iDreamPost

హాస్టల్స్​లో ఉంటున్న వారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై మరింత పెరగనున్న ఫీజులు!

  • Author singhj Published - 09:29 AM, Mon - 31 July 23
  • Author singhj Published - 09:29 AM, Mon - 31 July 23
హాస్టల్స్​లో ఉంటున్న వారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై మరింత పెరగనున్న ఫీజులు!

హాస్టల్స్​లో ఉంటూ కాలేజీలకు వెళ్లేవారు, కోర్సులు నేర్చుకునేవారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి విద్యార్థులు, ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. హాస్టల్స్​లో ఉండే స్టూడెంట్స్, ఎంప్లాయీస్​కు ఇకపై అక్కడ వసతి భారం కావొచ్చు. హాస్టల్ వసతి, పేయింగ్ గెస్ట్​ల ద్వారా చెల్లించే ఫీజుల మీద ఇక నుంచి 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈ మేరకు జీఎస్టీ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్​) బెంచ్​లు రెండు వేర్వేరు కేసుల్లో తీర్పును వెలువరించాయి. నివాస గృహాల కిందకు హాస్టల్స్, డార్మిటరీలు రావని.. కాబట్టి వీటికి జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపూ ఉండదంటూ బెంగళూరు, లఖ్​నవూ బెంచ్​లు తాజాగా తమ తీర్పును వెలువరించాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన శ్రీసాయి లగ్జరీయిస్ స్టే ఎల్​ఎల్పీ సంస్థ చేసిన దరఖాస్తు మీద బెంగళూరు బెంచ్ తాజాగా తీర్పు ఇచ్చింది. నివాస గృహాల కిందకు హాస్టళ్లు రావని, వాటికి జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్లబ్బులు, హోటళ్లు, క్యాంప్​సెట్ల వసతికి గానూ రోజుకు రూ.1,000 లోగా అయితే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందని బెంగళూరు బెంచ్ గుర్తు చేసింది. ఇది జులై 17, 2022 నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపింది. అయితే ఇది పీజీ హాస్టళ్లకు మాత్రం వర్తించదని పేర్కొంది. నివాస గృహాన్ని నివాసం ఉండేందుకు కాకుండా అద్దె కోసం ఉపయోగిస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది.

బెంగళూరు బెంచ్ విచారించిన కేసులో దరఖాస్తుదారుడి (శ్రీ సాయి హాస్టల్) సేవలు జీఎస్టీ విధించదగినవి. కాబట్టి భూ యజమానులకు చెల్లించే అద్దె మీద రివర్స్ జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. కాబట్టి తప్పకుండా జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ సొంత ఇంట్లోనే హాస్టల్ లేదా పీజీ సదుపాయం ఇస్తుంటే వాటిని గెస్ట్ హౌస్​లు, లాడ్జింగ్ సర్వీసులుగా పరిగణిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. నొయిడాకు చెందిన మరో కేసులోనూ ఏఏఆర్ లఖ్​నవూ బెంచ్ కూడా ఇదే తరహా తీర్పును వెలువరించింది. హాస్టల్ వసతికి గానూ రోజుకు రూ.1,000 కంటే తక్కువ ఉన్నా జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి