iDreamPost

సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 14

సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 14

క‌థ‌ని ఎవ‌రి ద్వారా చెప్పినా అది హీరో క‌థే. అర‌వింద‌స‌మేత‌లో సునీల్ చెప్పినా, అత్తాంరింటికి దారేదిలో స‌మంత చెప్పినా అవి హీరోల క‌థలే. హీరోకి ప్ర‌ధాన క్వాలిటీ ఒక ల‌క్ష్యం. అదే క‌థ‌ని న‌డిపిస్తుంది. సినిమాలో మొద‌టి 20 నిమిషాల్లో హీరో త‌న ల‌క్ష్యం వైపు వెళ్లాలి. లేదంటే బోర్‌. కొన్ని సినిమాల్లో ఫ‌స్టాప్ అంతా హీరోయిన్ ల‌వ్‌ట్రాక్ , కామెడీ స్కిట్స్‌తో న‌డిచి ఇంట‌ర్వెల్‌లో సంఘ‌ర్ష‌ణ Start అవుతుంది. చెప్ప‌డానికి క‌థ లేన‌ప్పుడు సుత్తి ఎపిసోడ్‌లు స‌బ్‌ప్లాట్‌ల‌గా వ‌స్తాయి. అత్తాంరింటికి దారేదిలో కూడా బ్ర‌హ్మానందం స్కిట్ అన‌వ‌స‌ర‌మైన ల‌గేజి. పండింది కాబ‌ట్టి OK. ద‌ర్శ‌కుడు చెబుతున్న క‌థ‌కి, ఈ ఎపిసోడ్‌కి సంబంధం లేదు. క‌థ లేన‌ప్పుడు బ్ర‌హ్మానందాన్ని క‌వ‌చంగా వాడుకోవ‌డం శీను వైట్ల క‌నిపెట్టాడు. టీవీలో జ‌బ‌ర్ద‌స్త్ చూసిన త‌ర్వాత ఇప్పుడీ స్కిట్స్ వ‌ర్కౌట్ కాక సినిమాలు డ‌మాల్ అంటున్నాయి.

మెజార్టీ సినిమాల్లో హీరోకి రెండే ల‌క్ష్యాలు ఉంటాయి. 1.విల‌న్ ఆట క‌ట్టించ‌డం 2. హీరోయిన్ ప్రేమ‌ని పొంద‌డం. కొన్ని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోష‌న్స్ ల‌క్ష్యాలుగా ఉంటాయి. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తండ్రికి దూరం కాకుండా ఉండ‌డానికి హీరో ఒక రాత్రంతా ర‌క‌ర‌కాల రిస్క్ చేసి ప్ర‌యాణిస్తాడు. ఆ రాత్రి జ‌రిగే సంఘ‌ట‌న‌లన్నీ ఉప క‌థ‌లుగా (స‌బ్ ప్లాట్స్‌) వ‌స్తాయి. పాత సినిమాల్లో త‌ల్లికిచ్చిన మాట కోసం హీరో ల‌క్ష్యాన్ని సాధించేవాడు. ఈ మ‌ధ్య వ‌చ్చిన విన‌య విధేయ రామ‌లో అన్న కోసం త‌మ్ముడు ప్ర‌తీకారం. చిరంజీవి బిగ్‌బాస్ కూడా ఇదే. చెల్లెలి కోసం హీరో త్యాగం చేస్తే చిట్టి చెల్లెలు, ర‌క్త సంబంధం.

ఎక్స్‌ప్రెస్ రాజాలో హీరోయిన్ ప్రేమ కోసం హీరో జ‌ర్నీ. ఆ ల‌క్ష్యం దిశ‌గా హీరో వెళుతూ ఉంటే మ‌ధ్య‌లో వ‌చ్చే క‌థ‌ల‌న్నీ స‌బ్‌ప్లాట్స్‌. క‌థ‌లో ఒక ల‌క్ష్యం ఏర్ప‌డిన త‌ర్వాత హీరో క్యారెక్ట‌ర్‌లో మార్పులు ఏమిటి? మ‌ంచి వాడు చెడ్డ‌వాడిగా మారితే మ‌హేశ్‌బాబు “నిజం”. చెడ్డ‌వాడు మంచివాడుగా మారితే “అత‌డు”.

బ‌ల‌వంతుడు కూడా త‌ప్ప‌నిస‌రై బ‌ల‌హీనుడిగా న‌టిస్తే “బాషా”. బ‌ల‌హీనుడు బ‌ల‌వంతుడిగా మారితే “జ‌యం”. ల‌క్ష్యం దిశ‌గా హీరో వెళుతున్న‌ప్పుడు ఎన్ని ఉప‌క‌థ‌లు వ‌చ్చినా ప్ర‌ధాన క‌థ‌కి అడ్డంకిగా మార‌కూడ‌దు. అవి బ‌లం కావాలి కానీ, బ‌ల‌హీన‌త కాకూడదు. అయితే మ‌న‌కి కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ల‌వ్‌, కామెడీ ట్రాక్‌లు, పాట‌లు ఇవ‌న్నీ లేక‌పోతే మాస్ చూడ‌ర‌ని మ‌న న‌మ్మ‌కం. దృశ్యంలో ఇవేమీ లేవు. అయినా జ‌నం చూసారు. మ‌న ద‌గ్గ‌ర మెటీరియ‌ల్ లేక మాస్ నెత్తిన తోసేస్తాం.

స‌రిలేరు నీకెవ‌రులో విజ‌య‌శాంతి ఇంటికి హీరో వెళ్లి, ఆమెని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించ‌డం హీరో ల‌క్ష్యం. నేరుగా క‌థ‌లోకి వెళితే రెండున్న‌ర గంట‌లు న‌డిపే మ్యాట‌ర్ లేదు. అందుక‌ని ఇంట‌ర్వెల్ వ‌ర‌కూ రైలు కామెడీ, పాట‌లు న‌డుస్తూ ఉంటాయి. ఇంట‌ర్వెల్ త‌ర్వాత కూడా విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టింది. తురుంఖాన్‌లా బిల్డ‌ప్ ఇచ్చిన ప్ర‌కాష్‌రాజ్ క‌మెడియ‌న్‌లా మారిపోతాడు. క‌థ మీద శ్ర‌ద్ధ పెట్ట‌కపోతే అనిల్ రావిపూడి తొంద‌ర‌లోనే జూనియ‌ర్ శీను వైట్ల‌గా మారిపోతాడు.

మ‌న సినిమాల‌కి మూకీ సినిమాలు త‌ల్లి అయితే , నాట‌కాలు తండ్రిలాంటివి. ఎక్క‌డ డ్రామా ఉండాలో, ఎక్క‌డ నిశ్శ‌బ్దం ఉండాలో తెలియాలి. డైలాగ్‌లు సినిమాకి అనుకూల శ‌త్రువులు. సినిమా అంటే దృశ్య‌మే, Sound కాదు. స్క్రిప్ట్ అంటే కొన్ని కాగితాలు మాత్ర‌మే. పెద్ద బౌండ్‌ పుస్త‌కం కాదు.

ఎంతోకొంత నాట‌కీయ‌త లేకుండా క‌థ‌లుండ‌వు. సినిమా అంటే భ్రాంతితో కూడిన వాస్త‌వం. జీవిత‌మంతా చెప్ప‌లేం. ఏదో ఒక ముక్క‌తో మొద‌లు పెట్టాలి. భార‌తీయుడులో క‌మ‌ల‌హాస‌న్ అవినీతికి వ్య‌తిరేకి. కూతురి వైద్యం కోసం కూడా లంచం ఇవ్వడు. స్వాతంత్ర్య పోరాటం త‌ర్వాత ఆయ‌న ఒక ప‌ల్లెటూరులో వ్య‌వ‌సాయం చేసుకుంటూ ఉంటాడు. ఒక రైతు కూడా స‌మాజంలో భాగ‌మే క‌దా! పంట‌ని అమ్మాలంటే ద‌ళారులు ఉంటారు. ఏదో ఒక రూపంలో రెవెన్యూ వాళ్లు పీడిస్తారు. ఇన్నేళ్ల‌లో అవినీతి ఎదురే కాలేదా? ఆస్ప‌త్రిలోనే మొదటిసారా?

సినిమా కోసం కొన్ని skip అవుతాయి. ప్రేక్ష‌కుల‌కి ఈ అనుమానం వ‌చ్చినా రాక‌పోయినా ర‌చ‌యిత‌కి రావాలి (ఇప్పుడు మెజార్టీ ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లే అయినా షూటింగ్‌కి వెళ్లే వ‌ర‌కూ ద‌ర్శ‌కుడు ర‌చ‌యిత‌గానే ఉంటాడు). అన్ని ర‌కాలుగా ప్ర‌శ్నించుకుంటే tightగా స్క్రిప్ట్ వ‌స్తుంది. లేదంటే అతుకుల బొంతే.

సినిమా బావుండాలంటే 80% స్క్రిప్ట్‌, 20% అద్భుత న‌టులు. outputలో విష‌యం ఉంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , ఎడిటింగ్ సుల‌భ‌మ‌వుతుంది. లేదంటే AR రెహ‌మాన్ కూడా చేతులెత్తేస్తాడు.

హీరో ల‌క్ష్యాన్ని సాధించే దిశ‌గా జ‌ర్నీ చేస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల్ని ప్రేమ‌లో ప‌డేయాలి. హీరో గెలుపుని వాళ్లు own చేసుకోవాలి. ల‌గాన్‌లో క్రికెట్ ఆడింది , ఒక్క‌డులో క‌బ‌డ్డీ ఆడింది హీరోలు కాదు ప్రేక్ష‌కులే!

కానీ దుర‌దృష్టం ఏమంటే చాలా సినిమాలు హైవేలో Start అయి కంక‌ర రోడ్డు మీద తేలి మ‌న న‌డుములు విరగ్గొడతాయి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి