iDreamPost

అందరికీ ఇళ్లతో అరుదైన చరిత్రకు శ్రీకారం చుడుతున్న వైఎస్ జగన్

అందరికీ ఇళ్లతో అరుదైన చరిత్రకు శ్రీకారం చుడుతున్న వైఎస్ జగన్

అర్హులైన లబ్దిదారులందరికీ పథకాలు వర్తింపజేస్తామని చాలాకాలంగా, దాదాపు అందరు నేతలు చెప్పే మాట. అందరికీ ఇళ్లు అందిస్తామని కూడా ఎన్నో ఏళ్లుగా వింటున్న మాట. కానీ అది ఇన్నాళ్లకు ఆచరణ రూపం దాలుస్తుంది. అది కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చొరవతో ఓ అరుదైన చరిత్రకు శ్రీకారం పడుతుంది. ఇప్పటికే కోర్టుల ద్వారా వివిద ఆటంకాలు పెట్టినా అడుగు ముందుకేయాలనే సీఎం సంకల్పం ముందు అది అడ్డంకి కాలేదు. దాంతో తొలుత వివాదాలు లేని చోట ఇళ్ల స్థలాలు కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఈ ఏడాది ఉగాది నుంచి పలుమార్లు వాయిదా పడిన తర్వాత డిసెంబర్ 25 నుంచి వచ్చే ఏడాది జనవరి మొదటి వారం వరకూ ఊరూవాడా ఇళ్ల పండగ జరగబోతోంది.

‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్‌ 25న ఇళ్ల స్థలాలు పంపిణీ, అదే రోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 7 వరకూ కొనసాగనున్న కార్యక్రమంలో రాష్ట్రమంతా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేర్చే ప్రయత్నం జరగబోతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం జరుగుతుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ జరగబోతోంది. ఇది ఓ చరిత్రగా చెప్పాలి. గతంలో ఎన్నడూ ఊహించనంత అతి పెద్ద కార్యక్రమం. ఒకేసారి 30లక్షల మంది పేదలకు అంటే దాదాపుగా ఇల్లు లేని పేదలందరికీ స్థలాలు పంపిణీ చేయడం చారిత్రక ఘటనగా మారబోతోంది.

అందులో 3,65,987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇంటి స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ చేశారు. మొత్తంగా ప్రభుత్వం పంపిణీ చేయబోతున్న ఇళ్ళ స్థలాలు విలువ రూ.23,535 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అంటే ఒకే విడతలో పంపిణీ కాబోతున్న అతి పెద్ద ప్రయోజనం కాబోతోంది. వచ్చే మూడేళ్లకాలంలో మొత్తం ఇళ్లన్నీ నిర్మించి అప్పగించేందుకు ప్రణాళిక వేశారు.

కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం చెప్పడంతో లబ్దిదారులకు పూర్తి స్థాయిలో సంతృప్తికర అంశంగా చెప్పవచ్చు. లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇవ్వడం లేదా మెటీరియల్‌ ఇవ్వండి, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రెండూ కాకపోతే డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు అని సీఎం జగన్ తేల్చేశారు. దాంతో పెద్ద మొత్తంలో లబ్ది చేకూరడమే కాకుండా లబ్దిదారుల అభిప్రాయానికి అనుగుణంగా అమలు కావడం కూడా కీలకమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది.

నాణ్యత విషయంలో రాజీపడకుండా వ్యవహరించాలని సీఎం స్పష్టంచేశారు. అదే సమయంల తాము ఇళ్లు కట్టడం లేదని..కొత్తగా ఊళ్లు నిర్మిస్తున్నామని సీఎం చేసిన వ్యాఖ్య ఆసక్తిగా కనిపిస్తోంది. ఒకే గ్రామంలో వందల సంఖ్యలో లబ్దిదారులుండడంతో వారి ఇళ్లన్నీ నిర్మాణం పూర్తయితే కొత్త ఊళ్లు వెలుస్తాయనడంలో సందేహం లేదు. తద్వారా నవ్యాంధ్రలో బడుగులకు పూర్తిస్థాయి భరోసాగా ఈ కార్యక్రమం నిలవబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి