iDreamPost

టాలీవుడ్ కు కరోనా నష్టమెంత ?

టాలీవుడ్ కు  కరోనా నష్టమెంత ?

ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూటింగులు, వేడుకలు ఆగిపోయి ఇళ్ళల్లో రెస్టు తీసుకుంటున్న హీరోలు, నిర్మాతలు ఈ బ్యాడ్ పీరియడ్ వల్ల కలిగే నష్టం లెక్క వేసుకోవడంలో కాలం గడుపుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ల టెన్షన్ల గురించి చెప్పనక్కర్లేదు. రిలీజులన్ని వాయిదా పడ్డాయి. అవతలేమో ఫైనాన్షియర్ల వద్ద తెచ్చిన అప్పుకు వడ్డీ బంగారం ధరలా అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఫలానా టైంకంతా సద్దుమణుగుతుందని కేంద్రం స్పష్టమైన ప్రకటన ఇస్తే హమ్మయ్య అని నిశ్చింతగా ఉండొచ్చు. కాని పరిస్థితి అలా లేదు.

ఇది ఇంకా ప్రారంభమేనని మోడీ చెప్పడం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ఒకపక్క ఆర్టిస్టుల కాల్ షీట్స్ అన్నీ వృధా అవుతున్నాయి. వాళ్ళు తర్వాత ఇస్తారు కాని చాలా విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. మరోవైపు డిస్ట్రిబ్యూషన్ చైన్లు కూడా మైంటైన్ చేస్తున్న బడా నిర్మాతలకు హైబిపి, లోబిపి అన్ని హోల్ సేల్ గా వచ్చేలా ఉంది. ఇది పైకి కనిపించినంత తేలిక విషయం కాదు. తారలు ఇంట్లో కూర్చుకుని చప్పట్లు, గంటలు కొట్టినంత ఈజీ మ్యాటరూ కాదు. సినిమా అంటేనే వ్యాపారం. వందల కోట్ల పెట్టుబడులు ఇందులో ముడిపడి ఉంటాయి. ఒక్క రోజు ఆలస్యానికి సైతం లక్షల మూల్యం చెల్లించే సందర్భాలు వస్తాయి.

అలాంటిది ఏకంగా ఇప్పుడు రెండు మూడు వారాలు అంటే చిన్న విషయం కాదు. ఇదంతా ఒక కోణం అయితే సినిమాను నమ్ముకుని నడిచే థియేటర్లు, వాటిలో పని చేసే స్టాఫ్, వాళ్ళకిచ్చే జీతాలు, స్టార్ హీరోల సినిమాల కోసం అప్పులు చేసి మరీ కట్టిన పంపిణిదారుల అడ్వాన్సులు, మూతబడిన కాలానికి సంబంధించిన నిర్వహణ నష్టం తదితరాలు లెక్కలు చాలా ఉన్నాయి. అనధికార లెక్కల ప్రకారం ఒక్క టాలీవుడ్ ఈ కరోనా దెబ్బ వల్ల సుదీర్ఘ కాలంలో సుమారు రెండు వందల కోట్లకు పైగా కోల్పోనుందని విశ్లేషకుల అంచనా. ఇది తక్కువా కావొచ్చు లేదా పెరగొచ్చు. కాని జరుగుతున్న పరిణామాలు మాత్రం పరిశ్రమ వర్గాలను భయందోళనలకు గురి చేస్తున్న మాట వాస్తవం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి