iDreamPost

తెలుగుదేశంలో చేరిన మొదటి ముగ్గురు శాసన సభ్యులు ఏమయ్యారు?

తెలుగుదేశంలో చేరిన మొదటి ముగ్గురు శాసన సభ్యులు ఏమయ్యారు?

స్వాతంత్రం అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో 38 ఏళ్ళ పాటు ఏకచక్రాదిపత్యంగా సాగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్థానానికి బ్రేకులు వేసి, ప్రాంతీయ పార్టీల ఒరవడికి నాంది పలికిన తెలుగుదేశం ఆనాడు ఒక సంచలనం. అప్పటికే 300 సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ తనకి 60 ఏళ్ళు నిండాయని కావలసిన పేరు డబ్బు సంపాదించాను కానీ ప్రజలకు ఏమీ చేయలేదని, ఇకపై ప్రజాహిత జీవితం గడపటానికి నిశ్చయించుకొన్నానని, ఇక నాలో ఒక కొత్త ఎన్.టి.ఆర్ ని చూడబోతున్నారని ప్రకటించిన మరుక్షణం అది ఒక సామాన్య వార్తే అయినా, నేడు ఆ ఘట్టాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రకు ఆరంభంగా చెప్పవచ్చు.

1982 మార్చ్ 21న ఎన్టీఆర్ తను కొత్త పార్టీ పెట్టబోతునట్టు ప్రకటించిన అనంతరం, రాజకీయల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులే జరిగాయి. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రులని తనకి నచ్చినప్పుడు మార్చడం , అస్తవ్యస్త పాలన , గ్రూపు రాజకీయాలతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టి పట్ల తీవ్ర అసహనం నెలకొని ఉంది . ఆనాటి కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాల గురించి చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ పార్టీ ప్రకటించడానికి ముందు రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ పూర్తి బలం ఉన్న వారి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చెయ్యటంతో కాంగ్రెస్ అభ్యర్ధీ ఎం.ఎం.హషీం ఓడిపోయారు,ముప్పై మంది సభ్యుల బలం కూడా లేని జనతా పార్టీ నేత బాబుల్ రెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచారు.

కాంగ్రెస్ పార్టీ గ్రూపులతో రాజకీయ అనిచ్చితి నెలకొని ఉండగా ఎన్టీఆర్ పార్టీ ప్రకటించడంతో నాలుగు శాసన సభ్యులు (ముగ్గురు కాంగ్రెస్,ఒకరి జనతా) రాజీనామా చేసి ఎన్.టి.ఆర్ మద్దతు పలికారు. టీడీపీకి మద్దతు పలికిన ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ జిల్లా చిన్నురు శాసన సభ్యులు సి. నారాయణ ,గుంటూరు జిల్లా మంగళగిరి శాసన సభ్యులు రత్తయ్య , విశాఖ జిల్లా పాయకరావు పేట శాశన సభ్యులు ఆదయ్య, నాదెండ్ల బాస్కర రావు ఉన్నారు. వీరిలో నాదెండ్ల తప్ప మిగిలిన వారి పేర్లు కూడా సామాన్యులకు కాక రాజకీయ పరిశీలకులకు కూడా గుర్తు ఉండి ఉండకపోవచ్చు. నేటికి తెలుగుదేశం తొలితరం నాయకులు అశోక్ గజపతిరాజు, బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, యనమల రామ కృష్ణుడు లాంటివారు అక్కడక్కడా కనిపిస్తున్నా మొదట ఎన్టీఆర్ కు మద్దతు పలికిన వారిలో ముగ్గురు మాత్రం పూర్తిగా కనుమరుగవ్వడం రాజకీయాలలో ఒక కేస్ స్టడీ.

Also Read: ఒక ప్రకటన – 38ఏళ్ళ రాజకీయ చరిత్రను మార్చింది.

టీడీపీకి మద్దతు పలికిన ఆ ముగ్గురు శాసన సభ్యుల్లో దళిత సభ్యులైన చెన్నూరు శాసన సభ్యులు సి.నారాయణ, పాయకారావు పేట శాసన సభ్యులైన మారుతి ఆదయ్యలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, లెజిస్లేచర్ జాబితా నుండి తమ పేర్లను తొలగించవలసిందిగా ఈ ఇద్దరు సభ్యులు ఆ నాడే పి.సి.సి అధ్యక్షుడు దాస్ కు లేఖ రాశారు. నాదెండ్ల భాస్కర్ రావు కూడా తన రాజీనామాను పీసీసీ కి పంపించారు. ఎన్నికలు మరో తొమ్మిది నెలలే ఉండటం మరో వైపు గ్రూప్ రాజకీయాలతో ఎవరు పార్టీలో ఉన్నారో ఎవరు పార్టీని వీడుతున్నారో పట్టించుకునే పరిస్థితి నాడు కాంగ్రెస్ పార్టీకి లేదు.

రాజీవ్ ప్రధాని అయినా తరువాత 1987లో పార్టీ ఫిరాయింపు చట్టం వచ్చింది. అంతకు పూర్వము పార్టీ ఫిరాయింపు మీద నికరమైన చర్యలు కూడా లేవు. కారణాలు ఏవైనా కావొచ్చు కానీ టీడీపీకి మద్దతు ఇచ్చిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒక్క నాదెండ్లకు తప్ప మిగిలిన ముగ్గురికి ఎన్టీఆర్ 1983 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. ఆ ముగ్గురు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవటం వలనే టికెట్ ఇవ్వలేదని దగ్గుబాటి తన పుస్తకంలో రాశారు. కానీ పైన చెప్పిన అంశాల వలన రాజీనామా కారణాన్ని పరిగణించలేము.

ఇక జీ.వి రత్తయ్య 1967నుండి మూడుసార్లు వరసగా గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నుండి శాసన సభ్యుడిగా గెలిచినా ఎన్టీఆర్ 1983లో టికెట్టు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ తరువాత రాజకీయంగా కనుమరుగయ్యారు. గడిచిన చంద్రబాబు పాలనలో రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల చెఱుకు పంటను దాని యజమానైన చంద్రశేఖరే తగలపెట్టుకున్నారని కేసు పెట్టి తెలుగుదేశం వేదించడం విదితమే, ఈ చంద్రశేఖర్ రత్తయ్య కుమారుడవడం విశేషం. తెలుగుదేశం కోసం నిలబడిన మొదటి వ్యక్తి కుమారుడికి తెలుగుదేశం పాలనలో దక్కిన గౌరవం పట్ల ఆ నాడు రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

1978లో విజయవాడ తూర్పు నుండి గెలిచిన నాదెండ్ళ బాస్కరరావు 1982లో ఎన్టీఆర్ పార్టీ ప్రకటించిన రోజు మార్చి 21 మధ్యాహ్నమే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేస్తునట్టు ప్రకటించారు . ఈ మేరకు లేఖను కూడా పి.సి.సి అధ్యక్షుడు దాస్ కు పంపినట్టు తెలిపారు 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి వేమూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రి భాద్యతలు చేపట్టారు , తరువాత ఎన్టీఆర్ తో విభేధించి పార్టిని చీల్చి ముఖ్యమంత్రి అవ్వడం ఆ తరువాత జరిగిన పరిణామాలతో తిరిగి కాంగ్రెస్ లో చేరి 1989 లో ఎమ్మెల్యేగా,1998 లో ఖమ్మం ఎంపీ గా గెలిచారు.

దగ్గుబాటి వేంకటేశ్వర రావు రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలో ఆదయ్య , నారయణ , రత్తయ్య కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేసినా అవి ఆమోదం పొందకపోవడంతో ఎన్టీఆర్ టికెట్టు నిరాకరించారని రాశారు. కానీ మరో పక్క నాదెండ్ల బాస్కర రావు కూడా రాజీనామా చేశారు కానీ వీరికి ఎన్టీఆర్ టికెట్టి ఇవ్వడం విశేషం. దీని మీద అప్పట్లోనే సామాజికవర్గ విమర్శలు వచ్చాయి.

ఇలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో టీడీపీకి దన్నుగా నిలిచి, ఒక చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన ఆ నలుగురు శాసన సభ్యుల్లో ముగ్గురు టికెట్టు నిరాకరణకు గురయ్యి 1983 ఎన్నికల తరువాత పూర్తిగా రాజకీయంగా కనుమరుగవ్వడం రాజకీయాల్లో ఒక పాఠం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి