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన అన్ని టీకాలు అందుబాటులోకి వచ్చిన సమయంతో పోలిస్తే ఇదే అత్యంత తక్కువ సమయంగా చెబుతున్నారు.

అయితే ఈ క్రమంలో కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ విజృంభించడానికి మానవ తప్పిదమే ముప్పుగా మారుతుందన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాధి తగ్గిపోయింది, ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది, పెద్దగా ప్రమాదం లేదు, మరణాలు తక్కువగానే ఉంటున్నాయి.. వైరస్‌ బలహీన పడిపోయింది.. ఇలా ఎవరికి వాళ్ళు ఒక సిద్ధాంత పత్రాన్ని రాసేసుకుంటున్నారు. విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రపరచుకోవడం వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటిని పరిశీలించిన నిపుణులు సెకెండ్‌వేవ్‌ గనుక తీవ్రంగా మారితే దానికి కారణంగా కేవలం మానవ తప్పిదాలేనని తేల్చి చెప్పేస్తున్నారు. పరిశోధనల్లో సీసీయంబీకి ప్రపంచ వ్యాప్తంగానే మంచి పేరుంది. సదరు సీసీయంబీ శాస్త్రవేత్తలు సైతం కోవిడ్‌ను నిర్లక్ష్యంగా చూడొద్దని, అప్రమత్తంగా వ్యవహరించాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు కోవిడ్‌ పట్ల ఉన్నవి అన్నీ అంచనాలే. నిర్దారణల్లేవు. వ్యాప్తి, లక్షణాలు తదితర విషయాల్లో ఉన్నవన్నీ అంచనాలేనని చెప్పాలి. దాదాపు ఏడెనిమిది నెలలుగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ వైరస్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బైటపడుతూనే ఉంటున్నాయి. నిన్నమొన్నటి వరకు గుర్తించిన లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణలు (ఉదా జలుబు, జ్వరం, దగ్గుతో పాటు.. కడుపునొప్పి కూడా ఉంటుంది) నిపుణులు గుర్తిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు మనంగా ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసి ‘‘ఆ.. ఏం కాదులే’’ అనుకోవడానికి లేదన్నది వైద్యరంగ నిపుణులు చెబుతున్న మాట. వ్యాధి పట్ల అవగాహన పెంచుకోమంటే నిర్లక్ష్యం చేయడం తగదని, ఇలాగే వ్యవహరిస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి