iDreamPost

భార్యను పొట్టనబెట్టుకున్నాడు.. కానీ వాషింగ్ మెషిన్ పట్టించింది

హత్య కేసుల్లో ఆధారాలు చాలా ముఖ్యం. అందుకే పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తుంటారు. తాజాగా ప్రభుత్వ అధికారిణి కేసులో కూడా కీలక పాత్ర పోషించింది వాషింగ్ మెషిన్. ఇంతకు ఏం అయ్యిందంటే..?

హత్య కేసుల్లో ఆధారాలు చాలా ముఖ్యం. అందుకే పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తుంటారు. తాజాగా ప్రభుత్వ అధికారిణి కేసులో కూడా కీలక పాత్ర పోషించింది వాషింగ్ మెషిన్. ఇంతకు ఏం అయ్యిందంటే..?

భార్యను పొట్టనబెట్టుకున్నాడు.. కానీ వాషింగ్ మెషిన్ పట్టించింది

ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి. సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా వ్యవహరిస్తోంది. భర్త ప్రాపర్టీ డీలర్. అన్యోన్యంగా సాగిపోతున్న కాపురంలో ఒక్కసారిగా కుదుపు. ఉన్న పళంగా భార్య అనారోగ్యానికి గురయ్యింది. ముక్కు, నోటి నుండి రక్తం వస్తుండటంతో కంగారు పడ్డ భర్త.. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆమె ప్రభుత్వ అధికారిణి కావడంతో పోలీసులు హై ప్రొఫైల్ కేసుగా తీసుకుని విచారణ చేపట్టారు. ఆమెకు కొన్ని రోజుల నుండి ఆరోగ్యం బాగోలేదని, ఆదివారం కూడా ఉపవాసం ఉందని, ఒక పండు తిని తర్వాత.. ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ భర్త చెప్పగా.. సహజ మరణం కింద కేసు నమోదు చేశారు.

అయితే దర్యాప్తులో భర్తే ఆమెను హత్య చేసి.. ఈ నాటకం ఆడినట్లు వెల్లడైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిండోరి జిల్లాలో నివసిస్తున్నారు భార్యా భర్తలు నిషా నపిత్ శర్మ, మనీష్ శర్మ. నిషా ఎస్‌డీఎంగా పనిచేస్తోంది. కాగా, మనీష్ కన్నా ఆమె ఐదేళ్లు పెద్దది. వీరికిది రెండో వివాహం అని తెలుస్తోంది. వివాహ పోర్టల్ ద్వారా పరిచయం ఏర్పడి.. 2020లో వివాహం చేసుకున్నారు. చేసుకున్న నాటి నుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిషా తన సర్వీస్, ఇన్సురెన్స్, బ్యాంకు రికార్డుల్లో మనీష్ పేరును నామినీగా చేర్చకపోవడంపై ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు భర్త.

ఆదివారం ఆమెను చంపి.. ఆరోగ్యం బాగోలేదంటూ డ్రామా షురూ చేశాడు. ముక్కు నుండి రక్తం కారుతుండటంతో ఆసుపత్రికి తీసుకు వచ్చానని, ఆమె గుండెపోటుతో మరణించిదంటూ కళ్లబొల్లి కబుర్లు చెప్పాడు. అయితే నిషా శరీరం నీలి రంగులోకి మారడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే కేసు నమోదు చేసి.. ఒక టీంగా ఏర్పడి పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అంతలో పోస్టు మార్టంలో నాలుగు-ఐదు గంటల క్రితమే నిషా చనిపోయిందని తేలడంతో.. భర్తపై అనుమానం వచ్చింది. వెంటనే ఇంటికి వెళ్లి తనిఖీలు చేయగా.. అసలు విషయం బయటకు వచ్చింది. వాషింగ్ మెషీన్‌లో దొరికిన బెడ్ షీట్, దిండు, నిషా బట్టలు కనిపించాయి.

దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం కక్కాడు. ఆమెను దిండుతో గొంతు అదిమి చంపానని,  వాటికి రక్తపు మరకలు అంటడంతో వాటిని వాషింగ్ మెషీన్లలో వేసి ఉతికేశానని చెప్పాడు. మనీష్ భార్య మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఆరు గంటల పాటు ఇంట్లనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. మనీష్ అరెస్టు చేసి ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. మర్డర్ మిస్టరీని 24 గంటల్లో చేధించినందుకు డీఐజీ.. పోలీస్ టీంకి రూ. 20 వేల రివార్డు ఇవ్వడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి